logo

ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ

గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది.

Updated : 20 May 2024 04:40 IST

మూడేళ్ల క్రితం ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’లో 2,623  శౌచాలయాల నిర్మాణాలు
1,280కి చెల్లింపులు పూర్తి

అక్కన్నపేట మండలం కుందన్‌వానిపల్లిలో నిర్మించిన వ్యక్తిగత శౌచాలయం 

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం: గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. వివరాల్లోకి వెళితే... స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మూడేళ్ల క్రితం ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పచ్చదనంతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. అప్పట్లో ఈ శౌచాలయాల నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమం మాదిరిగా చేపట్టాయి. జిల్లా ఉన్నతాధికారులు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు వీటి నిర్మాణం, ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటా నిర్మించుకునేలా చేశారు. నిర్ణీత గడువులోగా నిర్మించుకున్న మరుగుదొడ్లకు ఒక్కో శౌచాలయానికి రూ.12వేల చొప్పున బిల్లులు చెల్లించారు.

జిల్లాలో 2,777 మంది లబ్ధిదారులు

కొన్నింటికి బిల్లులు చెల్లించలేదు. అలాంటివి జిల్లాలో 2,777 శౌచాలయాలు ఉన్నాయి. అప్పటినుంచి లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాటి బిల్లులు చెల్లింపు జరుగుతోంది. అప్పట్లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు మంజూరై ఉండాలి. మరుగుదొడ్డి నిర్మించుకుని ప్రస్తుతం వినియోగంలో ఉన్న వారికి బిల్లులు చెల్లిస్తున్నారు. 

క్షేత్రస్థాయి పరిశీలనతో.

అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే చెల్లిస్తున్నారు. లబ్ధిదారుడి పేరు, శౌచాలయం మంజూరైందా లేదా... ఎప్పుడు నిర్మించుకున్నారు. పూర్తయిందా లేదా. దానిని వినియోగిస్తున్నారా లేదా అనే వివరాలను పరిశీలించాలి. ఫొటో తీయాలి. బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలి. వీటన్నింటిని ఎంపీడీవో ద్వారా డీఆర్‌డీవో కార్యాలయానికి పంపిస్తున్నారు. అక్కడి నుంచి వాటిని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,623 శౌచాలయాలు పూర్తయినట్లు క్షేత్రస్థాయి అధికారుల సర్వేలో తేలింది. వాటిలో 2,108 శౌచాలయాలకు బిల్లుల చెల్లింపుకు ఎంపీడీవోలు డీఆర్‌డీవో కార్యాలయానికి పంపించారు. వాటిని పరిశీలించిన జిల్లా అధికారులు వాటిలో 1280 శౌచాలయాలకు మాత్రమే బిల్లులు చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ మేరకు వాటికి ప్రభుత్వం రూ.1.49 కోట్ల బిల్లులను లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ఈ మేరకు వారి ఖాతాల్లో డబ్బులు జమవుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. చాలా రోజుల తర్వాత బిల్లులు రావడంతో లబ్దీదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు