logo

నిర్మించి.. వదిలేసి..

చేగుంటలో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి వృథాగా వదిలేశారు. సుమారు ఐదేళ్ల క్రితం జిల్లాలోనే మొదటిసారిగా చేగుంటలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటి నిర్మాణం పూర్తిగా నత్తనడకన మూడేళ్ల పాటు సాగింది.

Published : 22 Apr 2024 02:11 IST

నిరుపయోగంగా రెండు పడక గదుల ఇళ్లు

చేగుంటలో పంపిణీ చేయకుండా ఉన్న నివాసాలు

న్యూస్‌టుడే, చేగుంట: చేగుంటలో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి వృథాగా వదిలేశారు. సుమారు ఐదేళ్ల క్రితం జిల్లాలోనే మొదటిసారిగా చేగుంటలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటి నిర్మాణం పూర్తిగా నత్తనడకన మూడేళ్ల పాటు సాగింది. మొత్తం 100 ఇళ్లను ఎట్టకేలకు రెండేళ్ల క్రితం పూర్తిచేశారు. వీటిని బహుళ అంతస్తులతో నిర్మాణం చేపట్టారు. ప్రధాన రోడ్డుతో పాటు వీటి చుట్టూ సిమెంట్‌ రోడ్లను కూడా నిర్మించారు. అలాగే విద్యుత్తు, నీటి సౌకర్యం కూడా కల్పించారు. విద్యుత్తు అంతరాయం ఉండకుండా నియంత్రిక కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇంతవరకు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఏడాది క్రితం లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ నిర్వహించాలని ఇళ్ల వద్దనే అధికారులు సమాయత్తం అయ్యారు. కానీ చాలా మంది వచ్చి దీనిని అడ్డుకున్నారు. అర్హుల పేర్లు లేవని మొత్తం ఇందులో అనర్హులే ఉన్నారని ఆందోళన చేయటంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత వాటి వైపు అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి కూడా చూడటం లేదు. పలుమార్లు పేదలు ఇళ్ల వద్దకు వెళ్లి నివాసం ఉండాలని చూస్తున్నారు. విషయం తెలుసుకొని అధికారులు వెళ్లి వారిని పంపిస్తున్నారు. రెండేళ్లుగా ఎప్పుడు ఇస్తారని చూస్తున్నా వారికి నిరాశే ఎదురవుతూ వస్తోంది. ప్రస్తుతం వీటిలో అసాంఘీక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. పంపిణీ చేస్తేనే ఎలాంటి సమస్యలేకుండా ఉంటుంది. అన్ని వసతులు కల్పించినా కూడా ఎందుకు ఇవ్వటంలేదని పేదలు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని