logo

నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక నజర్‌

నైరుతి రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు సేకరించుకుంటున్నారు.

Updated : 28 May 2024 04:08 IST

దుకాణాల్లోతనిఖీలు.. 
గ్రామాల్లోఅవగాహనసదస్సులు

న్యాల్‌కల్‌లో అధికారుల తనిఖీలు 

న్యూస్‌టుడే, ఇస్మాయిల్‌ఖాన్‌పేట (సంగారెడ్డి అర్బన్‌), మనూరు,ఇంద్రకరణ్‌(కంది), జోగిపేట: నైరుతి రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు సేకరించుకుంటున్నారు. ఇదే అదనుగా దళారులు, కొందరు వ్యాపారులు కర్షకులకు నకిలీ విత్తనాలు అంటగట్టే ప్రమాదం ఉంది.  గతేడాది ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయశాఖ అప్రమత్తమయింది. అన్ని విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు.. పల్లెల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు సదస్సులు  కొనసాగడంతో పాటు.. దుకాణాల్లో తనిఖీలను విస్తృతం చేయనున్నారు. 

సాగు అంచనా 7.24 లక్షల ఎకరాలు

జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి ఈ ఏడాది వానాకాలంలో 7,24,405 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. ఇందులో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి వేయనున్నారని, 7.20 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమని ప్రకటించారు. ప్రస్తుతం 1,33,665 పత్తి విత్తన ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి రోజు వారీగా జిల్లాకు వస్తున్నాయని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 1.50 లక్షల ఎకరాల్లో వరి పంట వేయనున్నారు. 33,956 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. పెసర, మినుములు, కందులు తదితర పంటలకు అంచనాల మేరకు పీఏసీˆఎస్, డీసీఎంఎస్, ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.

క్షేత్రస్థాయికి వెళుతూ..

జిల్లాలో సంగారెడ్డి, పటాన్‌చెరు, రాయికోడ్, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్‌ వ్యవసాయ శాఖ డివిజన్‌ కార్యాలయాలున్నాయి. వాటి పరిధిలో 510 ఎరువులు, విత్తనాల దుకాణాలున్నాయి. వ్యవసాయ అధికారులు డీలర్లకు, రైతులకు ఊరూరా సదస్సులు నిర్వహించి అప్రమత్తం చేస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 

రైతులు పాటించాల్సినవి

లైసెన్సు ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తన ప్యాకెట్లు బస్తాలపై లాట్‌ నంబర్, కంపెనీ పేరు, ప్యాకింగ్‌ తేదీ, లేబుల్‌ వివరాలు ఉంటేనే కొనుగోలు చేయాలి. డీలరు ఇచ్చిన కొనుగోలు రసీదును భద్రపర్చుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా విడిగా విక్రయించే విత్తనాలు కొనుగోలు చేయవద్దు. దళారుల మాటలు నమ్మవద్దు. సందేహముంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. నకిలీవి విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే వ్యవసాయ అధికారులు లేదంటే.. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వ్యాపారులు తప్పనిసరిగా విత్తన నిల్వలు, విక్రయాల వివరాలను దుకాణం వద్ద బోర్డుపై ప్రదర్శించాలి. 


అప్రమత్తంగా ఉన్నాం..: నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. రైతులు విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. నకిలీ విత్తనాల కట్టడికి ఇప్పటికే వ్యవసాయశాఖ అప్రమత్తమయింది. తనిఖీలు పెంచడంతో పాటు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నాం. రైతులు దళారుల మాటలు నమ్మవద్దు. సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని