logo

యువోత్సాహం

కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో యువత నుంచి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 8న తుది జాబితా విడుదల చేయగా పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూలు..

Published : 22 Apr 2024 02:10 IST

ఓటు నమోదుకు కదిలారు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: కొత్తగా ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడంతో యువత నుంచి స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 8న తుది జాబితా విడుదల చేయగా పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూలు వెలువడంతో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో మరోమారు అవకాశం కల్పించారు. 18 ఏళ్లు నిండిన వారితో పాటు చిరునామా మార్పు, దిద్దుబాటు, అభ్యంతరాలకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 1 నుంచి ఈనెల 15 వరకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తులను అధికారులు పరిశీలించి అనుబంధ జాబితాను విడుదల చేయనున్నారు.

73,702 మంది..: ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 1,67,103 దరఖాస్తులు అందాయి. ఇందులో అత్యధికంగా కొత్తగా ఓటరు నమోదు కోసం జిల్లా వ్యాప్తంగా 73,702 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి 28,583 మంది ఓటరు నమోదు కోసం దరఖాస్తులు సమర్పించారు. ఓటరు నమోదుపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో అర్హులంతా దరఖాస్తులకు ముందుకువచ్చారు.

మార్పులు, చేర్పులకు..

ఓటరు జాబితాను తప్పులకు తావులేకుండా సిద్ధం చేసేందుకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అర్హులను జాబితాలో చేర్చడంతోపాటు మృతిచెందిన వారి పేర్లను తొలగించడం, మార్పులు చేర్పులు కూడా చేపట్టారు. ఫారం-7 ద్వారా 46,995 పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. మార్పులు చేర్పులకు సంబంధించి ఫారం-8 ద్వారా 46,367 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే 1,59,335 దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని