logo

రైతులందరి ధాన్యం కొంటాం: కలెక్టర్‌

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి రైతు ధాన్యాన్ని కొంటామని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మండలంలోని రెడ్డిపల్లిలో కొనుగోలు కేంద్రంను పరిశీలించారు.

Published : 26 May 2024 02:43 IST

దుస్తుల తయారీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌  

నర్సాపూర్‌ రూరల్‌: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి రైతు ధాన్యాన్ని కొంటామని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మండలంలోని రెడ్డిపల్లిలో కొనుగోలు కేంద్రంను పరిశీలించారు. వర్షాలు వస్తే ఇబ్బందులు వస్తాయని, ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని ధాన్యం అరబెట్టి తీసుకువస్తే వెంటనే కొనుగోలు చేయడానికి సులువుగా ఉంటుందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. 55,466 రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి రూ.382.43 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. 163 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తయిందని తెలిపారు. మెదక్‌ జిల్లా నుంచి సిద్దిపేటకు 10వేల మెట్రిక్‌ టన్నులు, మహబూబ్‌నగర్‌ 40వేలు, జోగులాంబ గద్వాలకు 10వేల అర్డర్‌ వచ్చినట్లు చెప్పారు. ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ కమలాద్రి, ఆర్‌ఐ సిద్దిరాంరెడ్డి, సీసీ ప్రవీణ, సీఏ మహేశ్వరితదితరులు ఉన్నారు.  

స్ట్రాంగ్‌ రూముల పరిశీలన

నర్సాపూర్‌: పట్టణంలోని బీవీఆర్‌ఐటీ కళాశాలలోని ఈవీఎంల, పోస్టల్‌ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూములను, సీసీ కెమెరాలకు సంబంధించిన కంట్రోల్‌ రూమును జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ శనివారం తనిఖీ చేశారు. భద్రతా చర్యల్ని, స్ట్రాంగ్‌ రూములలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. మూడంచెల భద్రత, రక్షణ ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీల రిజిష్టర్‌ నిర్వహణను చూశారు.

విద్యార్థులకు సకాలంలో అందించాలి...

పాపన్నపేట: పాఠశాలలు తెరిచే లోపు ఏకరూప దుస్తులు తయారుచేసి అందించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ ఆదేశించారు. మండల పరిధిలోని యూసుఫ్‌పేటలో మహిళా స్వశక్తి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్‌ కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో 70 మహిళా స్వశక్తి సంఘాల ద్వారా 78,000ల ఏకరూప దుస్తుల తయారీ నడుస్తోందన్నారు. త్వరలో పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అందిస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ దుస్తులు కుట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు అందజేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌ లక్ష్మణ్‌ బాబు, ఏపీఎం సాయిలు తదితరులున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని