logo

వంతెనతో ప్రమాదాలకు అడ్డుకట్ట

జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ.. తుదిదశకు చేరుకున్నాయి.

Updated : 28 May 2024 04:10 IST

జప్తిశివునూర్‌ వద్ద రూ.29 కోట్లతో పనులు

 నిర్మిస్తున్న ఉపరితల వంతెన  

న్యూస్‌టుడే, నార్సింగి (చేగుంట): జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ.. తుదిదశకు చేరుకున్నాయి. నార్సింగి మండలం జప్తిశివునూర్‌ వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతుండేవి. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి గ్రామంలోకి వెళ్తుంటే నిజామాబాద్‌ వైపు నుంచి వాహనాలు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది క్షతగాత్రులయ్యారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ రహదారి దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా వెళ్లినా ప్రమాదాలు జరుగుతాయి. వీటిని నివారించేందుకు ఉపరితల వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.

ఆరు వరుసల రహదారి 

జప్తిశివునూర్‌ వద్ద జాతీయ రహదారిపై ఉపరితల వంతెనను రూ.29 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇక్కడ వంతెన మంజూరు చేయాలని ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే, అప్పటి మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సర్వే నిర్వహించి వంతెన మంజూరు చేశారు. టెండర్లు పూర్తి చేసిన అనంతరం జప్తిశివునూర్‌ వద్ద సుమారు ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభించారు. మొదట ఇరువైపుల సర్వీసు రోడ్లను నిర్మించారు. అనంతరం వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామంలోకి వెళ్లే చోట వంతెన పనులు పూర్తిచేశారు. దానికి ఇరువైపు సిమెంట్‌ దిమ్మెలతో గోడల నిర్మాణం దాదాపు పూర్తి చేశారు. ఒకవైపు కంకర కూడా వేశారు. మరోవైపు మట్టి పనులు చేస్తున్నారు.  మరో ఆరు నెలల్లో పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆరు వరుసల రహదారి నిర్మాణం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.

ఉమ్మడి మండలంలో రెండు చోట్ల

ఉమ్మడి చేగుంట మండలంలో 44వ జాతీయ రహదారిపై రెండు చోట్ల వంతెనలను మంజూరు చేశారు. వంతెన నిర్మాణానికి రూ.19 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడ వంతెన నిర్మాణం పూర్తిచేసి ప్రమాదాలు జరగకుండా చేశారు. అలాగే జప్తిశివునూర్‌ వద్ద కూడా నిర్మాణ పనులు చేపట్టి తుదిదశకు తీసుకొచ్చారు. చేగుంట వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండేవి.  2006 నుంచి సుమారు వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వంతెన పూర్తికావటంతో ప్రమాదాలు జరగటం లేదు. అలాగే జప్తిశివునూర్‌ వద్ద కూడా ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని