logo

కాస్త అవగాహన.. మస్తు సాంత్వన

మెదక్‌ జిల్లా హవేలిఘనపూర్‌ మండలం శమ్నాపూర్‌ గ్రామానికి చెందిన భైరయ్య తల్లి రెణ్నెల్ల క్రితం స్థానిక బావిలో పడింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే భరించలేని కుమారుడికి గుండెపోటు వచ్చింది.

Published : 26 May 2024 02:26 IST

అత్యవసరంలో ప్రాణం నిలుపుతున్న సీపీఆర్‌

సీపీఆర్‌పై సంగారెడ్డిలో అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది 

  • మెదక్‌ జిల్లా హవేలిఘనపూర్‌ మండలం శమ్నాపూర్‌ గ్రామానికి చెందిన భైరయ్య తల్లి రెణ్నెల్ల క్రితం స్థానిక బావిలో పడింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే భరించలేని కుమారుడికి గుండెపోటు వచ్చింది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఏఏస్‌ఐ రాజు వెంటనే బాధితుడికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. ఆ ఘటనలో భైరయ్య ప్రాణాలు దక్కగా బావిలో పడిన ఆయన తల్లి కన్నుమూసింది.

  • గత ఏడాది ఏప్రిల్‌లో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామంలో బిహార్‌కు చెందిన ఓ ఉద్యోగి కుమార్తె (23 రోజులు) స్నానం చేయించే క్రమంలో నీటిని మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చిన్నకోడూరు 108 అంబులెన్సు సిబ్బంది ఈఎంటీ అశోక్, పైలెట్‌ వెంకట్‌ చేరుకొని పరిశీలించి, గుండె ఆగినట్టు నిర్ధారించుకొని సీపీఆర్‌ చేశారు. ఫలితంగా శిశువు శ్వాస తీసుకోవడం మొదలెట్టింది.

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్, సిద్దిపేట, మెదక్, హవేలిఘనపూర్‌: రక్త ప్రసరణకు పునరుద్ధరణ: ఆగిపోయిన గుండె, శ్వాసను పునః ప్రారంభించేందుకు చేసే ఓ గొప్ప యత్నమే సీపీఆర్‌. సడెన్‌ కార్టియక్‌ అరెస్టులో.. వయసు, అనారోగ్య సమస్యలతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా కుప్పకూలుతారు. ఇలాంటి పరిస్థితుల్లో 4 నిమిషాల వ్యవధిలో మెదడుకు ప్రాణవాయువు అందక బ్రెయిన్‌ డెడ్‌ అయ్యే అవకాశం ఉంటుంది.సీపీఆర్‌ (కార్డియోపల్మనరీ రిసాసిటేషన్‌) చేసి బతికిస్తున్నారు. దానిపై ప్రతి ఒక్కరికీ గతేడాది ఏప్రిల్‌ నుంచి అవగాహన కల్పిస్తున్నారు.  దేశంలో ఏటా గుండె ఆగి 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఆరేళ్ల బాలుడు అనుకోకుండా విద్యుత్తు తీగలకు తాకి ప్రమాదానికి గురయ్యాడు. అమ్మనాన్నలు ఆస్పత్రికి తీసుకెళుతుండగా అత్యవసర పరిస్థితి తెలుసుకొని దారిలోనే డాక్టర్‌ నన్నపనేని రవళి సీపీఆర్‌ చేశారు. ప్రాణాలు కాపాడారు. ఎప్పుడు?: మనిషి ఆక్సిజన్‌ తీసుకోలేనప్పుడు గుండె రక్తం పంపింగ్‌ నిలిచిపోతుంది. సీపీఆర్‌తో కాపాడవచ్చు.

  • చికిత్స ప్రారంభమయ్యేలోపు, అంబులెన్స్‌ వచ్చేలోపు సీపీఆర్‌ చేయాలి.
  • స్పృహలో లేని వ్యక్తికి చేయాల్సి ఉంటుంది. కోలుకొని తదుపరి చికిత్సకు స్పందించే అవకాశం ఉంటుంది. ఎలా?: బాధితుల వెన్నెముక నేలకు తగిలేలా వెల్లకిలా పడుకోబెట్టి చేయాలి.
  • సీపీఆర్‌ చేసేవారి భుజాలు చేతుల కంటే ఎత్తుపైన ఉండాలి.
  • బాధితుల నోరు తెరిచి ఉండేలా చూసుకోవాలి.ః గుండె మీద ఎడమ చేయి, పైన కుడి చేయి పెట్టి వేళ్లను లాక్‌ చేయాలి.
  • రెండు చేతులతో ఛాతీపై సుమారు 30 సార్లు నొక్కుతూ ఒత్తిడి చేస్తుండాలి.
  • పది సెకన్లకొకసారి చేయాలి. ఐదు దఫాలుగా చేయాలి. వారు స్వయంగా శ్వాస తీసుకునే వరకు సీపీఆర్‌ చేయాలి.
  • తర్వాత రెండు సార్లు నోటితో శ్వాస అందించాలి.

సిబ్బందికి అవగాహన: సంగారెడ్డి జిల్లాలో ఆరోగ్య శాఖలో పని చేసే వారికి, విద్య, ఆర్టీసీ, మెప్మా,. పోలీస్, వ్యవసాయ, యువజన సంక్షేమ శాఖ, ఐసీడీఎస్‌ ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ శాఖలలో అధికారులకు,  సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లుగా వైద్యాధికారిణి గాయత్రిదేవి తెలిపారు. మరింత ప్రణాళికతో ముందుంటామని పేర్కొన్నారు.సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ప్రభుత్వ అన్ని విభాగాల సిబ్బందికి సీపీఆర్‌పై విస్తృతంగా సదీర్ఘకాలం శిక్షణ ఇచ్చారు. వైద్యారోగ్య శాఖ నేతృత్వంలో విడతల వారీగా చేపట్టారు.  సామూహిక శిక్షణతో ఎక్కువమందికి అవగాహన కల్పించేందుకు దోహదం చేసింది. 


భుజం తట్టినా లేవకపోవడమే గుర్తు: గాయత్రిదేవి, సంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి వైద్యాధికారిణి

ఎవరికి సీపీఆర్‌ అవసరమో ముందుగా గుర్తించడం ముఖ్యం. బాధితులను భుజం తట్టినా కదలకపోవడం.. ఏమి అడిగినా సమాధానం చెప్పలేకపోవడాన్ని స్పృహ లేనట్టు గుర్తించి అవసరమైతే సీపీఆర్‌ చేయాలి. సాధారణంగా గుండెపోటు, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం.. రోడ్డు ప్రమాదాలు, ఈత కొడుతూ మునిగిపోవడం.. పురుగుమందు తాగి ఆయాస పడటం.. అగ్నిప్రమాదాల్లో పొగ పీల్చడం, విద్యుదాఘాతానికి గురవడం లాంటి స్థితిలో తప్పక సీపీఆర్‌ చేయాలి.


సామాజిక బాధ్యత: డా. వినోద్‌ బాబ్జీ, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి (సిద్దిపేట జిల్లా)

కుటుంబంలో ప్రతి ఒక్కరికి సీపీఆర్‌పై అవగాహన ఉండాలి. విపత్కర పరిస్థితుల్లో బతికించే అవకాశం దక్కుతుంది. వివిధ సందర్భాల్లో సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్నాం. ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితుడి భుజాల వద్ద తడుతూ స్పందనలు తనిఖీ చేయాలి. వెంటనే 108 అంబులెన్సుకు ఫోన్‌ చేయాలి. ఈ క్రమంలోనే మెడ వద్ద పల్స్, శ్వాసను తనిఖీ చేయాలి. అవి లేకుంటే సీపీఆర్‌ మొదలెట్టాలి. అవగాహనతో స్పందించే తీరు ఒక ప్రాణాన్ని నిలుపుతుంది. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని