logo

పేర్లు ఉండవు... వివరాలు కానరావు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశ్రమ వివరాలతో గేటు వద్ద బోర్డు ఏర్పాటు చేయాలి. పేరు, స్థాపన, ఉత్పత్తుల వివరాలు నమోదు చేయాలి.

Published : 26 May 2024 01:55 IST

అక్రమాలకు అడ్డాలుగా పారిశ్రామికవాడలు

ఐడీఏ బొల్లారంలోని పారిశ్రామికవాడ 

  • గడ్డపోతారంలోని ఓ పరిశ్రమలో మత్తు పదార్థాలు తయారు చేస్తూ పటుబడ్డారు. దీంతో డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగం, ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పరిశ్రమ వివరాలు తెలుసుకోవటానికి ఐదారు గంటలు ఇబ్బంది పడాల్సి వచ్చింది.  
  • ఏడాది క్రితం ఐడీఏ బొల్లారంలోని మూతపడిన పరిశ్రమలో మత్తు మందు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అధికారుల రాకను చూసి అందులో పనిచేసే వారంతా పరారయ్యారు. పరిశ్రమ ముందు ఎలాంటి బోర్డులు లేవు. 

న్యూస్‌టుడే, జిన్నారం: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశ్రమ వివరాలతో గేటు వద్ద బోర్డు ఏర్పాటు చేయాలి. పేరు, స్థాపన, ఉత్పత్తుల వివరాలు నమోదు చేయాలి. ఉత్పత్తుల ద్వారా వచ్చే వ్యర్థాలు, వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలను పేర్కొనాలి. రసాయన పరిశ్రమలయితే ఎలక్ట్రానిక్స్‌ డిస్‌ప్లే బోర్డు ఏర్పాటు చేసి పీసీబీకి అనుసంధానించాలి. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఈ నిబంధనలు చాలా చోట్ల అమలు కావడం లేదు. ఒక్కోసారి అంతర్జాతీయ స్థాయిలో మత్తు మందు, డ్రగ్స్‌ పట్టుపడినపుడు ఇక్కడ సంబంధిత పరిశ్రమలు ఎక్కడున్నాయో తెలియని అయోమయం నెలకొంటోంది. పన్నులూ ఎగవేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. 

ప్రత్యేక దృష్టి సారించాల్సినవి

జిల్లాలోని అన్ని పారిశ్రామికవాడల్లోనూ అక్రమాలు గుట్టుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఐడీఏ బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి, పటాన్‌చెరు, పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్, రుద్రారం, ముత్తంగి, బండ్లగూడ, హత్నూర, జహీరాబాద్, సదాశివపేట తదితర ప్రాంతాలపై జిల్లా పరిశ్రమల శాఖతో పాటు టీఎస్‌ఐఐసీ ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. పీసీబీతో పాటు డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగం, పరిశ్రమల కర్మాగారాల భద్రతా శాఖ, అగ్నిమాపక శాఖలతో పాటు స్థానిక సంస్థలు అక్రమాల కట్టడికి సమన్వయంతో పనిచేయాలి. వీరు సంబంధిత యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొచ్చి నిబంధనలు అమలయ్యేలా చూడాలి.

పట్టించుకోని అధికారులు

అక్రమాలకు కేంద్ర బిందువులుగా గేటు బయట వివరాలు వెల్లడించని పరిశ్రమల వద్దనే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్య అధికారుల దృష్టికి వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోని తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి పరిశ్రమ గేటు వద్ద కంపెనీ వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని పీసీబీ ఈఈ కుమార్‌ పాఠక్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని