logo

ఆహార శుద్ధి.. అతివల ఆర్థిక వృద్ధి

ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలన్న లక్ష్యంతో మహిళలు పొదుపు సంఘాల్లో చేరుతున్నా ఆశించిన స్థాయిలో స్థితిగతులు మారడం లేదు.

Published : 26 May 2024 02:00 IST

పీఎంఎఫ్‌ఎంఈ ద్వారా రాయితీ రుణాలతో ప్రోత్సాహం

సమావేశమైన మహిళా సంఘం సభ్యులు  

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి అర్బన్, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్‌: ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలన్న లక్ష్యంతో మహిళలు పొదుపు సంఘాల్లో చేరుతున్నా ఆశించిన స్థాయిలో స్థితిగతులు మారడం లేదు.  స్వయం ఉపాధికి బాటలు వేసుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు దిశగా వారిని అడుగులు వేయించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) భావిస్తోంది. ఇందుకోసం రాయితీ రుణాలు మంజూరు చేస్తున్నారు. 

365 యూనిట్లు.. రూ.6.75కోట్లు

ఆహారశుద్ధి యూనిట్లపై అధికారులు గతంలో సర్వే నిర్వహించారు. జిల్లాలో మిరప, పసుపు, పప్పు మిల్లులు, పాలపదార్థాల ఉత్పత్తి, చిరుధాన్యాలు, నూనె, చిన్న రైస్‌మిల్లులు, పాపడాలు, పచ్చళ్లు తదితర యూనిట్లతో మహిళలు ఉపాధి పొందుతున్నట్లు గుర్తించారు. పీఎం ఫార్ములేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ స్కీమ్‌(పీఎంఎఫ్‌ఎంఈ) పథకం కింద రాయితీపై రుణాలు మంజూరు చేస్తున్నారు. దీనివల్ల యూనిట్ల విస్తరణకు మార్గం సుగమం అవుతోంది. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.6.75 కోట్లతో 365 యూనిట్లను గ్రౌండింగ్‌ చేశారు. యూనిట్‌ విలువలో 35శాతం చొప్పున రాయితీ ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా మహిళా సంఘాల సభ్యులకు రాయితీ రుణాల పంపిణీకి కార్యాచరణ రూపొందిస్తున్నారు.


పాడి గేదెలతో జీవనోపాధి

జహీరాబాద్‌ పట్టణంలోని హమాలీ కాలనీకి చెందిన పార్వతమ్మ స్థానిక స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. గ్రూపు ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు 20 పర్యాయాలు బ్యాంకు రుణం తీసుకొని మిగతా సభ్యులతో పాటు సక్రమంగా తిరిగి చెల్లిస్తున్నారు. ఇంతకాలం వివిధ పనులు నిర్వహించుకొని ఉపాధి పొందగా.. పీఎంఎఫ్‌ఎంఈ ద్వారా ఇటీవల రూ.1.80 లక్షలు రుణం తీసుకున్నారు. రెండు పాడిగెదెలను కొనుగోలు చేశారు. గేదెల పాల ద్వారా వచ్చిన ఆదాయంలోని కొంత డబ్బును రుణాల కిస్తులు చెల్లిస్తూ మిగితా డబ్బుతో  ఆర్థిక ఉన్నతికి బాటలు వేసుకుంటున్నారు.


వ్యాపారం విస్తరించి.. ఇబ్బందులు అధిగమించి..

ప్రభుత్వమిస్తున్న రుణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ముందుకు వెళుతున్నారు అం దోలు మండలంలోని ఎర్రారం గ్రామానికి చెందిన కళాలి జ్యోతి. తులసి డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా చేరారు. మొదట్లో రూ.30 వేల రుణం తీసుకొని కిరాణా దుకాణం ప్రారంభించారు. ఇటీవల పీఎంఎఫ్‌ఎంఈ ద్వారా 35 శాతం రాయితీ కింద రూ.2లక్షల రుణం పొందారు. కిరాణా దుకాణంలోనే పిండి, కారం గిర్నీలు ప్రారంభించారు. రోజు వారీ కుటుంబ పోషణతో పాటు ఇతర ఖర్చులు పోను రోజుకు రూ.500 వరకు లాభం పొందుతున్నారు. భర్త నర్సింహగౌడ్‌ ఆటో నడుపుతుండగా తన ఆదాయం తోడవడంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నామని జ్యోతి తెలిపారు.


సద్వినియోగంతో సత్ఫలితాలు

-జంగారెడ్డి, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి

ఆహారశుద్ధి యూనిట్లతో మహిళా సంఘాల సభ్యులకు ప్రయోజనం ఉంటుంది. యూనిట్ల విస్తరణతో మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుంటుంది. వినియోగదారులకు కల్తీలేని ఆహార ఉత్పత్తులు అందించవచు. మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక సంవత్సరం మహిళల ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని