logo

బడిగంటలు మోగే వేళ.. బస్సులు సిద్ధమేనా?

సకల సౌకర్యాలు ఉన్న బడిలో పిల్లలను చేర్పిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు ఆలోచన చేస్తుంటారు. విద్యాభ్యాసం, ఆటాపాటలతో సహా బడిలో విద్యార్థులకు మౌలిక వసతులు ఉండాలని కోరుకుంటారు.

Published : 28 May 2024 01:24 IST

పిల్లల భద్రత అత్యంత కీలకం

సామర్థ్య పరీక్షలు తప్పనిసరి

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్, వికారాబాద్‌ టౌన్‌: సకల సౌకర్యాలు ఉన్న బడిలో పిల్లలను చేర్పిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు ఆలోచన చేస్తుంటారు. విద్యాభ్యాసం, ఆటాపాటలతో సహా బడిలో విద్యార్థులకు మౌలిక వసతులు ఉండాలని కోరుకుంటారు. ప్రైవేటు పాఠశాలలు ఎంత దూరం ఉన్నా తమ పిల్లలను పంపించడానికి కారణం బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమే. ఆ బస్సులను ప్రతి ఏడాది రవాణా అధికారి కార్యాలయంలో (ఆర్‌టీఏ) తనిఖీ చేయించుకొని వాహన సామర్థ్య ధ్రువపత్రాన్ని పొందాల్సి ఉంటుంది. లేకపోతే బస్సును రోడ్లపై నడపకూడదు. బస్సు సామర్థ్యం ప్రమాణాలపరంగా సరిగా లేకపోతే ప్రయాణంలో ప్రమాదాలు జరుగుతాయి.

అనుమతి ఉంటేనే..: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సంగారెడ్డి (కంది), పటాన్‌చెరు, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట, చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్‌లలో ఆర్‌టీఏ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వాటి పరిధిలో మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు), సహాయ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎఎంవీఐ)లు బస్సులకు పరీక్షలు నిర్వహిస్తారు. అనుమతులు లేని వాటికి జరిమానాలు, కేసులు నమోదులు చేస్తుంటారు. వాహనాలకు సంబంధించిన అన్నిరకాల పత్రాలు ఉన్నాయా? లేవా.. నిశితంగా పరిశీలిస్తారు. బడి బస్సులకు సామర్థ్య పరీక్షలపై ఆయా యాజమాన్యాలు దృష్టి సారించాల్సి ఉంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 2,384 బస్సులు ఉన్నాయి. ఇంకా 1,920 బస్సులకు (ఈ నెల 24 వరకు) అనుమతులు తీసుకోవాల్సి ఉంది.

12వ తేదీ గడువు

పాఠశాలలు ప్రారంభానికి ముందే బస్సుల డ్రైవర్లు, బస్సుల నిర్వహణపై దృష్టి సారిస్తే పిల్లలకు భద్రత చేకూరుతుంది. ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇప్పటికే ఆర్టీఏ కార్యాలయంలో బస్సుల తనిఖీ, ధ్రువపత్రాల జారీ మొదలైంది. వచ్చేనెల 12వ తేదీ వరకు పరీక్షలు చేయించుకోవాలని ఆర్‌టీఏ విభాగం సూచిస్తోంది. గడువులోపు ఏటా పరీక్షలు చేసుకోకుండానే కొన్ని పాఠశాలల నిర్వాహకులు అధికారుల కళ్లు గప్పి బస్సులు తిప్పుతున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆర్టీఏ అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.

నిబంధనలు

  • ఆర్‌టీఏ అధికారులు జారీ చేసిన సామర్థ్య పరీక్ష పత్రాలను బస్సులో ప్రదర్శించాలి.
  • ప్రతి బడి బస్సుకు పసుపు రంగు తప్పనిసరి.
  • 15 ఏళ్లు దాటిన వాహనాలను తిప్పరాదు.
  • బస్సు బ్రేకులు, టైర్లు, అద్దాలు, లైట్లు, వైపర్లు   బాగుండాలి.
  • యాజమాన్యం వివరాలు, పిల్లల వివరాలు నమోదు చేయాలి.
  • వాహనంలో ప్రథమ చికిత్స కిట్లు, మందులు, పరికరాలు ఉంచాలి..
  • అగ్ని ప్రమాదాన్ని నివారించే టియర్‌ గ్యాస్‌ సిలిండర్లు తప్పనిసరి.
  • డ్రైవర్‌ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.
  • డ్రైవర్లు దురుసుగా ప్రవర్తించొద్దు.
  • ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించే డ్రైవర్‌పై ఫిర్యాదు చేయాలి.
  • బస్సు సామర్థ్యాన్ని మించి విద్యార్థులను ఎక్కించుకోవద్దు.
  •  డ్రైవర్లకు కళ్లు, ఇతర ఆరోగ్య పరీక్షలు చేపట్టాలి.
  •  మద్యం తాగి వాహనం నడపొద్దు. లైసెన్సు రద్దవుతుంది.

     యాజమాన్యాలు ముందుకు రావాలి 

- వెంకటరమణ, ఉమ్మడి మెదక్‌ జిల్లా ఆర్‌టీఏ అధికారి, సంగారెడ్డి

బస్సులకు ఆర్‌టీఏ శాఖ నుంచి అనుమతులు కచ్చితంగా ఉండాల్సిందే. నిబంధనలు పాటించకపోతే క్రిమినల్‌ కేసులు తప్పవు. ఇప్పటికే టీజీ స్కూల్‌ బస్సు ప్రత్యేక యాప్‌లో పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాం. యాప్‌లో బస్సు నంబర్‌ ఎంటర్‌ చేస్తే చాలు. బస్సు యాజమాని, డ్రైవర్‌ ఫొటో, సహాయకుడి వివరాలు ఫోన్‌ నంబర్లు కనిపిస్తాయి. సామర్థ్య పరీక్షలు చేసుకోకుండా పిల్లలతో ప్రయాణించడం చట్టరీత్యా నేరం.


 పునఃప్రారంభంలోగా పూర్తి చేస్తాం 
- వెంకట్‌రెడ్డి, వికారాబాద్‌ జిల్లా రవాణా శాఖ అధికారి

జూన్‌ 12లోగా పాఠశాలలు ప్రారంభం అవుతాయి. అంతకంటే ముందుగానే అన్నిటికీ వాహన సామర్థ్య పరీక్షలు చేసుకునేలా చూస్తాం. విద్యార్థుల భధ్రత అత్యంత ముఖ్యమైంది. ఫిట్‌నెస్‌ చేయించుకున్న బస్సులనే రోడ్డుపై తిరిగేందుకు అనుమతిస్తాం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని