logo

తీరు మారదు.. కాలుష్యం వదలదు!

కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు.

Published : 20 May 2024 01:18 IST

బ్యాంకు గ్యారంటీలు జప్తు చేసినా అంతే
పారిశ్రామిక వాడల్లో పరిస్థితి ఇది

ఇళ్ల ముందే పారుతున్న కాలుష్య జలం 

న్యూస్‌టుడే, జిన్నారం: కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. ఈ 15 పరిశ్రమల్లో చాలావరకు పెద్దవే ఉన్నాయి. మరోవైపు కొన్ని పరిశ్రమలు నిబంధనలు పాటించకుండా వాన కురవగానే కాలుష్య జలాలను వాగుల్లో వదులుతున్న తీరును గుర్తించిన పీసీబీ హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు యథావిధిగా రసాయన వ్యర్థ జలాలను కాలువల్లోకి వదిలేయడం గమనార్హం. దీని ఫలితంగా నాలుగైదు రోజులుగా ఖాజీపల్లిలో రసాయనాల ఘాటు వెదజల్లుతోంది.

కఠిన చర్యలు శూన్యం: కాలుష్య నియంత్రణ మండలి ప్రతి వర్షాకాలానికి ముందు ఏయే పరిశ్రమల్లో ఎంత మేర రసాయన వ్యర్థాలు నిలువ ఉన్నాయో గుర్తించాల్సి ఉంటుంది. వెంటనే జలాలను పీఈటీఎల్‌కు కానీ లేదంటే జేఈటీఎల్‌కు కానీ పంపించాలి. ఈ విషయంలో పీసీబీ నిర్లక్ష్యం వహిస్తుండటంతో పరిశ్రమల యాజమాన్యాలు ఇదే అదునుగా వాన నీటిలో కలిపి ఇష్టానుసారంగా బయటకు వదిలేస్తున్నాయి. ఫలితంగా సమీప ప్రాంతాల్లో ఉండలేని దుస్థితి. గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ నిల్వలు ఉన్నట్లు కొందరు పీసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే చర్యలు మాత్రం శూన్యం. వాన కురవగానే వ్యర్థాలను వదిలేస్తున్నారని, ఇళ్లలో ఉండలేకపోతున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు. 

నిఘా పెట్టక..: ఖాజీపల్లి, గడ్డపోతారంలో సమస్యను సంబంధిత అధికారులు వేరే రకంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాల వ్యర్థాలు కాదు.. కాలనీలు, అపార్ట్‌మెంట్ల నుంచి వస్తున్న వ్యర్థ జలాలంటూ నివేదిక ఇచ్చారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. నిఘా పెట్టాల్సిన అధికారులు కార్యాలయాలకు పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

నీటి వనరులన్నీ..: పారిశ్రామిక వాడల్లో ఎటుచూసినా కాలుష్య జలాలే కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు, కాలువలు, వాగులు వ్యర్థాలతోనే నిండిపోయాయి. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే గతంలో కంటే పరిస్థితిలో మార్పు వచ్చింది, తాఖీదులు ఇచ్చి నమూనాలు సేకరిస్తున్నామంటూ చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో నీటి వనరులు విషపూరితంగా మారాయి. ఇకనైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రయోజనంగా ఉంటుంది.

నిఘా పెంచాం: కుమార్‌పాఠక్, పీసీబీ ఈఈ, రామచంద్రాపురం 

కాలుష్య కారకులను పట్టుకునేందుకు ఇటీవల మరింత నిఘాను పెంచాం. ఇప్పటికే పలు సూచనలు చేశాం. కొన్ని పరిశ్రమలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఇటీవల ఖాజీపల్లి శివారులో పారింది కాలుష్య జలం కాదు, మురుగు నీరు. వ్యర్థాలను ఎవరు వదిలినా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని