logo

వారధి.. పనులు నెమ్మది

ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్‌ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది.

Published : 20 May 2024 01:07 IST

తుది దశలో నిలిచిన రూ.90 కోట్ల పనులు

వంతెన పై భాగంలో అసంపూర్తి పనులు 

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌: ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్‌ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. ఈ కష్టాలు దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.90 కోట్లతో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో భారీ రైల్వే ఉపరితల వంతెన నిర్మాణం చేపడుతోంది. ఐదేళ్లుగా పనులు కొనసాగుతూ.. తుది దశలో నిలిచిపోయాయి. 

2018లో శంకుస్థాపన

జహీరాబాద్‌ పట్టణంలోని రైల్వేగేటు వద్ద రూ.90 కోట్లతో రెండు వరుసలతో చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులకు 2018 ఆగస్టు 30న ఎంపీ బీబీ పాటిల్, అప్పటి ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. వికారాబాద్‌-పర్లి వైజ్యనాథ్‌ రైలు మార్గం జహీరాబాద్‌ పట్టణం మీదుగా వెళుతుంది. సికింద్రాబాద్, నాందేడ్, పూర్ణ, షిర్డీ, బెంగళూరు, తిరుపతి, కాకినాడ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, గూడ్సు రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేటు పడటంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు.

రాకపోకలకు ఇక్కట్లు

జహీరాబాద్‌ ప్రధాన రహదారిపై రైల్వేగేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిర్మిస్తున్న రైల్వే ఒవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నప్పటికీ.. ముగింపు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనులు ప్రారంభించి ఐదేళ్లవుతున్నా.. గుత్తేదారులు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఉపరితల వారధి అందుబాటులోకి రావడం లేదు. సుమారు కి.మీ. పొడవున నిర్మిస్తున్న వంతెన అసంపూర్తి పనుల వల్ల ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశారనే ఆరోపణలున్నాయి.

నాలుగు వరుసలుగా..

నాలుగు వరుసల ఉపరితల వంతెన నిర్మాణం పూర్తయితే రాకపోకలు సులభంగా కానున్నాయి. జహీరాబాద్‌ పట్టణం మీదుగా అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే చించోళి, గుల్బర్గా, బసవకల్యాణ్, బీదర్‌ ప్రయాణికులకు సౌకర్యంగా మారనుంది. పట్టణ శివారులోని డ్రీమ్‌ ఇండియా, బందేఅలీ, బాబూమోహన్‌ కాలనీలతో పాటు మహీంద్రా, ఎంజీ, ముంగి, బూచినెల్లి పారిశ్రామిక వాడలు సహా మొగుడంపల్లి, జహీరాబాద్‌ మండలంలోని పలు గ్రామాలకు ప్రజలకు గేటు కష్టాలు పూర్తిగా తీరనున్నాయి.

త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు

గుత్తేదారుకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో కొన్నాళ్లుగా పనులు నెమ్మదించాయి. నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. ఇరువైపులా రోడ్డు అనుసంధానం చేసి.. వంతెన రెయిలింగ్‌ పూర్తిచేసి.. రంగులు వేస్తే ప్రారంభానికి సిద్ధమవుతుంది. మళ్లీ పనులు ప్రారంభించి త్వరగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.

నర్సింహులు, డీఈఈ, ఆర్‌అండ్‌బీ, జహీరాబాద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని