logo

బల్దియాలపై పట్టుకు యత్నం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధిక ఓట్లు రాబట్టుకుని పైచేయి సాధించాలన్న తలంపుతో అన్ని పార్టీలు బల్దియాలపై దృష్టిపెట్టాయి. కౌన్సిలర్లు, నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Updated : 22 Apr 2024 06:58 IST

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ బల్దియా కార్యాలయం

న్యూస్‌టుడే, గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధిక ఓట్లు రాబట్టుకుని పైచేయి సాధించాలన్న తలంపుతో అన్ని పార్టీలు బల్దియాలపై దృష్టిపెట్టాయి. కౌన్సిలర్లు, నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివాహాలు, ఇతర శుభకార్యాల్లో తారసపడినా ఎన్నికల విషయాలే చర్చిస్తూ తమవైపు తిప్పుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం సిద్దిపేటతోపాటు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాలతో సహా జిల్లాలో ఐదు పురపాలికలున్నాయి. ఇక్కడ మొత్తం 115 మంది కౌన్సిలర్లున్నారు.  ఒక్కో వార్డు పరిధిలో గరిష్ఠంగా వేయి నుంచి  రెండు వేలకుపైగా ఓటర్లున్నారు. స్థానిక కౌన్సిలర్ల పరపతి ద్వారా ఓట్లను రాబట్టుకునేందుకు అన్ని పార్టీలు శాయశక్తులా పావులు కదుపుతున్నాయి. సమావేశం అవుతున్నారు.

అసంతృప్త నేతలతో లబ్ధి

జిల్లా వ్యాప్తంగా అన్ని బల్దియాల్లో భారాస పార్టీకే  సంఖ్యాపరంగా ఎక్కువ మంది కౌన్సిలర్లున్నారు. వీరిని కాపాడుకుని పార్టీని మరింత పటిష్ఠం చేయాలని భారాస నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని ఇతర పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఆయా బల్దియాల్లో కౌన్సిలర్ల విషయానికొస్తే సిద్దిపేట బల్దియాలో 36 భారాస, 5 స్వతంత్ర, 1 భాజపా, 1 ఎంఐఎం కౌన్సిలర్లున్నారు.  ఇటీవల ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌లో 13 భారాస, 6 స్వతంత్ర, 1 కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించి అందరూ భారాస గూటికే వెళ్లినా కొందరు అసంతృప్తితో ఉన్నారు. వారిని తమ వైపు మార్చుకునేందుకు ఇతర పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. 20 కౌన్సిలర్లున్న హుస్నాబాద్‌లో, 12 మంది సభ్యులున్న చేర్యాల, 20 మంది ఉన్న దుబ్బాక బల్దియాల్లోనూ ఓట్ల కోసం కౌన్సిలర్లు లక్ష్యంగా వ్యూహం అమలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం భారాసకే మొగ్గు చూపగా ఆ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇదే పంథాను కొనసాగించాలని భారాస వ్యూహరచన చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తామే ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని పురోభివృద్ధి తమతోనే సాధ్యమని భాజపా నేతలు అంటున్నారు. జిల్లాలోని బల్దియాల్లో తెరచాటు రాజకీయాలు జోరందుకున్నాయి.


కాంగ్రెస్‌లో అభ్యర్థిత్వానికి ఎదురుచూపులు

హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి ఉన్న కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి ఇంకా కాంగ్రెస్‌ అభ్యర్థిని ఖరారు చేయలేదు. భాజపా నుంచి బండి సంజయ్‌.. భారాస నుంచి వినోద్‌కుమార్‌ ఖరారై ప్రచారం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నాయకులు ఎక్కడికక్కడ లోక్‌సభ పరిధిలో పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాలు విస్తృతంగా చేపడుతున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఉంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారోనని శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. భారాస, భాజపా వారి ప్రచారం హుస్నాబాద్‌లో ఒక దఫా పూర్తయింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎలా ముందడుగు వేయాలో కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. భారాస, భాజపాల ప్రచార వాహనాలు పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వానికి మాజీ శాసనసభ్యుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కరీంనగర్‌ మార్కెట్‌ మాజీ ఛైర్మన్‌ వెలిచాల రాజేందర్‌రావు గతంలోనే అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ సన్నాహాక సమావేశాల్లో రాజేందర్‌రావు మాత్రం పాల్గొంటున్నారు. కేరళలో ప్రచారం నిమిత్తం ఉన్న ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌ త్వరలో కరీంనగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని