logo

బాలలకు బాసట 1098

గత మార్చిలో కొమురవెల్లి మండలంలోని ఒక గ్రామంలో 17 ఏళ్ల బాలికకు వివాహం నిశ్చయమైందంటూ చైల్డ్‌లైన్‌ విభాగం టోల్‌ ఫ్రీ నంబరు 1098కి సమాచారం చేరింది.

Published : 26 May 2024 01:34 IST

ఎనిమిది నెలలుగా టోల్‌ ఫ్రీ సేవలు

 చైల్డ్‌ లైన్‌ విభాగంలో ఫిర్యాదుల నమోదు 

న్యూస్‌టుడే, సిద్దిపేట:  గత మార్చిలో కొమురవెల్లి మండలంలోని ఒక గ్రామంలో 17 ఏళ్ల బాలికకు వివాహం నిశ్చయమైందంటూ చైల్డ్‌లైన్‌ విభాగం టోల్‌ ఫ్రీ నంబరు 1098కి సమాచారం చేరింది. నిజ నిర్ధారణ చేసుకున్న సిబ్బంది సంబంధిత శాఖకు సమాచారం చేరవేశారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాల్య వివాహాల నిరోధక అధికారులు, ఇతర శాఖల సిబ్బంది వెంటనే బాలిక ఇంటికి చేరుకొని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేశారు. 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయబోమంటూ లిఖితపూర్వకంగా పత్రాన్ని రాయించారు. ఆ తదుపరి మూడుసార్లు పరిశీలన చేశారు. 
చైల్డ్‌ లైన్‌ విభాగం.. 18 ఏళ్లలోపు బాలబాలికలకు బాలబాలికలకు బాసటగా నిలుస్తోంది. జిల్లాలో గతేడాది ఈ విభాగం సేవలు మొదలయ్యాయి. టోల్‌ ఫ్రీ నం. 1098 ద్వారా అందే సమస్యలను ఆలకించే విభాగం.. పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటోంది. అందుకు వివిధ శాఖల సమన్వయంతో ముందడుగు వేస్తోంది. కలెక్టరేట్‌లోని కార్యాలయంలో కొనసాగుతున్న ఈ విభాగం రోజులో 24 గంటలు పని చేస్తోంది.
ప్రతి నెలకు 20 చొప్పున.. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో కొనసాగే చైల్డ్‌ లైన్‌ విభాగాన్ని గత ఏడాది జులైలో ప్రారంభించారు. అక్టోబరు నుంచి టోల్‌ ఫ్రీ నం. 1098 సేవలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 200కి పైగా కాల్స్‌ స్వీకరించారు. ప్రతి నెలకు 20 మందికి పైగా వినియోగించుకుంటున్నారు. సలహాలు, సూచనలు, సమస్యలు ఏవైనా 1098కి ఫోన్‌ చేయగానే.. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో సిబ్బంది స్పందించి సమస్యను నమోదు చేస్తారు. జిల్లాకు బదలాయించిన తదుపరి సంబంధిత శాఖ జిల్లా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర స్థాయిలోనే కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తారు. 


వీటిపైనే అధిక ఫిర్యాదులు 

జిల్లా పరిధిలో ఎక్కువగా బాల్య వివాహాలు, బడి మానేసిన పిల్లలు, కుటుంబ సమస్యలతో ఇబ్బందిపడే వారు, ఆవాసం, విద్య, వసతి లేని బాలబాబాలికల సమాచారం చేరుతోంది. వివిధ రకాల వేధింపులకు గురైనపుడు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, బాల కార్మికులుగా పని చేసిన సందర్భంలోనూ ఫిర్యాదులు అందుతున్నాయి. 


బలోపేతం అవశ్యం.. 

జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఎనిమిది పోస్టులుంటే ఆరుగురే పని చేస్తున్నారు. ప్రధానమైన సమన్వయకర్త, కౌన్సెలర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు చొప్పున సూపర్‌వైజర్లు, కేస్‌ వర్కర్స్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. సూపర్‌వైజర్లు రోజుకు మూడు విడతల్లో అందుబాటులో ఉంటున్నారు. కేసు వర్కర్లు.. క్షేత్రస్థాయిలో పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాలు, గ్రామాలు, జన సమూహాల వద్ద అవగాహన కల్పిస్తున్నారు. ఈ విభాగం సేవలను విస్తృతం చేయడంతో పాటు బలోపేతం చేయాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని