logo

ఖర్చు మించితే.. అనర్హతే

ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు.

Updated : 25 Apr 2024 06:29 IST

ప్రచారంలో ప్రతి  దానికీ పక్కా లెక్క

 ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం సూచించిన దాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వెచ్చిస్తుంటారు. వ్యయ పరిమితి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ఖర్చు, తదితర అంశాలపై కథనం.

న్యూస్‌టుడే, చేగుంట, తాండూరు: గత శాసనసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి అనధికారికంగా సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా.. నామినేషన్‌ ప్రక్రియ సైతం చివరి దశకు చేరింది. ప్రచారాలు ఊపందుకున్నాయి. దీంతో ఖర్చులు సైతం ప్రారంభమయ్యాయి. సభలు, ర్యాలీలు, భోజనాలు, వాహనాలు తదితర వాటికి వెచ్చించక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు హద్దులు దాటకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను నిర్దేశించింది. వీటిని పక్కాగా అమలు చేసేలా ప్రత్యేక తనిఖీ బృందాలను సైతం నియమించింది. వీరు నిత్యం పరిశీలిస్తూ ఖర్చు లెక్కిస్తారు. హద్దు దాటితే అనర్హత పడే అవకాశం లేకపోలేదు.

రూ.95 లక్షల పరిమితి..

లోక్‌సభ అభ్యర్థుల వ్యయ పరిమితి రూ. 95 లక్షలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. అభ్యర్థులు ప్రచారం నిమిత్తం ఇంత కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. పరిమితి దాటి ఖర్చు చేసినా, వాటికి సంబంధించిన లెక్కలను సరైన ఆధారాలతో సమర్పించకున్నా వేటు పడక తప్పదు. నామపత్రాలు దాఖలు చేసినప్పటి నుంచి ఖర్చు లెక్కిస్తారు. అభ్యర్థి ఏదైనా జాతీయ బ్యాంకులో కొత్త ఖాతా తెరిచి లావాదేవీలు నిర్వహించాలి. నామినేషన్‌కు ముందు అభ[్యర్థులు చేపట్టిన ప్రచారాలు, సభలు, ఇతర కార్యక్రమాల ఖర్చులను సంబంధిత పార్టీ ఖర్చు కింద జమచేస్తారు.

ఎన్నికల్లో ప్రలోభాల నియంత్రణకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు స్టాటిక్‌ సర్వైలెన్స్‌, వీడి సర్వైలెన్స్‌, వీడియో వీవింగ్‌, ఎంసీసీ బృందాలను నియమించారు. ఆయా బృందాల సభ్యులు అన్నింటిపై నిఘా పెట్టారు. అభ్యర్థుల వెంట షాడో బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను చిత్రీకరిస్తున్నారు. అభ్యర్థుల ఖర్చులను వ్యయ బృందాలు తనిఖీ చేసి ఏమైనా వ్యత్యాసాలు ఉంటే నోటీసులు జారీ చేస్తాయి.

30 రోజుల్లోగా సమర్పించాలి..

ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు పోటీ చేసిన ప్రతి ఒక్కరూ తమ ఖర్చు వివరాలను బిల్లులతో సహా అధికారులకు అప్పగించాలి. పరిమితికి మించి ఖర్చు చేసినా వ్యయానికి సంబంధించిన లెక్కలను నిర్దేశించిన సమయంలో చూపకున్నా వేటు పడటం ఖాయం. తర్వాతి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే అభ్యర్థులు జాగ్రత్తగా ఖర్చు చేస్తూ వివరాలను సమర్పించాల్సిందే.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని