logo

‘ఓటరు’గా సమాజాన్ని చదివేద్దాం!

ఎన్నికలు.. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక ఘట్టం. ఓటు రూపంలో రాజ్యాంగం తిరుగులేని హక్కును కల్పించింది. ఐదేళ్లకోసారి వచ్చే సదవకాశం.. మనతో పాటు సమాజ ప్రగతిపై ప్రభావం చూపుతుంది. పారదర్శక నేత ఎన్నుకునే ఓటింగ్‌పై ఎంతోమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు.

Updated : 22 Apr 2024 02:51 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి టౌన్‌, వికారాబాద్‌

ఎన్నికలు.. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక ఘట్టం. ఓటు రూపంలో రాజ్యాంగం తిరుగులేని హక్కును కల్పించింది. ఐదేళ్లకోసారి వచ్చే సదవకాశం.. మనతో పాటు సమాజ ప్రగతిపై ప్రభావం చూపుతుంది. పారదర్శక నేత ఎన్నుకునే ఓటింగ్‌పై ఎంతోమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రస్తుతం చదువు ఎంత ప్రధానమో.. లోక్‌సభ ఎన్నికల వేళ ఓటరు తన బాధ్యతను సమర్థంగా నిర్వహించాల్సినది అంతే. ఈ నేపథ్యంలో తలరాతను మార్చే చదువు.. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఓటు ప్రాధాన్యాన్ని విద్యావంతులు, నవ యువత గుర్తించాల్సిన ఆవశ్యకతపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.


  • చదువు.. సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఉన్నతులుగా ఎదిగేందుకు బాటలు వేస్తుంది. ఇందుకు సుదీర్ఘంగా, ప్రణాళికాయుతంగా శ్రమించాలి. ఆటుపోట్లను అధిగమించాలి. లక్ష్యంతో ముందుకు సాగితే సత్ఫలితం సాధ్యం.

  • ఓటు.. సరైన నేతను ఎన్నుకుంటే సుపరిపాలన అందుతుంది. కష్టం, నష్టం ఏదైనా మనకంటూ భరోసానిచ్చే నాయకుడు చెంతనే ఉంటారు. సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకుంటే ఆ ఫలితం అందరికీ దక్కుతుంది.

మంచి కోర్సు.. ఉత్తమ నేత..

డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇతర కోర్సుల ఎంపికలో ఆపసోపాలు పడుతుంటారు. ఏ కోర్సు ఎలా ఉంటుంది.. దేనికి డిమాండ్‌ ఉంది.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయా.. అన్న కోణంలో ఆరా తీస్తుంటారు. సీనియర్ల అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. ఎన్నికల వేళ అంతే జాగ్రత్త వహించాలి. జాతీయ, రాష్ట్ర, స్వతంత్ర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలుస్తుంటారు. వారి విద్యార్హత, నేపథ్యం, నేర చరిత, ప్రవర్తన, గుణగణాలు.. తెలుసుకోవాల్సిన బాధ్యత ఓటరుదే. ఇందుకు సమయం కేటాయించాలి. ఐదేళ్లు పాలించే నేత కోసం ఆలోచించడం తప్పు కాదు కదా.

లోక్‌సభ స్థానాల్లో ఇప్పటి వరకు అందిన నామినేషన్లు

మెదక్‌: 17  జహీరాబాద్‌: 9


ఫలితం ఏదైనా ముఖ్యమే..

సెమిస్టర్‌ విధానంలో డిగ్రీ పరీక్షలు సాగుతుంటాయి. ఒకవేళ అనుత్తీర్ణులైతే మరో అవకాశం ఉంటుంది. ఎన్నికలు మాత్రం అలా కాదు. ఐదేళ్లకోసారి మాత్రమే జరుగుతాయి. ఒక్కసారి ఓటేస్తే ఐదేళ్ల వరకు వేచి చూడాల్సిందే. ఓటేయడం ఎంత ముఖ్యమో.. ఎవరికి వేశామన్నది కూడా అంతే. ఈ క్రమంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని చైతన్యవంతులు చెబుతుంటారు. కొందరు సామాజికవర్గం, కులం, మతం వంటివి పరిగణనలోకి తీసుకుంటున్నారు. అవన్నీ పక్కనపెట్టి ఓటేయాలి. ఎన్నికైన తరువాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ మేర పని చేస్తారనేది గమనించాలి.

కొత్తగా నమోదైన ఓటర్లు

సిద్దిపేట 5439
మెదక్‌ 3131
సంగారెడ్డి 7,702
వికారాబాద్‌ 4,200


చక్కటి వసతి.. ఆశించిన ప్రగతి..

మూడేళ్ల డిగ్రీ, నాలుగేళ్ల ఇంజినీరింగ్‌, ఐదున్నరేళ్ల వైద్య విద్య.. ఇలా ఏదైనా ఎంచుకునే సమయంలో కళాశాల అత్యంత కీలకం. కనీస వసతులు, గత ఫలితాలు, అధ్యాపకులు ఇలా అన్నింటిపై ఆరా తీస్తారు. ఓ సారి అక్కడికి వెళ్లి చుట్టేస్తారు. నచ్చితేనే చివరికి అంగీకారం చెబుతారు. ఎన్నికల విషయానికొస్తే.. బరిలో నిలిచే నాయకులు, సంబంధిత పార్టీలు ఏకంగా మేనిఫెస్టో రూపంలో దండిగా హామీలు గుప్పిస్తారు. అవన్నీ ఆచరణలో సాధ్యమేనా గమనించాలి. గత అనుభవాలు లెక్కలోకి తీసుకోవాలి. ఇలా యోచించి ఓటెత్తాలి.

జిల్లాల వారీగా యువత.. లక్షల్లో

సిద్దిపేట  4.50
మెదక్‌  03
సంగారెడ్డి 07
వికారాబాద్‌ 4.75


కష్టపడాలి.. గడపదాటాలి..

ఆరు నెలలు లేదా ఏడాదంతా కష్టపడి పరీక్షలు రాయకుంటే వృథా. ఓటు హక్కు ఉండి వినియోగించుకోకపోతే సార్థకత చేకూరదు. కొన్ని సందర్భాల్లో ఒక ఓటు ఫలితాన్ని తారుమారు చేస్తుంది. అందుకే అర్హులంతా మే 13న జరిగే ఓటేయడానికి గడపదాటాలి. పది నిమిషాలు కేటాయిస్తే.. బాధ్యతను నిర్వర్తించినవారవుతారు. దివ్యాంగులు ఎంత కష్టమైనా ప్రతి ఎన్నికల్లో కేంద్రాల వరకు వస్తున్నారు. యువత స్ఫూర్తిని చాటాలి.

పోలింగ్‌ కేంద్రాలు..

సిద్దిపేట  1009
సంగారెడ్డి  1616
మెదక్‌  579
వికారాబాద్‌ 1133


తప్పు చేయొద్దు.. హక్కు కోల్పోవద్దు

పరీక్ష రాసేపుడు చీటీ కొట్టినా.. చూచిరాతకు పాల్పడినా.. డిబార్‌ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో మిగిలిన పరీక్షలకు దూరం కాక తప్పదు. ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగితే ఐదేళ్లు డిబార్‌తో సమానం. అడిగే హక్కును కోల్పోతాం. అభివృద్ధి సాధ్యపడదు. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఎన్నికల యంత్రాంగం ప్రలోభాల అడ్డుకట్టకు చర్యలు తీసుకుంటోంది. ఎక్కడికక్కడ కట్టడిపై దృష్టి సారించింది.

స్వాధీనం చేసుకున్న సొమ్ము (రూ.లలో..)

సిద్దిపేట  66,10,000
సంగారెడ్డి  1,10,00,000
మెదక్‌ 32,98,030
వికారాబాద్‌ 1,58,00,000


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని