logo

ఉన్నతీకరణకు నోచని పది కస్తూర్బాలు

అనాథ, నిరుపేద బాలికలు, బడి బయటి పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. పదో తరగతి పూర్తి చేసిన తరువాత ఇంటర్మీడియట్‌ పూర్తి స్థాయిలో లేకపోవడంతో సీటు దక్కని చాలా మంది

Published : 26 May 2024 01:41 IST

ఇంటర్‌ నిర్వహణకు చేజారిన అవకాశం 

ఇంటర్‌కు అప్‌గ్రేడ్‌ కాని కాశీపూర్‌లోని కస్తూర్బా పాఠశాల 

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, కంది: అనాథ, నిరుపేద బాలికలు, బడి బయటి పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. పదో తరగతి పూర్తి చేసిన తరువాత ఇంటర్మీడియట్‌ పూర్తి స్థాయిలో లేకపోవడంతో సీటు దక్కని చాలా మంది విద్యార్థినులు ప్రైవేట్‌ కళాశాలల్లో చదివే స్థోమత లేకపోవడంతో ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇందులో 6 నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. గతంలోనే జిల్లాలో 10 కస్తూర్బా పాఠశాలలను ఇంటర్మీడియట్‌కు అప్‌గ్రేడ్‌ చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు కళాశాలలకు అవకాశం కల్పించారు. వచ్చే విద్యా సంవత్సరం కోసం ఇప్పటికీ కొత్తగా కస్తూర్బాల ఉన్నతీకరణ కేటాయింపులు లేవు. ఇప్పటికే ఇంటర్‌ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రాంరంభం కానుంది. సమగ్ర శిక్ష అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కొత్తగా మూడు పాఠశాలలకు అనుమతిచ్చిన ఉన్నతాధికారులు.. కళాశాలల మంజూరు అంశానికి ఆమోదం తెలపలేదు. 

ప్రతిపాదనలు పంపించినప్పటికీ..

జిల్లాలో 17 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో మరో మూడు ప్రారంభం కానున్నాయి. దీంతో కస్తూర్బాల సంఖ్య 20కి చేరనుంది. వీటిలో 10 పాఠశాలల్లో మాత్రమే ఇంటర్మీడియట్‌ అమలవుతోంది. 2021-23 విద్యా సంవత్సరంలో సంవత్సరంలో కొండాపూర్‌కు, 2023-24 విద్యా సంవత్సరంలో రాయికోడ్, పుల్కల్‌ మండలాలకు ఇంటర్మీడియట్‌ను కేటాయించారు. అన్నింటికీ అవకాశం దక్కాలని జిల్లా సమగ్ర శిక్ష అధికారులు ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు అనుమతి ఇవ్వలేదు. కొత్త కళాశాలలు వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రతీ ఏడాది కస్తూర్బాల్లో 700 మందికిపైగా బాలికలు పదో తరగతి పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతమున్న 7 కళాశాలల్లో 400 మంది మాత్రమే ప్రవేశాలు పొందుతున్నారు. వీటిలో సీట్లు లభించని విద్యార్థినులు నిరుత్సాహంగా వెనక్కి వెళుతున్నారు. అధికారులు స్పందించి కొత్త కళాశాలలు కేటాయించేలా చూడాలని కోరుతున్నారు. కస్తూర్బాల్లో ఉత్తమ బోధనతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన పేద విద్యార్థినులు కూడా ఇందులో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొత్త కళాశాలలు రాకపోతే విద్యార్థినులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇకనైనా అధికారులు స్పందించాలని విద్యార్థినులు కోరుతున్నారు.


ఎక్కడెక్కడ..

హత్నూర, కంది మండలం కాశీపూర్, కంగ్జి, మనూరు మండలం పుల్‌కుర్తి, మునిపల్లి మండలం తాటిపల్లి, రామచంద్రాపురం, నాగల్‌గిద్ద, గుమ్మడిదల, చౌటకూరు, న్యాల్‌కల్‌ కస్తూర్బా విద్యాలయాలు ఇంటర్మీడియట్‌కు ఉన్నతీకరణ పొందాల్సి ఉంది.


ఉన్నతాధికారులకు మరోసారి విన్నవిస్తాం: సుప్రియ, జిల్లా బాలికల అభివృద్ధి అధికారిణి

కస్తూర్బాల్లో ఇంటర్‌ అప్‌గ్రేడ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఆదేశాలు రాలేదు. మూడు కొత్త పాఠశాలలు మాత్రమే మంజూరు చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు మరోసారి విన్నవిస్తాం. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని