logo

అవగాహన లేక.. ముందుకు రాక

మత్స్యకార సంఘాల బలోపేతానికి ఉపాధి హామీ పథకం తోడ్పాటు అందిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు బీడు భూములను సేద్యంలోకి తీసుకురావడం, నీటి వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ,

Updated : 22 Apr 2024 06:11 IST

కేంద్ర పథకాన్ని వినియోగించుకోని మత్స్యకారులు

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: మత్స్యకార సంఘాల బలోపేతానికి ఉపాధి హామీ పథకం తోడ్పాటు అందిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇప్పటి వరకు బీడు భూములను సేద్యంలోకి తీసుకురావడం, నీటి వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సాగు రంగానికి అవసరమైన వనరులను తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కాగా...తాజాగా మత్స్యకార సంఘాల పేరిట చేపల పెంపకానికి గుంతలు తీసే పనులను చేపడుతోంది. కానీ ఈ విషయంపై జిల్లాలోని మత్స్యకారులకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించకపోవడంతో ఈ పథకానికి దూరమవుతున్నారు.

నాలుగు రకాల కుంటలు

జిల్లాలోని ఆయా గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ చెరువులు, కుంటలు, చెరువు శిఖం, మత్స్య సహకార సంఘాల పేరిట ఉన్న భూముల్లో ఈ కుంటలను నిర్మిస్తారు. వీటిలో చేపల తయారీకి ఉపయోగకరంగా నాలుగు రకాలుగా కుంటలు నిర్మిస్తారు. ఒక్కో దానిలో సుమారుగా 20 వేల వరకు చేపలు పెరిగేలా నిర్మాణాలు చేపడుతారు. ఉపాధి కూలీల ద్వారా చేయించే ఈ పనులకు ఒక్కో కుంట నిర్మాణానికి రూ.8-9 లక్షల వరకు వెచ్చిస్తారు.

మూడేళ్లు అవుతున్నా..

ప్రధాన మంత్రి మత్స్యయోజన పథకాన్ని(పీఎంఎంవైఎస్‌) చేపల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల కోసం కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభమై మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు జిల్లాలో ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. చాలా వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు నిరక్షరాస్యులు కావడంతో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలపై అంతగా అవగాహన ఉండదు. ఈ పథకాలు క్షేత్ర స్థాయిలోకి వెళ్లడంతో పాటు మత్స్యకారులకు అవగాహన కల్పించడంలో సంబంధిత శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మంచి లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం నిరుపయోగంగా మారుతుంది.


జీవనోపాధికి ఉపయుక్తం
- శ్రీనివాస్‌, డీఆర్‌డీవో

మత్స్య కార్మికులకు జీవనోపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కానీ జిల్లాలోని మత్స్యకారులు ఈ పథకానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇంతవరకు ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ పథకంలో కుంటలు నిర్మించుకునేందుకు రూ.8-10 లక్షల వరకు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్య సహకార సంఘాలు: 283
సభ్యులు: 18507
పురుషుల సంఘాలు: 261
సభ్యులు: 17482
మహిళా సంఘాలు: 22
సభ్యులు: 1025

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని