logo

ఆదర్శప్రాయంగా అంగన్వాడీలు

అంగన్వాడీ కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణంతో పాటు, ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించడానికి అధికారులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.

Published : 26 May 2024 02:30 IST

జిల్లాలో 15 కేంద్రాల ఎంపిక
జూన్‌ నుంచి అందుబాటులోకి..

తుజాల్‌పూర్‌లో ఆహ్లాదకర వాతావరణంలో చిన్నారులు  

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: అంగన్వాడీ కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణంతో పాటు, ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించడానికి అధికారులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్‌ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం) ప్రాజెక్టుల పరిధిలోని 15 కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిల్లో సీఎస్‌ఆర్‌ నిధులతో పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్పొరేట్‌ క్రష్‌ సెంటర్లకు దీటుగా వీటిని తీర్చిదిద్దుతున్నారు. జూన్‌ నెల నుంచి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం... 

క్షేత్రస్థాయిలో ఇలా...

జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 885 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 191 మినీ అంగన్వాడీలు పనిచేస్తున్నాయి. వీటిలోంచి 15 కేంద్రాలను ఎంపిక చేసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఆసక్తికర కథలతో పూర్వప్రాథమిక విద్యను అందించడంతో పాటు, హాజరు సంఖ్యను పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. చిన్నారుల మేధో వికాసమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. మిగతా కేంద్రాలకు భిన్నంగా ఏర్పాటు చేస్తున్న ఆదర్శ కేంద్రాలకు తల్లిదండ్రుల నుంచి మంచి ఆదరణ లభించనుందని భావిస్తున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలకు ప్రాధాన్యం పెరగనుంది. ప్రభుత్వం వీటి బలోపేతంతో పాటు విద్యాబోధనలో నవ్యత కోసం అనేక చర్యలు చేపడుతోంది. పిల్లల ఎదుగుదలకు పాలు, పండ్లు, బాలామృతం, భోజనం అందజేస్తోంది. ఇప్పుడు పూర్వప్రాథమిక విద్యాబోధనలో నాణ్యతపైనా దృష్టి పెడుతోంది. ఆదర్శ కేంద్రాల్లో చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. చిన్నారులు ఇష్టపడే కథలతో బోధన చేస్తారు. ఆకట్టుకునే బొమ్మలతో కూడిన పుస్తకాలు, సామగ్రి అందజేస్తారు. కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచడం, ఆటలాడించడం, ప్రతిజ్ఞ, స్నాక్స్, గుడ్లు అందించడం, వ్యాయామం, పూర్వప్రాథమిక విద్య పుస్తకంలోని ఆటలు ఆడించడం, కథలు చెప్పడం వంటివి చేస్తారు. ఆట వస్తువులతో ఆటలు, మధ్యాహ్న భోజనం, చిన్నారులను నిద్రపుచ్చడం, పాటలు పాడటం, వారితో కలిసి టీచర్‌ ఆడటం చేస్తారు. స్నాక్స్‌ ఇచ్చి విజ్ఞానం, పరిసరాలను తెలియజేయడం, వృత్తాకారంలో నిలబెట్టి ఇంటికి పంపించడం చేస్తారు. 3-6ఏళ్లలోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వస్తుండగా, దీంతో హాజరు శాతం పెరగడంతోపాటు పౌష్టికాహారం లభిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులకు వెళ్లే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు క్రష్‌ సెంటర్లకు పంపించే ఆర్థిక స్తోమత ఉండదు. ఇది గమనించిన అధికారులు డిమాండ్‌ మేరకు ఆదర్శ కేంద్రాలను పరిచయం చేయాలని నిర్ణయించారు. చిన్నారులకు కేంద్రాల్లో భద్రత, సురక్షితంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. 


ప్రతి కేంద్రానికి రూ.3.50లక్షలు 

ఆదర్శ కేంద్రాలుగా ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాలో పలు సౌకర్యాల కల్పనకు రూ.3.50లక్షలు కేటాయించారు. కేంద్రాల్లో ఫ్యాన్లు, బల్బులు ఏర్పాటు చేస్తున్నారు. మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. కేంద్రాల ఆవరణ, లోపల చిత్రాలు గీయిస్తారు. ఆవరణలో ఆడేందుకు వీలుగా పరికరాలను బిగిస్తున్నారు. పచ్చని చెట్లతోపాటు, చిన్నారులకు పౌష్టికాహారాన్నిచ్చే వాటిని పెంచుతున్నారు. ప్రత్యేకంగా సిలబస్‌ రూపకల్పనతో కొన్ని పుస్తకాలను వారికి చేరువ చేస్తున్నారు.  తెలుగు, హిందీ, ఆంగ్లం ఇలా అన్ని భాషలపైనా పట్టు పెంచనున్నారు. చిన్నారుల శారీరక ఎదుగుదలపైనా దృష్టిపెడతారు. నివేదికలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతారు. బరువు కొలిచే పరికరాలను అందుబాటులో ఉంచారు. 


నర్సాపూర్‌ ప్రాజెక్టు పరిధిలో...

నర్సాపూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఐదు కేంద్రాలను ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. రెడ్డిపల్లి, జక్కపల్లి, చిన్నచింతకుంట, తుజాల్‌పూర్, తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిల్లో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించారు. వీలైనంత త్వరగా జూన్‌ నుంచి ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని సీడీపీవో హేమాభార్గవి తెలిపారు. వీటిని ఆదర్శంగా తీర్చిదిద్దడంతోపాటు మిగతా కేంద్రాలను దశలవారీగా వీటిలా మారుస్తామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని