logo

భారమైన అద్దెలు.. కనిపించని వసతులు

జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు.

Published : 20 May 2024 01:36 IST

ప్రైవేటు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు

తూప్రాన్‌: అద్దె భవనంలో నీటిపారుదల శాఖ భవనం

న్యూస్‌టుడే- తూప్రాన్, హవేలిఘనపూర్, రామాయంపేట: జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో శాఖల అధికారులు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల యజమానులు కార్యాలయాలకు తాళాలు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల అద్దె బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాల పునర్విభజన తరవాత కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి. చాలాచోట్ల ప్రభుత్వ శాఖలకు సొంత భవనాల్లేవు. అద్దె భవనాల్లోనే కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కష్టాలు తీరడం లేదు. కొన్నిచోట్ల అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడి అద్దెలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన తరవాత బిల్లులు తీసుకుంటున్నారు. పలు కార్యాలయాల్లో విద్యుత్తు బకాయిలు సైతం పేరుకుపోవడంతో సంబంధిత అధికారులు సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. ఉన్నతాధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయా కార్యాలయాల సిబ్బంది కోరుతున్నారు.

హవేలిఘనపూర్‌లో తహసీల్దార్‌ కార్యాలయం

తూప్రాన్‌లో ఆర్డీవో, నీటిపారుదల శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటికి సంబంధించిన అద్దె నెలనెలా రాకపోవడంతో యజమానులు సౌకర్యాలు కల్పించడం లేదు. ఒక్కోసారి భవనాలకు తాళాలు వేసుకొని వెళుతున్నారు. దీంతో ప్రజలకు అందాల్సిన సేవలు ఆగిపోతున్నాయి. పుర పరిధి పోతరాజ్‌పల్లిలో 14 ఏళ్లుగా ఈఎస్‌ఐ ఆస్పత్రిని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. 8 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాన్ని భవనానికి తాళం వేశారు. 48 రోజులైనా అధికారులు, పాలకులు స్పందించకపోవడంతో సేవలు నిలిచిపోయాయి. జిల్లాలోని 6వేల మందికిపైగా కార్మికులు ఈ ఆస్పత్రిలో సేవలు పొందుతున్నారు. తాళం ఉండడంతో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు నిత్యం వచ్చి వెళుతున్నారు. హవేలిఘనపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. కొత్త మండలంగా ఏర్పడినప్పట్నుంచి ఇందులోనే సేవలు అందిస్తున్నారు.


రామాయంపేటలో ఆబ్కారీశాఖ కార్యాలయం 

రామాయంపేటలో ఆబ్కారీశాఖ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఆర్నెల్లకోసారి అద్దె వస్తోందని యజమానులు చెబుతున్నారు. సరిపడా వసతులు లేకున్నా సర్దుకుపోతున్నామని అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. సొంత భవనం ఉంటే ఇబ్బందులు తీరతాయంటున్నారు. ఆబ్కారీశాఖ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని యజమాని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని