logo

రారండి.. కళాశాలలో చేరండి..

సొంత భవనాలు.. విశాలమైన మైదానాలు.. అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి.

Published : 26 May 2024 01:38 IST

ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి
ఊరూరా ప్రభుత్వ అధ్యాపకుల ప్రచారం

నంగునూరు మండలంలో విద్యార్థి వివరాలు సేకరిస్తున్న కళాశాల సిబ్బంది

న్యూస్‌టుడే, సిద్దిపేట: సొంత భవనాలు.. విశాలమైన మైదానాలు.. అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల క్రతువు మొదలైంది. మే 9వ తేదీన ప్రారంభమైన మొదటి విడత ప్రక్రియ 31వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రవేశాల సంఖ్యను పెంచి సీట్లు భర్తీ చేయడమే లక్ష్యంగా ఇంటర్‌ విద్యా శాఖ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. 
జిల్లాలో గత విద్యా సంవత్సరం ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో మొత్తం 6194 మంది చదివారు. అప్పట్లో ప్రథమ సంవత్సరంలో 3196 మంది చేరారు. విభాగాల వారీగా పరిశీలిస్తే.. జనరల్‌లో 2327 మంది, ఒకేషనల్‌లో 869 మంది ఉన్నారు. జిల్లాలో ప్రథమ సంవత్సరంలో దాదాపు 5 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లను భర్తీ చేసేలా దృష్టి సారించారు. 
ప్రత్యక్షంగా కలుస్తూ.. కళాశాలల పరిధిలో ప్రత్యేకంగా కరపత్రాలు రూపొందించి.. బ్యానర్లను ప్రదర్శిస్తూ అధ్యాపకులు ముందుకు సాగుతున్నారు. ఊరూరా తిరుగుతూ పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలుస్తూ కళాశాల విశేషాలు చెబుతున్నారు. వసతులు, ప్రయోగశాలలు, ఒనగూరే ప్రయోజనాలు వివరిస్తున్నారు. ఏటా పాఠ్య పుస్తకాలు పంపిణీ సహా ఫలితాల సాధనకు శ్రమిస్తున్న తీరును వల్లెవేస్తున్నారు. గతేడాది ఇదే తరహాలో చేసిన ప్రయత్నం కొంత మేర సత్ఫలితాలు ఇచ్చింది. 

జిల్లాలో తగ్గుతున్న ప్రైవేటు కళాశాలలు.. 

జిల్లాలో ప్రైవేటు కళాశాలల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గురుకులాల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరుతుండటం ఒక కారణమైతే ఉపకార వేతనాలు సకాలంలో రాకపోవడంతో మరో కారణమవుతోంది. దీంతో నిర్వహణ భారమై గతేడాది జిల్లాలో మూడు కళాశాలలు మూసివేశారు. ఈసారి మరికొన్ని అదే బాటలో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 26 ప్రైవేటు కళాశాలలు కొనసాగుతున్నాయి. గతేడాది సుమారు 5 వేల మంది చదివారు. ఏటా అనుమతి కోసం ఇంటర్‌బోర్డుకు దరఖాస్తు (రెన్యూవల్‌) చేసుకుంటుండగా.. ఇప్పటి వరకు జిల్లాలో 8 అనుమతి పొందాయి. మిగిలినవి వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి.


సమష్టి సహకారంతో.. 

-సూర్యప్రకాశ్, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి 

అన్ని వసతులతో ప్రభుత్వ కళాశాలలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. ఈసారి ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. సమష్టి సహకారంతో విద్యార్థుల సంఖ్యను పెంచుతాం. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని