logo

అర్బన్‌ పార్కు.. సందడిగా తిరుగు

కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్‌ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్‌ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.

Published : 20 May 2024 00:55 IST

తేజోవనం ముఖద్వారం 

కొండపాక గ్రామీణం, న్యూస్‌టుడే: కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్‌ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్‌ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఇక్కడ 3.20 లక్షల మొక్కలను రాబోయే కాలంలో నాటేందుకు సిద్ధం చేశారు. హరితనిధి కింద పెంచుతున్నారు. జిల్లాలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఈ పార్కులో జింకలు, కొండగొర్రెలు, దుప్పులు, నక్కలు, అడవిపందులు, నెమళ్లు, వివిధ రకాల పక్షి జాతులు ఉన్నాయి. పార్కు నిర్దేశిత ప్రాంతం చుట్టూ ఇనుప కంచె నిర్మించి వృక్షాలు, మొక్కలు, జంతువులు, పక్షులను సంరక్షిస్తున్నారు. ఇక్కడికి నెలకు సుమారు 3 వేల మంది సందర్శకులు వస్తున్నారు. అన్నిరకాల ఆదాయం నెలకు రూ.50 వేలకు పైగా వస్తోంది. సందర్శకుల కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.

ఉద్యానం మధ్యలో వాచ్‌ టవర్‌ 

సకల సౌకర్యాలతో.. పర్యాటకులు తిరిగి చూసేందుకు అందుబాటులో 10 సైకిళ్లు ఉన్నాయి. ఒకే చోట 16 మంది కూర్చొని సేద తీరేందుకు ‘గెజిబో సీటింగ్‌’ నిర్మించారు. అర ఎకరా విస్తీర్ణంలో కర్రలతో తయారుచేసిన సమావేశం మందిరం ఉంది. చిన్న కాల్వలపై కృత్రిమ వంతెనలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు మూడు సోలార్‌ పంపు సెట్లు అమర్చారు. 9 కి.మీ మేర నడకదారి, 11 కి.మీ సైక్లింగ్‌ దారులు నిర్మించారు. రాశుల వనం నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వ్యాయామం చేసుకోవటానికి పరికరాలతో ఏర్పాట్లు ఉన్నాయి. మూడంతస్తుల వాచ్‌ టవర్‌తో పరిసరాలను చూడవచ్చు. మియావాకీ పద్ధతిలో పండ్లు, పూలు, ఔషధ మొక్కలను పది వేలకు పైగా పెంచుతున్నారు.

వేసవి సెలవుల్లో పిల్లలతో కలసి వీక్షించొచ్చు

ఇక్రమొద్దీన్, ఎఫ్‌ఆర్వో, సిద్దిపేట

వేసవి సెలవుల్లో పిల్లలతో కలసి కుటుంబసభ్యులందరూ తేజోవనం పార్కును సందర్శించి పార్కులోని ప్రకృతి సహజ అందాలను వీక్షించొచ్చు. సెలవు రోజులు మినహా ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రోజంతా పార్కులో హాయిగా తిరగొచ్చు. పెద్దలకు రూ.30, పిల్లలకు రూ.20 చొప్పున ప్రవేశరుసుం ఉంది. తాగునీరు, శౌచాలయాల వసతి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని