logo

కొత్తగా మరో 5 వేలు

ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైంది ఎన్నికల క్రతువు. ఇందులో యువత భాగస్వామ్యం కావాల్సిన అవసరం చాలా ఉంది. ముందుగా యువతి, యువకులు బాధ్యతగా ఓటు హక్కు పొందాలి.

Published : 22 Apr 2024 01:57 IST

ఓటు నమోదుకు దరఖాస్తుల సమర్పణ

చైతన్య కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు

న్యూస్‌టుడే, సిద్దిపేట: ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైంది ఎన్నికల క్రతువు. ఇందులో యువత భాగస్వామ్యం కావాల్సిన అవసరం చాలా ఉంది. ముందుగా యువతి, యువకులు బాధ్యతగా ఓటు హక్కు పొందాలి. ఇటీవల చేపట్టిన ఓటరు నమోదు, సవరణకు వారి నుంచి చక్కటి స్పందన లభించింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఏప్రిల్‌ 15 వరకు నమోదు, సవరణ, మార్పుచేర్పులకు అవకాశం కల్పించింది. ఫలితంగా జిల్లాలో వివిధ విభాగాల్లో 12,167 దరఖాస్తులు అందాయి. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరి పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ స్ఫూర్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు.

ఫారం 6కు 5,439 దరఖాస్తులు

ఫిబ్రవరి 8న ప్రకటించిన ఓటరు తుది జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 9,61,361. అందులో పురుషులు 4,71,616, మహిళలు 4,89,663, ఇతరులు 82 మంది ఉన్నారు. సంఖ్యాపరంగా పురుషులతో పోల్చితే మహిళలు - 18,047 మంది ఎక్కువగా ఉన్నారు. గత ఫిబ్రవరి 9 నుంచి ఏప్రిల్‌ 15 వరకు మరోసారి కొత్తవారి కోసం దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగా ఓటరు నమోదు (ఫారం-6)కు 5,439 మంది ముందుకొచ్చారు. మరణించిన వారు లేదా స్థానికంగా నివాసం ఉండని ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు (ఫారం-7) 1,811 దరఖాస్తులు అం దాయి. ఓటరు కార్డులో సవరణ, పోలింగ్‌ కేంద్రం మార్పులు-చేర్పులకు, కొత్త కార్డు పొందే (ఫారం-8) విభాగంలో 4,917 మంది సమర్పించారు.


గజ్వేల్‌ నుంచి గరిష్ఠం

జిల్లాలో ఎక్కువ శాతం నూతన ఓటరు నమోదుకు దరఖాస్తులు అందాయి. అందులో గరిష్ఠంగా గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి, కనిష్ఠంగా దుబ్బాక నుంచి ఉన్నాయి. ప్రత్యక్షంగా బీఎల్‌వోలు స్వీకరించారు. పరోక్షంగా ఆన్‌లైన్‌ విధానంలో అవకాశం కల్పించారు. సవరణ, మార్పు-చేర్పులకు సంబంధించి సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎక్కువ శాతం మొగ్గు చూపారు. ఈ నెల ఆఖరుకు తుది జాబితా వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముందడుగు వేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని