logo

రైతులకు సహకారం.. అభివృద్ధిలో ఆదర్శం

రైతులకు అవసరమైన సేవలందించడంలో నర్సాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆదర్శంగా నిలుస్తోంది. సంఘం ఆవిర్భావం నుంచి అద్దె భవనంలో నెట్టుకొస్తుండగా.. ప్రస్తుతం సొంత భవనం ఏర్పాటైంది.

Published : 22 Apr 2024 02:15 IST

ఆర్థిక స్వావలంబన దిశగా నర్సాపూర్‌ పీఏసీఎస్‌

సహకార సంఘం ఆవరణలో నిర్మించిన గోదాం

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: రైతులకు అవసరమైన సేవలందించడంలో నర్సాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆదర్శంగా నిలుస్తోంది. సంఘం ఆవిర్భావం నుంచి అద్దె భవనంలో నెట్టుకొస్తుండగా.. ప్రస్తుతం సొంత భవనం ఏర్పాటైంది. ఆదాయం పెంచుకునేందుకు కృషి చేస్తూనే రాయితీపై ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహించి మద్దతు ధరలు అందిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. రైతుల సహకారంతో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇచ్చిన రుణాలను వసూలు చేస్తూ అభివృద్ధి వైపు పయనిస్తోంది.

రూ.48 లక్షలతో పక్కా భవనం

కొన్ని దశాబ్దాల నుంచి నర్సాపూర్‌ పీఏసీఎస్‌ అద్దె భవనంలో కొనసాగుతూ వస్తోంది. రాజుయాదవ్‌ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం కృషి ఫలితంగా మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సహకారంతో పక్కా భవనానికి నోచుకుంది. వెల్దుర్తి వెళ్లే మార్గంలో ప్రధాన రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో రెండంతస్తుల భవనం నిర్మించారు. ఇందుకు రూ.48 లక్షల నిధులను వ్యయం చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు దుకాణాలు, మొదటి అంతస్తులో కార్యాలయం నిర్మించారు. అన్ని వసతులు సమకూర్చారు. ఇక్కడికి వచ్చే రైతులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

రూ.15లక్షలతో గోదాం

సహకార సంఘం ఆవరణలోనే రూ.15లక్షలతో విశాలమైన గోదాం నిర్మాణం చేపట్టారు. ఇందులో సింహభాగం నిధుల్ని అధ్యక్షుడు రాజుయాదవ్‌ సొంతంగా భరించారు. కొంత నిధులు నాబార్డు నుంచి వచ్చాయి. 500 మెట్రిక్‌ టన్నుల ఎరువుల నిల్వకు అవకాశం ఏర్పడింది. యూరియా, డీఏపీ, పొటాష్‌ వంటి ఎరువులు అందుబాటులో ఉంచుతున్నారు. రైతులు ఏ సమయంలో వచ్చినా లేవనే సమాధానం లేకుండా చూస్తున్నారు.  

గోదాంల నిర్మాణానికి ప్రతిపాదన...

నూతనంగా రెండు వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాంల నిర్మాణం చేపట్టాలని సంఘం సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని ప్రతిపాదనలు పంపారు. స్థలం కేటాయింపులు జరిగితే నాబార్డు సాయంతో గోదాం నిర్మాణం చేపట్టాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వీటిల్లో భద్రపరిచేందుకు అవకాశమేర్పడుతుంది.


మూడు కేంద్రాల నుంచి 17 వరకు..

నర్సాపూర్‌ మండలం మొత్తానికి 34 గ్రామాలకు ఒకే సహకార సంఘం ఇది. గతంలో రైతులు ప్యాక్స్‌ ఆధ్వర్యంలో మూడు కొనుగోలు కేంద్రాలు మాత్రమే నిర్వహించేవారు. ప్రస్తుతం మండలం మొత్తం 17 గ్రామాల్లో పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వర్షాకాలం, యాసంగిలో రెండు దఫాలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. తద్వారా సంఘానికి అదనపు ఆదాయమూ సమకూరుతోంది. సహకార సంఘం నుంచి స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు సైతం పెద్దఎత్తున పంపిణీ చేస్తున్నారు. దీర్ఘకాలిక రుణాలు రూ.1.20కోట్లకు పైగా చెల్లించారు. పంట రుణాలు రూ.2.50కోట్ల వరకు అందించారు. రికవరీ శాతం 65గా ఉంది. మరింత రికవరీకి ప్రయత్నాలు చేస్తున్నారు.


మరింత మెరుగైన సేవలు
-రాజుయాదవ్‌, ప్యాక్స్‌ అధ్యక్షుడు

రైతులకు మరింత మెరుగైన సేవలందించే కృషి చేస్తున్నాం. సంఘంలోని సభ్యులందరి, పాలకవర్గం సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైంది. మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సహకారంతో పక్కా భవనం ఏర్పాటైంది. నూతన సభ్యులను చేర్చుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి గల రైతులు సభ్యత్వం పొందవచ్చు.

పీఏసీఎస్‌ నర్సాపూర్‌

గ్రామాలు: 34
సభ్యులు: 1800
వార్షిక ఆదాయం: రూ.3కోట్లు
దీర్ఘకాలిక రుణాలు: రూ.1.20కోట్లు
పంట రుణాలు: రూ.2.50కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు