logo

‘హెటిరో ల్యాబ్స్‌’లో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని హెటిరో ల్యాబ్స్‌ పరిశ్రమలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Published : 28 May 2024 01:17 IST

జిన్నారం, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని హెటిరో ల్యాబ్స్‌ పరిశ్రమలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈటీపీ బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ అలుముకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని పరిశ్రమ సీనియర్‌ మేనేజర్‌ రవిబాబు ప్రకటించారు. విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు రావొచ్చని పేర్కొన్నారు. పరిశ్రమకు చెందిన రెండు అగ్నిమాపక శకటాలు, పటాన్‌చెరు, జీడిమెట్ల నుంచి మరో రెండు వాహనాలను రప్పించి ఆర్పేశారు. సాల్వెంట్‌ ట్యాంకులపై మూతలు లేవటంతో రసాయనాలు పైకిలేసి ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఉంటాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


భూవివాదంలో మారణాయుధాలతో దాడి
ఒకరి మృతి... మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

నారాయణఖేడ్, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ పురపాలిక పరిధిలోని చాంద్‌ఖాన్‌పల్లిలో భూవివాదం ఒకరి ఉసురు తీసింది. నారాయణఖేడ్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. చాంద్‌ఖాన్‌పల్లికి చెందిన అంకం లక్ష్మయ్య, మల్లయ్య, పక్కనేగల స్కూల్‌తండాకు చెందిన దేవీసింగ్‌ల భూములు పక్కపక్కనే ఉన్నాయి. కొన్నేళ్లుగా సరిహద్దుల వివాదాలు ఉండగా... కోర్టులో సివిల్‌ కేసు నడుస్తోంది. మూడు నెలల కిందట వివాదంలో ఉన్న భూముల్లో మల్లయ్య, దేవీసింగ్‌ కుటుంబీకులు చెట్లు నరికారు. దీనిపై లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చెట్ల మొదళ్లు, కొమ్మలు అక్కడే వదిలేశారు. సోమవారం ఉదయం వాటిని తీసుకెళ్లేందుకు మల్లయ్య, దేవీసింగ్‌లు కుటుంబీకులతో వచ్చారు. విషయం తెలుసుకుని అంకం లక్ష్మయ్య, ఆయన సోదరుడు అంకం రాములు, లక్ష్మయ్య కుమారుడు అశోక్‌ అక్కడకు చేరారు. మల్లయ్య, అతడి సోదరుడు జ్ఞానేశ్వర్‌తోపాటు ఆయన కుమారులు, దేవీసింగ్‌తోపాటు అతడి కుమారులు గొడ్డళ్లు, కత్తులు, కర్రలతో ఒక్కసారిగా వీరిపై దాడికి పాల్పడటంతో అంకం రాములు, అంకం లక్ష్మయ్య, అంకం అశోక్‌(40)లు గాయపడ్డారు. వారిని నారాయణఖేడ్‌ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అశోక్‌ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రాములును మెరుగైన వైద్యం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మయ్య ఖేడ్‌ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వెంకట్రెడ్డి, ఖేడ్, కంగ్టి సీఐలు, ఎస్సైలు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

పోలీసుల నిర్లక్ష్యమే కారణం: వివాదంలో ఉన్న భూమిపై కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా నిందితులు పట్టించుకోకుండా చెట్లు నరుకుతున్నారని గతంలో నాలుగుసార్లు ఖేడ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసినా ఎస్సై విద్యాచరణ్‌రెడ్డి పట్టించుకోలేదని మృతుడి తండ్రి అంకం లక్ష్మయ్య ఆరోపించారు. కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నందున ఆ భూమిలోకి ఎవ్వరూ వెళ్లవద్దని నిందితులకు పోలీసులు చెబితే ఇంత దారుణం జరిగేది కాదన్నాడు. తన కుమారుడి మృతికి ఎస్సై నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించాడు. దీనిపై ‘న్యూస్‌టుడే’ ఎస్సై వివరణ కోరగా... ఆయన కోర్టు ఆర్డర్‌ ప్రకారం ఆ స్థలంలోకి వెళ్లవద్దని ఇరు వర్గాలకు చెప్పినట్లు తెలిపారు. సీఐ శీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయంపై తీసుకున్న చర్యలతోపాటు తాజా ఘటనపై విచారణ చేయిస్తామని పేర్కొన్నారు.


సూపర్‌ మార్కెట్లో రూ.5.53 లక్షల చోరీ

నంగునూరు, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా నంగునూరులో ఆదివారం అర్ధరాత్రి సూపర్‌మార్కెట్‌లో చోరీ జరిగింది. దుండుగులు రూ.5.53 లక్షలు ఎత్తుకెళ్లారు. రాజగోపాలపేట ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. అక్కెనపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చామంతుల నరేశ్‌ నంగునూరులోని ఓ రేకుల షెడ్డును ఏడాదిన్నర క్రితం లీజుకు తీసుకొని పూర్ణ అనే సూపర్‌ మార్కెట్‌  నడుపుతున్నారు. సూపర్‌వైజర్‌ మహేందర్‌ ఆదివారం రాత్రి 8:45 గంటలకు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి బీరువాలో దాచిన రూ.5.53 లక్షల నగదు కనిపించలేదు. పరిశీలించగా సూపర్‌ మార్కెట్‌ వెనక భాగం రేకులను తొలగించి దుండగులు లోపలికి వచ్చినట్లు తెలిసింది. ఏసీపీ మధు, సీఐ శ్రీను వచ్చి చూశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని