logo

వరుణాగ్రహం.. అతలాకుతలం

పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి.  చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Published : 20 May 2024 01:41 IST

పంటలకు తీవ్ర నష్టం

చిన్న గొట్టిముక్లలో బురద నీటిలో నుంచి ధాన్యాన్ని ఎత్తుతున్న రైతులు

పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి.  చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

హవేలిఘనపూర్, న్యూస్‌టుడే: జిల్లా సరిహద్దులోని పోచారం అభయారణ్యం వద్ద ఆదివారం వీచిన ఈదురు గాలులకు వృక్షాలు విరిగిపడ్డాయి. పార్కు కార్యాలయం పైకప్పు రేకులు, గేటు ధ్వంసమయ్యాయి. మెదక్‌- బోధన్‌ ప్రధాన రహదారిపై కొమ్మలు పడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

 చెన్నాపూర్‌లో తడిసి ముద్దయిన ధాన్యాన్ని చూపుతున్న రైతు ఆంజనేయులు 

ముంచిన అకాల వర్షాలు

శివ్వంపేట: మండలంలో భారీ వర్షం కురిసింది. చిన్నగొట్టిముక్లలో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబెట్టిన ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. బస్తాలు తడిసి ముద్దయ్యాయి. చెన్నాపూర్‌ కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. టీక్యాదేవమ్మగూడెం తండా పాఠశాల దగ్గర భారీ చెట్టు కొమ్మ చౌరస్తా రోడ్డుపై విరిగి పడిపోయింది. చిన్న గొట్టిముక్ల చౌరస్తాలోనూ చెట్టు కొమ్మ విరిగింది. చెన్నాపూర్, టీక్యాదేవమ్మగూడెం తండాలో కూరగాయలు సాగు చేస్తున్న పొలాల్లో వర్షపు నీరు నిలిచింది.

నష్టాలపాలయ్యామని ఆందోళన

చిలప్‌చెడ్‌: కష్టపడి పండించిన ధాన్యం వర్షార్పణమైంది. కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయింది. మండలంలోని చిట్కుల్, చండూర్, గౌతాపూర్, అజ్జమర్రి, చిలప్‌చెడ్, సోమక్కపేట, ఫైజాబాద్‌ కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీరు ధాన్యం కుప్పల చుట్టూ నిలిచింది. నష్టాలపాలయ్యామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఉద్ధృతంగా  పారిన వాగు

అల్లాదుర్గం: మండలంలోని గడి పెద్దాపూర్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో గ్రామ శివారులోని పెద్ద చెరువులోకి వచ్చే వాగు ఉద్ధృతంగా పారింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది స్పందించి సమస్య పరిష్కరించారు.

చందాపూర్‌లో నేలకూలిన విద్యుత్తు స్తంభం

చిన్నశంకరంపేట: ఈదురు గాలులకు మండల పరిధి చందాపూర్‌లోని వ్యవసాయ పొలాల్లో విద్యుత్తు స్తంభం నేలకూలింది. మండలంలోని అంబాజీపేట, శాలిపేట, గజగట్లపల్లి, రుద్రారం, జంగరాయిలో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో పాక్షికంగా ధాన్యం తడిచింది.

మండల కేంద్రంలో 4 సెం.మీ. వర్షపాతం

కౌడిపల్లి: మండలం కేంద్రంలో ఆదివారం గంటన్నరపాటు గాలిదుమారంతో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోయింది. కుప్పల్లోకి వరద చేరింది. ఆరబెట్టింది పూర్తిగా వరదపాలైంది. దాదాపు 4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు.

ట్రాక్టరు ధాన్యం తడిచింది..

సయ్యద్‌ సద్దాం హుసేన్, రైతు, చిన్న గొట్టిముక్ల

చిన్న గొట్టిముక్ల ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు కావొస్తోంది. సకాలంలో కొనకపోవడంతో ట్రాక్టరు ధాన్యం భారీ వర్షానికి తడిచింది. వరద వచ్చి వాగులోకి కొట్టుకుపోయింది. పంట పండినా లాభం లేకుండాపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని