logo

విద్యా వికాసానికి పీఎంశ్రీ

పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు.

Published : 25 Apr 2024 02:58 IST

జిల్లాలో 11 బడుల ఎంపిక

 న్యూస్‌టుడే, చేగుంట: పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమంలో పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా ‘ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా’(పీఎంశ్రీ) పేరుతో కొత్త పథకానికి గత ఏడాది శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండో విడత 11 పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. యూడైస్‌ ప్లస్‌ ప్రోగ్రాంలో నమోదైన సమాచారం ప్రకారం జిల్లాల వారిగా పీఎంశ్రీ పథకానికి ఎంపిక ప్రక్రియ చేపట్టారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 60 రకాల ప్రశ్నావళిని పూరించారు. పాఠశాల ఫొటోలు, పంచాయతీ, పాఠశాల తీర్మాన ప్రతులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. సొంత భవనం, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ, విద్యార్థుల నమోదు, శౌచాలయాలు, తాగునీరు, చేతుల శుభ్రత, సరిపడే సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యుత్తు, గ్రంథాలయ వసతి వంటి అంశాలను అందులో నింపారు. దాని ఆధారంగా మొదటి విడతలో జిల్లాలో 20 పాఠశాలలను ఎంపిక చేశారు. తాజాగా రెండో విడతలో 11 పాఠశాలలను ఎంపిక చేశారు.

 రూ.లక్షల్లో నిధులు: ఎంపికైన పాఠశాలలకు నాలుగేళ్లలో రూ.లక్షల్లో నిధులు విడుదలకానున్నాయి. ఇందులో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం నిధులు అందిస్తుంది. ఈ నిధులతో పోషకాహారవనం, శుద్ధి జలం, సౌర విద్యుత్తు, ప్రయోగశాలలు, అంతర్జాల సదుపాయం, డిజిటల్‌ బోధన, వృత్తివిద్యా కోర్సులు, ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దటం, డిజిటల్‌ గ్రంథాలయం, క్రీడా మైదానం, నైపుణ్యాభివృద్ధి పెంపునకు చర్యలు తీసుకోనున్నారు. పాఠశాల దశ నుంచే ఒకేషనల్‌ కోర్సులను ప్రోత్సహిస్తారు. విద్యార్థి డిగ్రీకి వచ్చే సరికి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని జాతీయ విద్యావిధానం లక్ష్యం.

 కొన్ని పాఠశాలలే: పీఎంశ్రీ కింద పాఠశాలలను ఎంపిక చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని అప్పట్లో సూచించారు. ప్రతి మండలం నుంచి రెండు పాఠశాలలను ఎంపిక చేస్తామని ప్రకటించారు. తీరా మొదటి విడతలో కొన్ని, ఇప్పుడు మరికొన్ని ఎంపిక చేశారు. మండలానికి రెండు పాఠశాలలు ఎంపికవుతాయని ఉపాధ్యాయులు, గ్రామస్థులు భావించారు. కానీ కొన్ని మండలాల్లోని బడులకు ప్రాతినిధ్యం దక్కలేదు.
జిల్లాలో ఎంపికైనవి : జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చేగుంట, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐస్‌ మెదక్‌, జడ్పీ ఉన్నత పాఠశాల చిన్నశంకరంపేట, జడ్పీ ఉన్నత పాఠశాల కూచన్‌పల్లి(హావేలిఘనపూర్‌), జడ్పీ ఉన్నత పాఠశాల లింగాయిపల్లి-చీకోడ్‌(పాపన్నపేట), జడ్పీ ఉన్నత పాఠశాల గోమారం(శివ్వంపేట), జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నర్సాపూర్‌, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పెద్దశంకరంపేట, కేజీబీవీ కొల్చారం, ప్రాథమీకోన్నత పాఠశాల నర్సంపల్లి(నార్సింగి), జడ్పీ ఉన్నత పాఠశాల కౌడిపల్లి.

పాఠశాల అభివృద్ధికి మేలు రాధాకిషన్‌, డీఈవో

జిల్లాలో రెండో విడత మరికొన్ని పాఠశాలలను పీఎంశ్రీ కింద ఎంపిక చేశారు. దీనివల్ల పాఠశాలల్లో మరిన్ని సౌకర్యాలు లభించనున్నాయి. ఏటా కొన్ని పాఠశాలలను ఎంపిక చేస్తున్నారు. ఎంపిక చేసిన వాటికి త్వరలోనే నిధులు విడుదల అవుతాయి. వాటితో ఎన్నో పనులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు