logo

మళ్లీ వెనక బాటే !

బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు

Published : 25 Apr 2024 02:40 IST

ఇంటర్‌ ద్వితీయ ఫలితాల్లో గతేడాది, ఈ సారి జిల్లాకు 15వ స్థానం

‘ప్రథమ’లోనూ తగ్గిన ఉత్తీర్ణత  

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, సంగారెడ్డి మున్సిపాలిటీ, జహీరాబాద్‌ అర్బన్‌, ఝరాసంగం, కల్హేర్‌, మునిపల్లి, జోగిపేట టౌన్‌: ఇంటర్‌ ఫలితాల్లో ఎప్పటిలాగే అమ్మాయిల హవా కొనసాగింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గతేడాదితో పోల్చితే ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గింది. గత విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 57 కాగా.. ఈసారి 55.29కి పడిపోయింది. రాష్ట్రస్థాయిలో గతేడాది 17వ స్థానంలో ఉండగా ఈసారి 18వ స్థానంలో జిల్లా నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో గతేడాది 66శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఈ సంవత్సరం 65.57 శాతం ఉత్తీర్ణత నమోదయింది. గత సంవత్సరం రాష్ట్రంలో 15వ స్థానంలో ఉండగా ఈసారీ అదే స్థానం దక్కింది.

బాలికలే అధికం..: ప్రథమ సంవత్సరం పరీక్షకు 15,989 మంది విద్యార్థులు హాజరుకాగా 8,840 మంది విద్యార్థులు పాసయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలికల శాతం ఎక్కువగా ఉంది. 6,837 మంది బాలురకు 2,848 మంది, బాలికల్లో 9,152 మందికి 5,992 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 41.66 కాగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 65.47 ఉండటం విశేషం. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 15,273 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 10,014 మంది గట్టెక్కారు. పరీక్ష రాసిన వారిలో బాలురు 6,228 మందికి 3,375 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 9,045 మందికి 6,639 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 54 ఉండగా బాలికల ఉత్తీర్ణత 73.40 శాతంగా ఉంది.

వృత్తివిద్యలో..: ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,681 మంది హాజరుకాగా 912 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 695 మంది పరీక్ష రాయగా 269 మంది, బాలికలు 986కు 643 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 38.71 ఉండగా బాలికల ఉత్తీర్ణత శాతం 65.21గా ఉంది. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1,321 మంది  హాజరుకాగా 887 మంది గట్టెక్కారు. బాలురు 496కు 257, బాలికలు 825కి 630 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 51.81 ఉండగా బాలికల ఉత్తీర్ణత 76.36శాతం ఉండటం విశేషం.

బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు. అత్యధికంగా జోగిపేటలో 77కి 70 పాసయ్యారు. అత్యల్పంగా ఝరాసంగంలో 48 మందికి 41 ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 483 మందికి 359 విద్యార్థులు ఉత్తీర్ణులై 74.33 శాతం సాధించారు. అత్యధికంగా జోగిపేటలో 69 మందికి 22 మంది పాసయ్యారు.
సత్తాచాటిన రంజోల్‌ విద్యార్థులు: ఇంటర్‌ ఫలితాల్లో జహీరాబాద్‌ మండలం రంజోల్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థినులు.. శిరీష 990, పింకీ 982 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో 111 మంది పరీక్ష రాయగా 89 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 113 మందికి 96 మంది పాసయ్యారు.

ఖేడ్‌ ప్రభుత్వ కళాశాలకు రాష్ట్ర ర్యాంకులు

నారాయణఖేడ్‌ రూరల్‌, న్యూస్‌టుడే: ఖేడ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మెరిశారు. ప్రథమ సంవత్సరానికి సబంధించి బైపీసీ విభాగంలో బైజా సభా 440 మార్కులకు 437 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించింది. సాయివాణి 434 మార్కులతో రాష్ట్ర స్థాయి నాలుగో ర్యాంకు, ఎంపీసీ విభాగంలో అక్షయ రాథోడ్‌ 465 మార్కులతో రాష్ట్ర స్థాయి మూడో ర్యాంకు,  వడ్ల స్నేహ 460 మార్కులతో రాష్ట్ర స్థాయి 11వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ కళింగ కృష్ణ  కుమార్‌ తెలిపారు.

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో..

సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు సంబంధించి.. జిల్లాలో ఇంటర్మీడియట్‌లో 800 మందికి 672 మంది ఉత్తీర్ణులై 84 శాతం సాధించారు. ఇందులో కొండాపూర్‌లో 59మందికి 59, న్యాల్‌కల్‌లో 12కి 12 ఉత్తీర్ణులై శతశాతం ఫలితాలు సాధించాయి. అత్యల్పంగా నారాయణఖేడ్‌లో 35కి 17 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ కళాశాలల్లో ప్రథమ సంవత్సరానికి సంబంధించి.. 857 మందికి 639 మంది ఉత్తీర్ణులై 75 శాతం సాధించారు. కొండాపూర్‌లో 76కి 76 మంది ఉత్తీర్ణులై వంద శాతం ఫలితాలు వచ్చాయి. అత్యల్పంగా నారాయణఖేడ్‌లో 70కి 30 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఆదర్శ కళాశాలలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 979కి 340 మంది ఉత్తీర్ణతతో 35 శాతం, ద్వితీయ సంవత్సరంలో 973కి 544 మంది ఉత్తీర్ణతతో 56 శాతం సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను డీఈవో వెంకటేశ్వర్లు అభినందించారు. మునిపల్లి ఆదర్శ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థిని తెహ్రీన్‌ బైపీసీలో 934 మార్కులు, సీఈసీలో మనీషా 918 మార్కులు సాధించారు.

ఆదర్శ కళాశాలలు..

కస్తూర్బాల్లో..ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లాలోని కస్తూర్బాలకు చెందిన 432 మందికి 320 మంది విద్యార్థినులు (74.07 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా అందోలులో 74కి 60,  అత్యల్పంగా కొండాపూర్‌లో 49కి 38  పాసయ్యారు. కస్తూర్బాల్లో ప్రథమ సంవత్సరానికి సంబంధించి 512 మందికి 333 మంది(65.04 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా కొండాపూర్‌లో 67కి 58 మంది, అత్యల్పంగా 63కి 29 మంది పాసయ్యారు. ఝరాసంగంలో కస్తూర్బా విద్యార్థినులు సింధు (ఎంపీసీ, 954), బైపీసీలో మౌనిక(981), శ్వేత(981) మార్కులు సాధించారు. కల్హేర్‌ కస్తూర్బాలో బైపీసీ విద్యార్థిని పి.భాగ్యశ్రీ 969 మార్కులతో ప్రతిభ చూపారని సంబంధిత అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని