logo

పారుతున్న పాచికలు.. చురుగ్గా చేరికలు

లోక్‌సభ ఎన్నికల వేళ ఆయా పార్టీలు చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను చేర్చుకోవడం ద్వారా పట్టు సాధించాలని భావిస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో మరింత పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్నాయి.

Updated : 22 Apr 2024 06:10 IST

న్యూస్‌టుడే-మెదక్‌: లోక్‌సభ ఎన్నికల వేళ ఆయా పార్టీలు చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను చేర్చుకోవడం ద్వారా పట్టు సాధించాలని భావిస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో మరింత పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎక్కువ శాతం అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు సిద్ధమవుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను చేర్చుకోవాలని ఆ పార్టీ అధిష్ఠానం సూచించడంతో చేరికలపై దృష్టి సారించారు. ఇటీవల భారాస నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా, ఆలోగా మరింత మంది వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు.

మండల ప్రజాప్రతినిధులు సైతం...

మండలాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను సైతం కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుంటున్నారు. చేగుంట ఎంపీపీ శ్రీనివాస్‌ భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత తూప్రాన్‌ ఎంపీపీ స్వప్న, చిలప్‌చెడ్‌ ఎంపీపీ వినోద, నిజాంపేట ఎంపీపీ సిద్దిరాములు హస్తం గూటికి చేరారు. మరోవైపు గ్రామాల్లో ఎంపీటీసీ సభ్యులు, మొన్నటివరకు సర్పంచిగా కొనసాగిన వారు సైతం పార్టీ మారుతున్నారు.


మాజీ ఎమ్మెల్యే చేరికతో...

కౌడిపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయనకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్‌ టికెట్‌ దక్కకపోగా.. ఎంపీ టికెట్‌ ఇస్తామని అప్పట్లో సముదాయించి ఒప్పించారు. తీరా ప్రస్తుత ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డికి టికెట్‌ కేటాయించడంతో ఆయన భారాసను వీడారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మదన్‌రెడ్డి చేరికతో నర్సాపూర్‌ నియోజకవర్గంలో మరింత బలం చేకూరుతుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.


ప్రముఖుల ప్రచారం

మెదక్‌ పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే యోచనలో ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, ఆయా పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. భారాస అభ్యర్థి గెలుపు బాధ్యతను మాజీ మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. దీంతో ఆయన పార్లమెంట్‌ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు తరఫున శనివారం మెదక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ర్యాలీ, కార్నర్‌ మీటింగ్‌ ద్వారా శ్రేణులను ఉత్తేజపరిచారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు.


పట్టు సాధించేందుకు...

జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌లో కాంగ్రెస్‌, నర్సాపూర్‌లో భారాస విజయం సాధించింది. అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు మొగ్గుచూపుతున్నారు. ముందుగా మాజీ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గ పరిధి తూప్రాన్‌పై దృష్టిపెట్టారు. అక్కడి పుర వైస్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌తో సహా ఆరుగురు భారాస కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మున్సిపల్‌ ఛైర్మన్‌ రవీందర్‌గౌడ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయం సాధించారు. రామాయంపేట మున్సిపాలిటీలోని నలుగురు భారాస కౌన్సిలర్లు హస్తం పార్టీలో చేరారు. ఈ క్రమంలో మెదక్‌లో మున్సిపల్‌ ఛైర్మన్‌ చంద్రపాల్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రచారం జోరుగా జరగడంతో ఆయనతో పాటు మరో ఎనిమిది కౌన్సిలర్లు, ముగ్గురు కో-ఆప్షన్‌ సభ్యులు ఇటీవల కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మెదక్‌లో మరికొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. భారాస నుంచి రావడంతో కొంత మేలవుతుందని అధికార పార్టీ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వలసలను ప్రోత్సహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని