logo

స్త్రీనిధి.. పెన్నిధి

 పొదుపు సంఘాల్లో చేరుతున్న మహిళలు పేదరికం నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు సులభంగా అందుతున్నాయి.

Published : 26 May 2024 02:10 IST

రుణ లక్ష్యాలు ఖరారు
సమష్టి కృషితోనే  మహిళలకు ప్రయోజనం

మహిళా సంఘం సభ్యులు 

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్, జోగిపేట, సిద్దిపేట, పరిగి, తాండూరు, జహీరాబాద్, వికారాబాద్‌ మున్సిపాలిటీ: పొదుపు సంఘాల్లో చేరుతున్న మహిళలు పేదరికం నుంచి బయటపడేందుకు యత్నిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు సులభంగా అందుతున్నాయి. రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించడమే ఇందుకు ప్రధాన కారణం. పొదుపు చేస్తూనే రుణాలతో స్వయం ఉపాధి దిశగా పలువురు అడుగులు వేస్తూ కుటుంబ ఉన్నతిలో భాగస్వాములు అవుతున్నారు. స్త్రీనిధి రుణాలు తోడుకావడంతో మహిళాభ్యున్నతికి బాటలు పడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు స్త్రీనిధి రుణ లక్ష్యాలను ఖరారు చేశారు.
సంగారెడ్డి జిల్లాకు అత్యధికం: మహిళా సంఘాలకు స్త్రీనిధి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాకు కేటాయించడం గమనార్హం.  సమష్టిగా ముందుకు సాగితే లక్ష్యాలను చేరుకోవడం సులభమే.

స్వయం ఉపాధి యూనిట్లకు ప్రాధాన్యం: స్త్రీనిధి ద్వారా అందించే రుణాలను స్వయం ఉపాధి యూనిట్లకు మంజూరు చేస్తారు. దీనివల్ల తీసుకున్న రుణాలను వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లింపులకు ఇబ్బంది ఉండటం లేదు. పెరటి కోళ్ల పెంపకం, పాడి గేదెలు, కొత్త వ్యాపారాలు, వ్యాపారాల విస్తరణకు రుణాలు అందిస్తారు. తక్కువ ధరలకే ఔషధాల విక్రయానికి ఉద్దేశించిన జనరిక్‌ మందుల దుకాణాల ఏర్పాటుకూ రుణ సదుపాయం కల్పిస్తారు.
నెలకోసారి సమన్వయం: ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే లక్ష్యాల సాధనపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీనిధి అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏదైనా గ్రామైక్య సంఘం పరిధిలో సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత వీవోఏతో మాట్లాడి రుణాల పంపిణీ వేగవంతమయ్యేలా చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయించాలని భావిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఏ నెలకు సంబంధించిన లక్ష్యాలను అదే నెలలో అదిగమించేందుకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారు.


ఆర్థికోన్నతికి సద్వినియోగం చేసుకోవాలి: మోహన్‌రెడ్డి, స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్‌

మహిళా సంఘాల సభ్యుల ఉన్నతి లక్ష్యంగా స్త్రీనిధి రుణాలు మంజూరు చేస్తున్నాం. స్వయం ఉపాధి యూనిట్లకే రుణాలు అందించడం ఇందులో భాగమే. తీసుకున్న రుణాలను ఇంటి అవసరాలకే వినియోగించుకుంటే తిరిగి చెల్లింపులు కష్టంగా మారుతుంది. ఉపాధి యూనిట్లు నెలకొల్పడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. బ్యాంకు రుణాలకు తోడు స్త్రీనిధి రుణాలు తీసుకోవడంతోపాటు సద్వినియోగంపై అవగాహన పెంపొందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని