logo

ఏకరూపం.. ఆలస్యం

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది.

Published : 20 May 2024 01:33 IST

ఇప్పటి వరకు సగం వస్త్రమే రాక

న్యూస్‌టుడే, మెదక్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. ఈ విద్యాసంవత్సరంలోనూ సమస్య పునరావృతం కానుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు ఇప్పటికీ ముడిసరకు సగం మాత్రమే వచ్చింది. దాన్ని కత్తిరించి స్వయం సహాయక సంఘాలకు అందించాల్సి ఉంది. ప్రస్తుతం ఒక జత చొప్పున పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

జిల్లాలో 78,286 మంది విద్యార్థులు

జిల్లాలో 899 ప్రభుత్వ బడుల్లో 78,286 మంది చదువుతున్నారు. వారికి ఏడాదికి రెండు జతల చొప్పున 1,56,572 పంపిణీ చేయాలి. ప్రతిసారి టెస్కో నుంచి ముడిసరకు జిల్లాకు వస్తుంది. ఈసారి ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే చేరింది. దుస్తులు కుట్టే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా ఆధ్వర్యంలో కొనసాగే స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. జత కుట్టేందుకు ప్రభుత్వం రూ.50 చెల్లిస్తోంది. వచ్చే నెల 12న బడులు పున:ప్రారంభం కానున్నాయి. ఆలోగా ఒక జత అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి వచ్చిన వస్త్రం పూర్తిస్థాయిలో జిల్లాకు చేరలేదు. కేవలం షర్ట్, ప్యాంట్‌కు సంబంధించి మాత్రమే అందింది. బాలికలకు సంబంధించి రాగానే మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ఈ ప్రక్రియకు మరో రెండు, మూడ్రోజులు పట్టే అవకాశముంది. పనుల వేగవంతానికి మండల స్థాయిలో ఎంఈవో, నోడల్‌ అధికారి, ఎంఐఎస్‌లతోపాటు డీఆర్డీఏ, మెప్మాకు చెందిన ఏపీఎంలతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు.

92 కుట్టు కేంద్రాలు...

గతేడాది దుస్తుల డిజైన్‌ మారడంతో కుట్టు కూలీ సరిపోదని స్వయం సహాయక సంఘాల మహిళలు కొద్దిరోజులు వస్త్రాన్ని వారి దగ్గరే ఉంచుకొని తిరిగి విద్యాశాఖ అధికారులకు ఇచ్చారు. దీంతో వారు పాలనాధికారిని సంప్రదించారు. చివరికి హైదరాబాద్‌లోని ఏజెన్సీలకు అప్పగించారు. దీంతో పాఠశాలలు ప్రారంభమై చాలా రోజులైనా విద్యార్థులకు యూనిఫాం అందలేదు. ఈసారి బడులు తెరిచే నాటికి ఒక జత ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 92 కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలు పాఠశాలల్లో కొలతలు తీసుకున్నారు. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో ఎస్‌ఎంసీల స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇందులో స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళ పాఠశాల ఛైర్మన్‌గా, హెచ్‌ఎం కన్వీనర్‌గా కొనసాగుతున్నారు.

ఒక జత అందిస్తాం..

రాధాకిషన్, జిల్లా విద్యాధికారి

వస్త్రం జిల్లాకు చేరింది. మరో విడత సోమవారం రానుంది. ఈసారి కొంత ఆలస్యంగా వచ్చింది. దుస్తులను కుట్టే బాధ్యత జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తోంది. బడులు ప్రారంభమయ్యే నాటికి ఒక జత దుస్తులను విద్యార్థులకు అందిస్తాం. దీనికిగాను మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేశాం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని