logo

గ్రామ మణిపూసలు

సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలకు చెందిన జువేరియా నాజ్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు.

Published : 25 Apr 2024 03:21 IST

జువేరియానాజ్‌ 979

సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలకు చెందిన జువేరియా నాజ్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. తల్లిదండ్రులు జమ్రుద్‌ బేగం, ఎండీ అబ్దుల్‌ జబ్బార్‌. తండ్రి పౌల్ట్రీఫాంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉన్న జువేరియానాజ్‌ లక్ష్యం వైద్యురాలు కావడమే. నిత్యం కళాశాలకు హాజరైన విద్యార్థిని ఏరోజుకారోజు పాఠ్యాంశాలను ఔపోసన పట్టారు. రోజులో 14 గంటలు చదువుకు కేటాయించారు. నీట్‌కు సిద్ధమవుతున్నారు.  

  - న్యూస్‌టుడే, సిద్దిపేట


 అధ్యాపకుల మార్గనిర్దేశంతో..
శిరీష 

జహీరాబాద్‌ మండలం రంజోల్‌ బాలికల సాంఘీక సంక్షేమ గురుకులానికి చెందిన శిరీష బైపీసీలో  సత్తా చాటారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శిరీష తల్లిదండ్రుల కష్టాన్ని చూసి బాగా చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉత్తమ మార్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగారు. అధ్యాపకుల మార్గనిర్దేశంతో పాఠ్యాంశాలను పక్కాగా వల్లెవేశారు. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఫలితాన్ని అందుకున్నారు.

- న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌


త్రల్లి కష్టాన్ని చూసి..పింకి
982

జహీరాబాద్‌ మండలం రంజోల్‌ బాలికల సాంఘీక సంక్షేమ గురుకులానికి చెందిన పింకి అత్యున్నత మార్కులు సాధించారు. ఈ విద్యార్థిని స్వగ్రామం మొగుడంపల్లి మండలం నందునాయక్‌తండా. పింకి బాల్యంలో ఉన్నప్పుడే తండ్రిని కొల్పోయారు. అప్పటి నుంచి తల్లి రేణుక కుటుంబ భారాన్ని మోస్తున్నారు. వివిధ పనులు చేసుకుంటూ కుమార్తెను చదివిస్తున్నారు. తల్లి కష్టాన్ని చూసిన పింకి ఉన్నత కొలువు సాధించాలనే పట్టుదలతో చదివారు. తాను అనుకున్నది సాధించారు.    

   - న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌


వ్యవసాయ కుటుంబం
సంతోష 985

సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లి గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని సంతోష ఎంపీసీలో ప్రతిభ చాటారు. స్వగ్రామం తొగుట మండలం వెంకట్రావుపేట. తల్లిదండ్రులు లక్ష్మి, కనకయ్య. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారం. ఇంటర్‌ ప్రథమలో 462 మార్కులు వచ్చాయి. ద్వితీయ సంత్సరంలో నిత్యం 12 గంటల పాటు శ్రమించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో జరిగిన ప్రత్యేక తరగతులు కలిసొచ్చాయి. ప్రస్తుతం ఎంసెట్‌ శిక్షణ పొందుతున్నారు. ఇంజినీరుగా స్థిరపడటమే లక్ష్యం.

- న్యూస్‌టుడే, సిద్దిపేట అర్బన్‌


మధ్యలో ఆపేసి.. పుంజుకొని..

అనూష
988

దోమ మండలం బట్లసందారానికి చెందిన నర్సమ్మ, మొగులయ్య దంపతుల పెద్ద కుమార్తె అనూష స్వగ్రామంలో పదో తరగతి వరకు చదివారు. వ్యవసాయ కుటుంబం కాగా, రెండేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మొగులయ్య ఇంంట్లోనే ఉంటున్నాడు. అప్పటినుంచి తల్లి అన్నీ తానై రెండెకరానలు సాగుచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మొదట్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలోనే చదువు నిలిపివేయగా.. కళాశాల ప్రిన్సిపల్‌ ప్రోత్సాహంతో మళ్లీ చేరి చదువుకున్నారు.

- న్యూస్‌టుడే, కొడంగల్‌


డ్రైవర్‌ కుమార్తె..
మౌనిక
981

కల్హేర్‌ మండలం ఫతేనగర్‌కు చెందిన జయరాజ్‌ డ్రైవరుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తల్లి అనిత గృహిణి. వీరి కుమార్తె మౌనిక స్వగ్రామంలో పది వరకు విద్యాభ్యాసం పూర్తిచేశారు. అనంతరం ఝరాసంగంలోని ఫులే కళాశాలలో బైపీసీలో ఇంటర్‌ చదివారు. ఉత్తమ మార్కులతో అదరగొట్టారు. కళాశాల అధ్యాపకుల సూచనలతో నిత్యం 10 గంటల పాటు శ్రమించి చదివారు. ఏ రోజుకారోజు పాఠ్యాంశాలను వల్లెవేస్తూ ముందుకు సాగి ఉత్తమ మార్కులు సాధించారు.       

 - న్యూస్‌టుడే, ఝరాసంగం


ఆర్టీసీ బస్సులో వచ్చి వెళ్తూ..

పూడూరు మండలం ఎన్కెపల్లి ఆదర్శ కళాశాలకు చెందిన ఎంపీసీ ద్వితీయ విద్యార్థిని అరుంధతి రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. ఇదే మండలం చింతలపల్లికి చెందిన పుష్పలత, చంద్రశేఖర్‌గౌడ్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పుష్పలత వ్యవసాయ కూలీగా, చంద్రశేఖర్‌గౌడ్‌ ఓ షాపింగ్‌ మాల్‌లో పని చేస్తున్నారు. వీరి చిన్న కుమార్తె అరుంధతి చింతలపల్లి గ్రామం నుంచి కళాశాలకు 16 కి.మీ. దూరం ఉంటుంది. నిత్యం ఆర్టీసీ బస్సులో వచ్చి వెళ్తూ చదువుకున్నారు. అధ్యాపకుల ప్రోత్సహించారు.

- న్యూస్‌టుడే, పూడూరు


ప్రణాళికతో అడుగేసి..

ఇంటర్‌ బైపీసీ ద్వితీయలో 981 సాధించారు శ్వేత. ఈమె తల్లిదండ్రులు రాధ, రాచప్ప. వ్యవసాయమే జీవనాధారం. కర్ణాటకలోని గుల్బార్గా వెంకటాపూర్‌ స్వగ్రామం. వైద్యురాలిగా స్థిరపడాలనే ధ్యేయంతో బైపీసీలో చేరారు.


తల్లిదండ్రులకు చేదోడుగా..

గజ్వేల్‌లోని బాలికల విద్యాసౌధంలోని వసతిగృహంలో ఉంటూ ఆదర్శ కళాశాలలో ఎంపీసీ చదివిన శైలజ ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు రేణుక, ప్రభాకర్‌. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి వారికి చేదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా కష్టపడి చదివారు. నిత్యం పాఠాలు విని వసతిగృహానికి రాగానే తిరిగి చదువుకోవడం ఈమెకున్న అలవాటు.
- న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ


పేదరికాన్ని జయించి..

సాయి వైష్ణవి
983

తొగుట మండలం వెంకట్రావుపేటకు చెందిన బండకాడి సుధ, సత్యనారాయణ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె సాయి వైష్ణవి గజ్వేల్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ స్థానిక మోడల్‌ కళాశాలలో బైపీసీ చదివారు. సత్యనారాయణ రికార్డింగ్‌ స్టూడియోలో పని చేస్తుండగా, సుధ మహిళా సంఘం సీఏగా విధులు నిర్వర్తిస్తున్నారు. తమ పిల్లలను ప్రయోజకులను చేయాలన్న ఉద్దేశంతో పేదరికాన్ని దరిచేరనీయకుండా వారిని చదివించగా.. సాయివైష్ణవి తానేంటో నిరూపించుకున్నారు.

-న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ


అమ్మానాన్నల ప్రోత్సాహంతో..

సయ్యద అస్పియా హస్మీ
990

తాండూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన సయ్యద అస్పియా హస్మీ బైపీసీ ద్వితీయ (ఉర్దూ)లో  ఉత్తమ మార్కులతో కళాశాలలో టాపర్‌గా నిలిచారు. తల్లిదండ్రులు సఫియా, సయ్యద్‌ సులేమాన్‌ హస్మీ. వైద్యురాలు కావాలన్న లక్ష్యంతో ఇంటర్‌లో బైపీసీని ఎంచుకున్నారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో శ్రమించారు. కళాశాల అధ్యాపకులు బోధించిన పాఠ్యాంశాలను ఏ రోజుకారోజు మననం చేసుకుంటూ, అనుమానాలను వెంటనే నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగారు.
- న్యూస్‌టుడే, తాండూరు


ప్రణాళికాబద్ధంగా..
సాయి వైష్ణవి
988

ప్రణాళికాబద్ధంగా చదివి సత్తా చాటారు ఎంపీసీ విద్యార్థిని అక్షయ. వికారాబాద్‌లోని లక్ష్మిబాయి గురుకులంలో ఇంటర్‌ చదివిన ఈ విద్యార్థిని తల్లిదండ్రులు కృష్ణవేణి, మహేందర్‌రెడ్డి. తండ్రి డ్రైవరుగా, తల్లి దుస్తుల దుకాణంలో పని చేస్తున్నారు. వీరిది పేద కుటుంబం కాగా, షామీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. ఇంజినీర్‌ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా చదివారు. తల్లిదండ్రులుప్రోత్సహించడంతో ఉత్తమ మార్కులు సాధించారు.
- న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌
దుబ్బాక: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒకేషనల్‌ ఎలక్టిక్రల్‌ టెక్నీషియన్‌ చదివిన సుకుమార్‌ 994 మార్కులు సాధించారు.
నారాయణఖేడ్‌ రూరల్‌: నారాయణఖేడ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని బైజా సభా బైపీసీ ప్రథమలో 437 మార్కులు సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు