logo

పంటల బీమా..రైతుకు ధీమా..

ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్‌లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Updated : 28 May 2024 04:25 IST

ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం
ఈ వానాకాలం నుంచే అమలు

వర్షానికి నేల వాలిన పంట (పాత చిత్రం)   

 న్యూస్‌టుడే-మెదక్‌: ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్‌లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన’లో చేరడం, ప్రీమియం చెల్లింపు, బీమా పరిహారం తదితర వాటితో పాటు, పొరుగు రాష్ట్రాల్లో పంటల బీమా పథకం ఎలా అమలవుతున్నాయనే దానిపై అధ్యయనం చేస్తోంది. గతంలో అమలు చేసిన పంటల బీమా పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95శాతం ప్రీమియాన్ని, మిగిలిన అయిదు శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించేవారు. పరిహారం పొందడంలో సమస్యలు ఉండటం, రైతులకు పెద్దగా ఉపయోగం లేదనే కారణంతో గత ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ఏటా పంట నష్టం .. జిల్లాలో 2.80 లక్షల మంది అన్నదాతలు పంటలు సాగు చేస్తున్నారు. రెండు సీజన్లలో వరి ప్రధాన పంటగా, ఖరీఫ్‌లో పత్తి, మొక్కజొన్న, కందులు, యాసంగిలో జొన్న పంటలు సాగు చేస్తున్నారు. ఏటా ఏదో రకంగా రైతులు పంటలను నష్టపోతున్నారు. గత యాసంగిలో జిల్లాలోని నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట తదితర మండలాల్లో 800 ఎకరాల్లో పంటలకు నష్టం ఏర్పడింది. గతంలో బ్యాంకు నుంచి రుణం పొందే రైతులకు పంట బీమా తప్పనిసరి చేశారు. రుణంతో సంబంధం లేకుండా పంటలను సాగు చేసే రైతులు మాత్రం బీమా చేయడమనేది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.  

పక్కాగా అమలు... కొత్తగా అమలు చేయనున్న పంటల బీమా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఇప్పటికే క్లస్టర్ల వారీగా వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న క్రాప్‌ బుకింగ్‌ను పరిగణనలోకి తీసుకోనున్నారు. చాలా మంది ఏఈవోలు పొలాలకు వెళ్లకుండా రైతులను అడిగి రాస్తుండటం, ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో పంటల నమోదుపై గొడవలు జరుగుతున్నాయి. దీంతో పంటల బీమాను పకడ్బందీగా అమలు చేయాలంటే బయోమెట్రిక్‌ తీసుకోవడంతో పాటు రైతుల నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌ నుంచి బీమా పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం... వరి పంటను గ్రామం యూనిట్‌గా, మొక్కజొన్న, జొన్న, కందుల పంటలను మండల యూనిట్‌గా వర్తింపజేయనున్నారు. పరిహారం విషయంలో రైతు యూనిట్, లేదంటే ఎకరానికి దీనిని వర్తింపజేస్తారా? అన్నది త్వరలోనే స్పష్టత రానుంది. పంటల బీమా పథకంపై ఇటీవల సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్‌ జిల్లాల వ్యవసాయశాఖ అధికారుల సమావేశం నిర్వహించారు. పంటల బీమాకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించడం, బీమా కంపెనీలను సంప్రదించటం, ప్రీమియాన్ని నిర్ధారించడం, ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రకృతి ప్రకోపం, అకాల వర్షాల వల్ల నష్టపోయే జిల్లాలోని రైతాంగానికి ఈ పంటల బీమా పథకం ధీమా ఇస్తుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.


అవగాహన కల్పిస్తాం - గోవింద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉంది. అవి అందాక జిల్లా, మండల స్థాయిలో అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి, రైతులకు అవగాహన కల్పించనున్నాం. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని