logo

‘కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కష్టాలు’

కేసీఆర్‌ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Published : 22 Apr 2024 02:04 IST

పెద్దకోడూరు కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న హరీశ్‌రావు తదితరులు

చిన్నకోడూరు, న్యూస్‌టుడే: కేసీఆర్‌ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. చిన్నకోడూరు మండలంలోని పెద్దకోడూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కొంత మేర ధాన్యం తడిసిపోయిందని, తూకం వేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు రైతులు తెలిపారు. వ్యవసాయబావుల వద్ద మోటార్లు కాలిపోతున్నాయా అని హరీశ్‌రావు అడుగగా.. ఒక్కటే నెలలో రెండు మోటార్లు కాలిపోతే రూ.22 వేలు ఖర్చు అయినట్లు ఓ రైతు బదులు ఇచ్చారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని హరీశ్‌రావు సూచించారు. అనంతరం గంగాపూర్‌లో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ, పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వైస్‌ ఎంపీపీ పాపయ్య, భారాస రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మండలశాఖ అధ్యక్షుడు కాముని శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కనకరాజు, నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేటలో ఆదివారం జరిగిన పలు శుభకార్యాలకు ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ రోజాశర్మ హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని