logo

వేర్వేరు ఘటనల్లో నలుగురి ఆత్మహత్య

మెదక్‌ జిల్లాలో వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. ఆన్‌లైన్‌ ఆటలాడి అప్పులపాలైన యువకుడు, కుటుంబ కలహాలతో వివాహిత, ఆర్థిక ఇబ్బందులతో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు.

Published : 22 Apr 2024 01:53 IST

మెదక్‌ జిల్లాలో వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. ఆన్‌లైన్‌ ఆటలాడి అప్పులపాలైన యువకుడు, కుటుంబ కలహాలతో వివాహిత, ఆర్థిక ఇబ్బందులతో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతుల మధ్య గొడవ జరగ్గా ఆత్మహత్యాయత్నం చేసిన భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది.


ఆన్‌లైన్‌ ఆటలు ఆడి అప్పులపాలై..  

నరేష్‌

చేగుంట: చేగుంట మండలంలో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కామారెడ్డి రైల్వే ఎస్సై తావునాయక్‌ తెలిపిన ప్రకారం వడియారం గ్రామానికి చెందిన కౌడి నరేష్‌ (33) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌ ఆటలకు ఆకర్శితుడయి తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వచ్చిన జీతాన్ని బెట్టింగ్‌లకు పెట్టేవాడు. ఆదాయం రాకపోగా రోజురోజుకు అప్పులు ఎక్కువయ్యాయి. వాటిని తీర్చే మార్గం కానరాక గ్రామ సమీపంలో రైలు కిందపడి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నరేష్‌కు భార్య లత, కుమారుడు ఉన్నాడు. ఆదివారం భార్య ఫిర్యాదుతో కేసు నమోదైంది.


కుటుంబ కలహాలతో వివాహిత..

స్వాతి

చేగుంట: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చేగుంటలో ఆదివారం జరిగింది. ఎస్సై బాలరాజు తెలిపిన ప్రకారం వంగ స్వాతి అలియాస్‌ మాధవి (35) దుస్తులు కుడుతూ, భర్త సత్యనారాయణ, కుమారుడు, కూతురుతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుంది. ఆదివారం ఉదయం పిల్లలు నిద్రలేచి చూసి, విషయాన్ని పొరుగు వారికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్వాతి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది.


ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..

ఏసు

హవేలిఘనపూర్‌: యువకుడు ఉరేసుకున్న ఘటన మండల పరిధిలో జరిగింది. హవేలిఘనపూర్‌ ఎస్సై ఆనంద్‌గౌడ్‌ తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన ఏసు(30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదే విషయమై కొన్ని రోజులుగా భార్య సుమలతకు చెబుతూ బాధపడుతుండేవాడు. శుక్రవారం ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లారు. మనోవేధనతో ఉన్న ఏసు శనివారం రాత్రి ఇంటి సమీపంలో ఉన్న చెట్టుకు చీరను మెడకు చుట్టుకుని ఉరేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మెదక్‌ ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


చికిత్స పొందుతూ..

సిద్దవ్వ

నంగునూరు: అప్పుల విషయమై దంపతుల మధ్య జరిగిన గొడవలో భార్య మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ మృతిచెందింది. రాజగోపాలపేట ఎస్సై భాస్కర్‌ రెడ్డి తెలిపిన వివరాలు.. నంగునూరు మండలం మగ్దుంపూర్‌కు చెందిన ఓరుగంటి మల్లేశం-సిద్దవ్వ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కుమార్తె పెళ్లి చేయడంతో రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన సిద్దవ్వ(45) తన ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన ఆమె కుమారుడు ప్రశాంత్‌, భర్త మల్లేశం వెంటనే చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


ధాన్యం కుప్పను ఢీకొని యువకుడి దుర్మరణం

భాను

సిద్దిపేట అర్బన్‌: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. సిద్దిపేట గ్రామీణ ఏఎస్‌ఐ పోచాగౌడ్‌ తెలిపిన వివరాలు దుబ్బాక మండలం అప్పనపల్లికి చెందిన దుబాసి భాను(24) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తిమ్మాపూర్‌లో శనివారం రాత్రి సోదరి వివాహ విందుకు హాజరై, ద్విచక్ర వాహనంపై గ్రామానికి బయల్దేరాడు. సిద్దిపేట తోర్నాల శివారులో ధాన్యం కుప్పపై బైక్‌ను తోలగా అదుపుతప్పి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న లారీ డ్రైవర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ధాన్యం పోసిన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని భాను సోదరుడు ప్రశాంత్‌ ఫిర్యాదుతో కేసు నమోదైంది.


డబ్బు విషయంలో గొడవ.. కార్మికుడి హత్య

సర్వన్‌ కుమార్‌

మనోహరాబాద్‌: బతుకు దెరువుకు వచ్చిన యువకుడు తోటి కార్మికుడి చేతిలో హత్యకు గురైన ఘటన మండల పరిధి ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని ఓ పరిశ్రమ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. మనోహరాబాద్‌ ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం శరణ్‌ జిల్లాలోని ఘర్కా తాలుకా బెల్హానియాకు చెందిన సర్వన్‌ కుమార్‌(23) తన అన్నలు సునిల్‌మాంజీ, ధనుంజయ్‌లతో కలిసి ముప్పిరెడ్డిపల్లిలోని వీవీఎం ఆగ్రో పరిశ్రమలో పని చేస్తూ.. అక్కడే యాజమాన్యం ఇచ్చిన గదుల్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి సర్వన్‌ తోటి కార్మికులైన అదే రాష్ట్రానికి చెందిన ఓంప్రకాశ్‌రాయ్‌, సంజయ్‌లతో కలిసి కిరాణా దుకాణానికి వెళ్లారు. రాత్రయినా తిరిగి రాకపోయేసరికి అతని సోదరుడు, తోటి కార్మికులు కలిసి వెతుకుతూ పరిశ్రమ గేటు వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి తమ్ముడి చరవాణికి ఫోన్‌ చేయగా కొద్ది దూరంలో మోగింది. ఫోన్‌ లభించిన ప్రదేశానికి 100 మీ. దూరంలో పరిశ్రమ ప్రహరీ పక్కన చెట్ల పొదల్లో రక్తపుమడుగులో సర్వన్‌ విగతజీవిగా పడి ఉన్నాడు. కొన్ని గంటల ముందు అతను, ఓంప్రకాశ్‌ డబ్బు విషయమై కంపెనీ గేటు ముందు గొడవపడ్డాడు. ఓంప్రకాశ్‌ విచక్షణారహితంగా కొట్టి, బండరాయితో తలపై మోదాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పరారైనట్లు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. సునీల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని