logo

బడులకు భద్రతేది?

జహీరాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది.

Published : 20 May 2024 01:12 IST

చోరీకి గురవుతున్న విలువైన వస్తువులు

జహీరాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. నిత్యం పశువులు, పందులు బడి ఆవరణలో సంచరిస్తున్నాయి. రాత్రి వేళల్లో మందుబాబులు, జూదరులకు అడ్డాగా మారింది. వారి ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. ఈ బడిలోని వస్తువులు గతంలో చోరీకి గురయ్యాయి. 

సంగారెడ్డి పట్టణం బాబానగర్‌లోని పోలీస్‌ లైన్‌ పాఠశాల ఇది. ప్రహరీ లేకపోవడంతో భద్రత కరవైంది. పాఠశాలలో విలువైన కంప్యూటర్లు, ఫర్నిచర్, పరికరాలు ఉన్నాయి. నిత్యం రాత్రివేళ కొందరు ఆకతాయిలు ఇక్కడికి చేరి మద్యం తాగుతున్నారు. కుళాయిలు, తలుపులు, ఇతర వస్తువులు విరగ్గొడుతున్నారు. ప్రహరీకి నిధులు మంజూరైనా పనులు చేపట్టలేదు. 

న్యూస్‌టుడే, ఇస్మాయిల్‌ఖాన్‌పేట(సంగారెడ్డి మున్సిపాలిటీ), జహీరాబాద్, గుమ్మడిదల, ఝరాసంగం, కోహీర్‌: ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ విలువైన కంప్యూటర్లు, డిజిటల్‌ తెరలు, గ్రంథాలయ పుస్తకాలు, యూపీఎస్‌ బ్యాటరీలు పంపిణీ చేసింది. కాపలాదారులు, ప్రహరీలు లేకపోవడంతో వీటికి భద్రత కరవైంది.  కొన్ని చోట్ల ఆకతాయిలు పాఠశాలల్లోని విలువైన వస్తువులను చోరీ చేయడం, విరగ్గొట్టడం లాంటివి చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు పాఠ్య పుస్తకాలు, బల్లలకు నిప్పు పెట్టిన నేపథ్యంలో జిల్లాలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. 

క్షేత్ర పరిస్థితి..

  • ఝరాసంగంలోని పాఠశాలలో మూడు నెలల క్రితం చోరీ జరిగింది. విలువైన పరికరాలు అపహరణకు గురయ్యాయి. మన ఊరు.. మన బడి కింద బర్దీపూర్‌ పాఠశాలను ఎంపిక చేసి పనులు చేపడుతున్నా.. పూర్తి కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న గుర్తు తెలియని వ్యక్తులు బడి తాళం విరగ్గొట్టి అంతర్జాలానికి సంబంధించిన పరికరాలు ఎత్తుకెళ్లారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు పక్క పక్కనే ఉంటాయి. రాత్రి కాపలాదారుని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
  • కోహీర్‌ పట్టణంలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలకు ప్రహరీలు లేవు. రాత్రి వేళల్లో ఆకతాయిలు అడ్డాగా మార్చుకుంటున్నారు. బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఇటీవల హత్య ఘటన వెలుగుచూసింది.
  • గుమ్మడిదల ప్రభుత్వ పాఠశాలకు రక్షణ కరవైంది. ఈ మండల పరిధిలోని బొంతపల్లి మినహా అన్ని జడ్పీ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కానుకుంట జడ్పీ, ప్రాథమిక పాఠశాలల పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నాయి. భవనాలు శిథిలమయ్యాయి. ప్రహారీలు లేవు. 

ఉన్నతాధికారులకు నివేదిస్తాం

పాఠశాలల్లో కాపలాదారుల పోస్టులు మంజురు కాలేదు. దీంతో నియమించలేకపోయాం. సెలవుల్లో కాపాలాదారులను నియమించాలని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తరచూ వెళ్లి పర్యవేక్షించాలి. గ్రామాల్లో పంచాయతీలు, పట్టణాల్లో పురపాలక సిబ్బంది పరిశీలన బాధ్యత తీసుకోవాలి. పాఠశాలలు అందరివి. వాటిలోని పరికరాలు సంరక్షించుకోవాలి.

వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని