logo

కాస్త మెరుగు..

ఇంటర్‌ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది.

Published : 25 Apr 2024 03:09 IST

 ప్రథమ ఇంటర్‌లో  28వ స్థానం, ద్వితీయలో 31వ స్థానం

ఫలితాల్లో బాలికలదే పైచేయి

 మెదక్‌, మెదక్‌ టౌన్‌: ఇంటర్‌ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. గత విద్యాసంవత్సరంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో 33వ స్థానంలో నిలవగా.. 2023-24 విద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 28వ స్థానం, ద్వితీయలో 31వ స్థానంలో నిలిచింది. వరుసగా చివరి స్థానంలో నిలుస్తుండటంతో ఇది వరకు పనిచేసిన పాలనాధికారి రాజర్షిషా ఫలితాల మెరుగు కోసం ప్రత్యేక శ్రద్ధ వహించారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్షలు నిర్వహించడంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఫలితాల్లో కొంత మార్పు కనిపించింది.

 ఈసారి సత్తా....: గత సంవత్సరం మాదిరిగానే ఈసారి సైతం ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. ప్రథమలో 5,905 మంది పరీక్షలు రాయగా 2,786 మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 3,119 మంది ఫెయిల్‌ కావడం గమనార్హం. అంటే సగం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేదు. 3,257 మంది బాలికలు పరీక్షలు రాయగా వారిలో 1,759 మంది(54.01శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 2,648 మందికి 1,027 మంది(38.78 శాతం) మాత్రమే పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 5,295 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,044 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,251 మంది అనుత్తీర్ణులయ్యారు. 3,004 మంది బాలికలు పరీక్షలు రాయగా 1,945 మంది(64.75శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 2,291 మంది పరీక్షలు రాస్తే 1,099(47.97 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

ఊరటనిచ్చిన ఒకేషనల్‌: జనరల్‌ విభాగానికి చెందిన ఫలితాలు ఏటా నిరాశపరుస్తుండగా.. ఈసారి ఒకేషన్‌ విభాగం ఫలితాలు ఊరటనిచ్చాయి. ప్రథమ సంవత్సరంలో 602 మందికి 421 మంది ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం 528 మందికి 383 మంది ఉత్తీర్ణులై 72.54 శాతంతో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది.

ఫలితాలు ఇలా...: జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చిన్నశంకరంపేట కళాశాలలో అత్యధికంగా 96.30శాతం, అత్యల్పంగా తూప్రాన్‌ కళాశాలలో 15.29 శాతం ఫలితాలు వచ్చాయి. ఆరు కస్తూర్బా కళాశాలల్లో అత్యధికంగా అల్లాదుర్గంలో 94.44 శాతం, మెదక్‌లో 42.11 శాతం ఫలితాలు సాధించారు. 20 గురుకుల కళాశాలలో అత్యధికంగా టీఎస్‌ఎస్‌డబ్ల్యుఆర్‌జేసీ కొల్చారం, ఎంజేపీటీబీసీడబ్ల్యుఆర్‌జేసీ(బాలుర) కౌడిపల్లిలో శతశాతం ఫలితాలు సాధించడం గమనార్హం. అత్యల్పంగా హవేలిఘనపూర్‌లోని మహాత్మ జ్యోతిబాఫులే కళాశాలలో 56.67 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏడు ఆదర్శ జూనియర్‌ కళాశాలలో అత్యధికంగా చిన్నశంకరంపేటలో 99.12 శాతం, అత్యల్పంగా పెద్దశంకరంపేట కళాశాలలో కేవలం 25.44 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు లేకపోవడం, ఇంటి వద్ద పనుల కారణంగా విద్యార్థుల హాజరుశాతం తగ్గుతోంది. వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటుచేసి, స్టడీ మెటీరియల్‌ అందజేసినా ఫలితాల్లో వెనకబడ్డారు.


ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేవు
- సత్యనారాయణ, జిల్లా ఇంటర్‌ అధికారి

విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేసినా, ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేవు. కానీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాల్లో కాస్త మెరుగుపడ్డాం. స్టడీ మెటీరియల్‌ ఇవ్వడం ఆలస్యం కావడంతో కొంత ప్రభావం చూపింది. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నుంచే ప్రత్యేక తరగతులను నిర్వహించి, స్టడీ మెటీరియల్‌ను అందజేస్తాం. మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాం.

మెదక్‌ టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో రిత్విక్‌ 953(ఎంపీసీ), తెలంగాణ మైనార్టీ గురుకులంలో ఎంపీసీలో బి.నందిని 966, ఎం.నందిని 966, లహరి 965, సంధ్య 951, జ్యోతి 930, బైపీసీలో లహరిక 941, యాసీన్‌బీ 929 మార్కులు సాధించారు. ప్రథమ ఎంపీసీలో తేజస్విని 448, స్వర్ణదీపిక 432, సానియా సుల్తానా 425, బైసీపీలో సోఫియా 424, కీర్తన  419 మార్కులు సాధించారు.
చేగుంట: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బైపీసీలో మనీషాగుప్తాకు 943 మార్కులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని