logo

చిరుధాన్యాల సాగు.. ఆదర్శానికి సరితూగు

పంటల సాగులో పురుగు మందుల వల్ల ఆహార పదార్థాల్లో  అవశేషాలు ఉండి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కొంతమంది రైతులు సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించారు.

Published : 26 May 2024 02:15 IST

రైతు నిర్మించిన గొర్రెల పాక 

జగదేవపూర్, న్యూస్‌టుడే: పంటల సాగులో పురుగు మందుల వల్ల ఆహార పదార్థాల్లో  అవశేషాలు ఉండి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కొంతమంది రైతులు సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించారు. అవగాహన కలిగిన వినియోగదారులు చిరుధాన్యాల ఆహారాన్ని రోజూ తీసుకోవడంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. అధిక పోషకాలు కలిగిన చిరుధాన్యాల పంటలను సాగు చేస్తున్నారు. తోటి రైతులకు విత్తనాలు ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలం అలిరాజపేట గ్రామానికి చెందిన రాచమల్ల కిష్టయ్య, మొగిలి కరుణాకర్‌రెడ్డి తమ 3, 2 ఎకరాల్లో మూడేళ్లుగా చిరుధాన్యాల సాగు చేస్తున్నారు.
గొర్రెల పెంపకం అదనం: తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటలను పండించడం ఎలాగో చేసి చూపిస్తున్నారు. ప్రధానంగా సజ్జ, కొర్రలు, రాగులు, పచ్చ జొన్న, మక్కలు వేస్తున్నారు. ఖాళీ స్థలం, గట్లపైన వాటికి తోడుగా కూరగాయలు పండిస్తున్నారు. కరుణాకర్‌రెడ్డి తన ఖాళీ స్థలంలో పాక నిర్మించి అందులో 50 గొర్రెలను సాకుతున్నారు. పంటల ద్వారా వచ్చిన గ్రాసం, కొంత పచ్చి గడ్డి వంటివి  మేపుతున్నారు.తక్కువ సమయంలోనే ఒకవైపు చిరుధాన్యాల పంటలు.. మరోవైపు జీవాలతో మాంసం ఉత్పత్తికి తోడ్పడుతున్నారు. ఫలితంగా అదనపు ఆదాయం సమకూరుతోంది. వీరి సాగు తీరు చూసి ఇతర రైతులు మక్కువ చూపుతున్నారు.


సౌర కంచెతో రక్షణ: రాచమల్ల కిష్టయ్య

చిరుధాన్యాల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలని తెలుసుకున్నా. హాస్‌ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన శిక్షణకు హాజరైన. అనేక విషయాలు తెలుసుకున్నా. కుటుంబ సభ్యుల ఆహారంలో రోజు చిరుధాన్యాల వంటకాలు ఉంటాయి. అడవి పందులు, కోతుల బెడద నివారణకు సౌర కంచె వేసుకొని పంటలకు రక్షణ కల్పిస్తున్నా.


అతిథులకు పాయసం: మొగిలి కరుణాకర్‌రెడ్డి

ఇంటికి వచ్చిన అతిథులకు కొర్రలతో తయారుచేసిన పాయసం తప్పకుండా ఇస్తాం. చిరుధాన్యాల గింజలు కొన్ని బంధువులకు పంపిస్తాం. రసాయన అవశేషాలు లేని ఆహారంగా చిరుధాన్యాల వంటకాలకు  ప్రాధాన్యం పెరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని