logo

పంచాయతీల్లో పైసల్లేక..!

పాపన్నపేట మండలంలో 36 గ్రామ పంచాయతీ ఉన్నాయి. వీటికి 8 నెలల నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం, మూడు నెలల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు.

Updated : 26 May 2024 06:36 IST

ప్రగతి పనులకు ఆటంకం

 న్యూస్‌టుడే-మెదక్, పాపన్నపేట, శివ్వంపేట:

  • పాపన్నపేట మండలంలో 36 గ్రామ పంచాయతీ ఉన్నాయి. వీటికి 8 నెలల నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం, మూడు నెలల నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. ప్రస్తుతం ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్సు ఫీజులు, నిర్మాణాలు నుంచి మాత్రమే నిధులు వస్తున్నాయి. పెద్ద గ్రామ పంచాయతీలకు స్థానికంగా వచ్చే పన్నులతో కొద్దిగా వెసులుబాటు కలుగుతున్నా... చిన్న పంచాయతీల పరిస్థితి దారుణంగా మారింది. పంచాయతీ కార్యదర్శులు తమ సొంత డబ్బులు వెచ్చించి రోజువారీ పనులు చేపడుతున్నారు.

పల్లెలకు ప్రధాన వనరులైన నిధులను ప్రభుత్వం గత ఆరు నెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. పైసల్లేక చిన్న మరమ్మతులు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో 469 పంచాయతీలు ఉండగా సగానికి పైగా పంచాయతీల్లో సిబ్బందికి గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. నిధుల లేమితో ప్రత్యేక అధికారులు పనులు చేసేందుకు జంకుతున్నారు. పల్లెల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 15వ ఆర్థిక సంఘం ద్వారా భారీగా నిధులు మంజూరు చేస్తోంది. వీటికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గత కొన్ని నెలలుగా నిధులు రావడంలేదు. జిల్లాకు ప్రతి నెలా రూ.6.75 కోట్లు మంజూరవుతాయి. కొన్ని పెద్ద పంచాయతీల్లో పన్నులను వినియోగించుకుంటున్నారు. కనీస ఆదాయం కరువైన చిన్న పంచాయతీల్లో సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 30 శాతం సిబ్బంది, కార్మికుల వేతనాలకు, వీధిదీపాలకు 15 శాతం, తాగునీటి సరఫరాకు 15 శాతం, పారిశుద్ధ్యానికి మరో 15 శాతం, అభివృద్ధి పనులు, కార్యాలయం ఖర్చుల కోసం 25 శాతం మేరకు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదనంగా ట్రాక్టర్ల నిర్వహణ, మరమ్మతులు, రుణాల కిస్తుల చెల్లింపులు, విద్యుత్తు బిల్లులు వంటి వాటికి నిధులు సరిపోక బకాయి పెడుతున్నారు. ప్రత్యేకాధికారులకు ఏం చేయాలో తోచక నామమాత్రంగా పనులు చేసి చేతులు దులుపుకొంటున్నారు. మరోవైపు జిల్లాలో 1,724 మంది కార్మికులు ఉన్నారు. వీరికి గత కొన్ని నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు.

వర్షాలు ప్రారంభమైతే మరిన్ని చిక్కులు...

వర్షాకాలం ప్రారంభమైతే పల్లెల్లో మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. పారిశుద్ధ్యం లోపించడం, మురుగు నీరు పేరుకుపోవడం, తాగునీరు కలుషితం కావడం వంటి వాటితో పాటు దోమలు పెరిగి ప్రజలు విషజ్వరాల బారినపడే అవకాశం ఉంది. నిధుల కొరతతో పనులు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. వీధిదీపాల నిర్వహణ, రహదారులపై గుంతలు పూడ్చడం, మొక్కలకు నీటిని పట్టడం, తాగునీటి పైపులైన్ల మరమ్మతులు వంటి పనులు చేయడం లేదు. 


మూడు ఖాతాలు ఖాళీ...

గ్రామపంచాయతీల్లో మూడు రకాల ఖాతాలు ఉంటాయి. ఒకటి ఆస్తి పన్నులు జమ చేసుకునే ఖాతా. గ్రామాల్లో ఆస్తిపన్ను వసూలు అంతంత మాత్రంగా జరగడం, ఖర్చు నాలుగింతలు ఉండటంతో ఇవి ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి.  రెండోది ఎస్‌ఎఫ్‌సీ (స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) ఖాతా. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లు వంటివి జమచేస్తారు. ఈ రెండు ఖాతాల్లో జమయ్యే మొత్తం ట్రెజరీ ద్వారా డ్రా చేయాల్సి ఉంటుంది. మూడోది 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించినది. కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు గ్రామ జనాభా ఆధారంగా నిధులు అందజేస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఓ సారి వీటిని అందజేస్తారు. ఈ నిధులు మాత్రమే పంచాయతీలకు అందుతుండగా వాటిని ప్రత్యేక సూచనల మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు రెండేళ్లుగా అందడం లేదు. నిబంధనల మేరకు ఖర్చు చేయని నిధులు ఆయా ఖాతాల్లో మిగిలి పోగా మార్చిలో వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.


సకాలంలో వేతనాలు ఇవ్వాలి...

- సుండు స్వామి, పారిశుద్ధ్య కార్మికుడు, రూప్లా తండా, శివ్వంపేట

మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. గ్రామ పంచాయతీలో నిధులు లేవని కార్యదర్శి చెబుతున్నారు. నిధులు రాగానే వేతనం ఖాతాలో వేస్తామంటున్నారు. నిత్యావసరాలకు రూ.15వేలు అప్పు చేశాను. ప్రతి నెలా రూ.9,500 వేతనం సకాలంలో ఇచ్చి ఆర్థిక ఇబ్బందులు తీర్చాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని