logo

ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!

సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్‌లోని కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు.

Published : 20 May 2024 01:24 IST

తరగతి గదిలో విద్యార్థులు 

సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్‌లోని కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులు సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లగా ఒత్తిడికి గురైనట్లు గుర్తించారు. రెండు దశల్లో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆటవిడుపుగా ఆటల వైపు ప్రోత్సహించాలని మానసిక నిపుణుడు సూచించారు.

న్యూస్‌టుడే, సిద్దిపేట: సరైన దిశానిర్దేశం లేక బాలలు చిన్న వయసులోనే ఉద్వేగాలకు లోనవుతున్నారు. పదో తరగతి, ఇంటర్, ఎప్‌సెట్, ఇతరత్రా ఫలితాలు వెలువడిన తరుణంలో కొందరు బాలబాలికలు ఆశించిన ఫలితం దక్కక మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. దాని నుంచి బయటపడేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఏదైనా సాధించాలంటే చదువొక్కటే సరిపోదన్న విషయాన్ని గుర్తించాలి. వికాస నైపుణ్యాన్ని పెంచుకుంటే విజయం తథ్యం. వేసవి సెలవులు ముగిసేందుకు నెలకు పైగా సమయం ఉంది. వీటిని చక్కగా వినియోగించుకుంటే ఫలితం ఖాయం. పరీక్ష రాసి అనుత్తీర్ణులైన వారికి తల్లిదండ్రులు, కుటుంబం అండగా నిలవాలి. ఏ సమస్య వచ్చినా తామున్నామనే భరోసా ఇస్తూ ప్రోత్సహించాలి. 

వివిధ రూపాల్లో ప్రోత్సాహం.. 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతోంది. చరవాణి, సామాజిక మాధ్యమాలకు ఇచ్చిన ప్రాధాన్యం కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు. ఫలితాలు వెలువడ్డాక ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్ల్లాల్లో పలువురు అఘాయిత్యాలకు పాల్పడిన ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లోకి వెళ్లకుండా కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వెనుకబడ్డ అంశాల్లో తర్ఫీదు ఇప్పిస్తూనే ఆటపాటలు, ఆసక్తి ఉన్న అంశాల వైపు మళ్లించాలి.

తల్లిదండ్రుల బాధ్యత..

తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి తరచూ భోజనం చేయాలి. స్నేహపూర్వకంగా మెలగాలి.ః విహార, వినోదయాత్రలకు తీసుకెళ్లాలి.ః ఒకరికొకరు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉండాలి.ః సమస్యలు తలెత్తితే వెన్నంటే ఉంటామనే భరోసా కల్పించాలి.ః మానసికంగా కుంగిపోతే వ్యక్తిత్వ వికాస నిపుణులను సంప్రదించాలి.

‘స్మార్ట్‌’వాణి వినొచ్చు.. చూడొచ్చు.. 

స్మార్ట్‌ఫోన్‌ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో రెండు, అంతకుమించి చరవాణులను వినియోగిస్తుండటం పరిపాటిగా మారింది. దీన్ని మంచి వైపు వినియోగిస్తే సత్ఫలితాలు సాధ్యం. బయటకు వెళ్లలేని పరిస్థితులు ఎదురైతే.. అందుబాటులో ఉండే చరవాణి చక్కటి సాధనం. వ్యక్తిత్వ వికాస నిపుణులు, సైకాలజిస్టుల వీడియోలు సైతం ఉన్నాయి. నచ్చిన పుస్తకాన్ని సులువుగా చదివేయొచ్చు.

ప్రాణాయామం.. ధ్యానం..

ఒత్తిడిని అధిగమించేందుకు యోగా దివ్య ఔషధం. ప్రాణాయామం, ధ్యానం చేస్తే మానసికంగా దృఢమవుతారు. సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో వ్యాస మహర్షి యోగా కేంద్రం, బాలసదనం, చేర్యాలలో ఉచిత యోగా శిబిరాలు కొనసాగుతున్నాయి. బాలలు, యువత నిత్యం యోగా చేస్తే ఫలితాలు ఖాయమని యోగా శిక్షకుడు, యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి తోట సతీశ్‌ చెబుతున్నారు.

ఆటలతో పోటీపడితే..

  • చదరంగం ఆటే కాదు.. మేధో వికాసానికి దోహదపడుతుంది. జ్ఞాపక, ఆలోచనాశక్తిని పెంచుతుంది. లాజికల్‌ థింకింగ్‌తో పాటు సహనం, సమస్యల పరిష్కార నైపుణ్యం, ముందు చూపు, ప్రణాళికతో అడుగేసే తత్వం సొంతమవుతాయి.
  • ఈత.. నిత్య సాధనతో శరీరానికి వ్యాయామంతోపాటు మానసిక ఉల్లాసం అందుతుంది. వ్యాయామం, పరుగు.. రోజంతా ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇవే కాదు.. ప్రతి క్రీడా ప్రత్యేకమే. మానసికంగా, శారీరకంగా ఉత్తేజపరుస్తూ బలంగా మారుస్తాయి. వేసవిలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శిబిరాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. పలువురు ఉచితంగా శిక్షణలు అందిస్తున్నారు. సద్వినియోగం చేసుకుంటే మంచిదే.

విజ్ఞాన భాండాగారాలు..

గ్రంథాలయాలు.. విజ్ఞానాన్ని పంచే భాండాగారాలు. అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి. వేసవి వేళ వీటి సందర్శన ఎంతో ఉపయుక్తం. మహనీయుల జీవిత గాధలను చదివితే స్ఫూర్తి పొందవచ్చు. ఎంతోమంది పడిలేచే కెరటంలా, అపజయాన్ని ఎదుర్కొని విజయాన్ని సాధించారు. తక్కువగా చదివినా.. నచ్చిన రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగిన వారి జీవిత చరిత్రలు అందుబాటులో ఉంటాయి. విజ్ఞానం, వినోదం, హాస్యం, సాహిత్య సృజనను పంచే పుస్తకాలు అనేకం. రోజులో కొంత సమయం గ్రంథాలయాలకు కేటాయించాలి.


అనేక రంగాల్లో అవకాశం..: రామస్వామి 

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, సిద్దిపేట

ఫలితం ఏదైనా మానసికంగా సిద్ధమై ఉండాలి. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. చక్కటి భవిత ఉంటుంది. చదువుకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఓపిక తెచ్చుకుని ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు, కుటుంబీకుల ప్రోత్సాహం తప్పనిసరి. మార్గదర్శనం చేయాలి. సరిదిద్దేలా నిర్ణయాలు ఉండాలి. లోపాలు ఎత్తిచూపొద్దు. పరిమిత దశలో పర్యవేక్షణ చేయాలి.


బంగారు భవిత..: డా. టి.జగదీశ్వరాచారి

వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సిద్దిపేట

పోటీ ప్రపంచంలో గెలవాలనే తపన, ఆరాటం అందరిలో ఉంటుంది. పలు సందర్భాల్లో వెనకుబాటుకు గురయ్యే అవకాశం లేకపోలేదు. ఆత్మన్యూనతా భావం దరిచేరనీయొద్దు. కుటుంబీకులు, పిల్లలకు మధ్య ఏర్పడే అంతరం విపరీత ధోరణులకు దారి తీస్తుంది. బంగారు భవిత ఉందనే దిశగా ఆత్మస్థైర్యం కల్పించాలి. మనో ధైర్యానికి మించిన మందు లేదని గుర్తించాలి.


ఓటమి నుంచే అసలైన గెలుపు: 

ఉమాపతి, సైకాలజిస్టు, సిద్దిపేట

ఓటమి నుంచే గెలుపు మొదలవుతుంది. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురైతే ఉపాధ్యాయులు లేదా సైకాలజిస్టు వద్దకు తీసుకెళ్లాలి. కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. ఒంటరిగా వదిలిపెట్టొద్దు. నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి. సరదాగా గడిపేలా చూడాలి. ఫెయిల్, తక్కువ మార్కులు వచ్చాయనే అంశాన్ని పదేపదే ప్రస్తావించవద్దు. నచ్చిన ఆట వైపు ప్రోత్సహించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని