logo

ఎన్నికల విధులెక్కడో.. ఓటక్కడే!

ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడాన్ని బాధ్యతగా భావించాలి. ప్రతి ఒక్కరు పోలింగ్‌కు కదలాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది.

Published : 22 Apr 2024 02:08 IST

న్యూస్‌టుడే, నారాయణఖేడ్‌ టౌన్‌: ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడాన్ని బాధ్యతగా భావించాలి. ప్రతి ఒక్కరు పోలింగ్‌కు కదలాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. సాధారణ ప్రజలే కాకుండా పోలింగ్‌ విధులు నిర్వర్తించే సిబ్బంది సైతం ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటోంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓటుహక్కు కలిగి ఉండి.. మరో చోట ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించింది. ఎన్నికల విధులు నిర్వర్తించే చోట లేదా ఓటు హక్కు కలిగిన ప్రాంతంలో ఓటు చేయడానికి అధికారులు ఈడీసీ(ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌) ద్వారా అవకాశం కల్పిస్తున్నారు..

అవకాశం ఎలాగంటే..

లోక్‌సభ స్థానంలోని ఏ పోలింగ్‌ కేంద్రంలోనైనా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఈడీసీ ద్వారా ఓటేయవచ్చు. ఉదాహరణకు నారాయణఖేడ్‌ పట్టణంలో ఓటుహక్కు ఉన్న ఉద్యోగి అందోలు పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వర్తించాల్సి వస్తే.. ఈడీసీ ద్వారా అక్కడ ఓటేయొచ్చు. నారాయణఖేడ్‌, అందోలు నియోజకవర్గాలు జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం    పరిధిలోకి వస్తాయి. అదే ఉద్యోగి మెదక్‌ జిల్లాలో విధులు చేపడితే.. అక్కడ ఓటేసే అవకాశం ఉండదు. ఎందుకంటే లోక్‌సభ స్థానం మారుతుంది. ఆ ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ అధికారులతోపాటు సూక్ష్మ పరిశీలకులు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. వీరందరూ ఈడీసీ లేదా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది.

ఫారం 12ఏ సమర్పించాలి

ఈడీసీ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునేవారు ఫారం-12ఏను తప్పులు లేకుండా పూరించి, ఎన్నికల విధుల వివరాలు జతపరిచి సంబంధిత సహాయక రిటర్నింగ్‌  అధికారి(ఏఆర్‌వో)కి అందించాలి. ఎఆర్‌వో పరిశీలించి రిటర్నింగ్‌ అధికారికి పంపిస్తారు.  అన్ని అంశాలు సరిగ్గా ఉన్నాయని ధ్రువీకరించుకున్నాక రిటర్నింగ్‌ అధికారి ఈడీసీ జారీ చేస్తారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాతో పాటు వికారాబాద్‌ జిల్లాల్లో కలిపి 21,381 మంది  ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు.   సంగారెడ్డి జిల్లాలో 8363 మంది ఎన్నకల విధుల్లో భాగస్వాములవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని