logo

శాఖల మధ్య పచ్చటి చిచ్చు !

బల్దియా, విద్యుత్తు శాఖల మధ్య వైరం హరితానికి చేటుగా మారింది. పట్టణంలో ఇటీవలి కాలంలో కరెంటు సరఫరాకు అంతరాయంగా మారాయనే ఉద్దేశంతో 400 హరితహారం చెట్లను విద్యుత్తు శాఖ సిబ్బంది తొలగించారు.

Updated : 28 May 2024 04:07 IST

సమన్వయ లోపం హరితానికి శాపం

సిద్దిపేటలో చెట్ల కొమ్మల తొలగింపు  
న్యూస్‌టుడే, సిద్దిపేట: బల్దియా, విద్యుత్తు శాఖల మధ్య వైరం హరితానికి చేటుగా మారింది. పట్టణంలో ఇటీవలి కాలంలో కరెంటు సరఫరాకు అంతరాయంగా మారాయనే ఉద్దేశంతో 400 హరితహారం చెట్లను విద్యుత్తు శాఖ సిబ్బంది తొలగించారు. దీనిపై స్పందించిన బల్దియా.. రూ.24 లక్షలు పరిహారం చెల్లించాల్సిందిగా ఈ నెల 23న నోటీసులు జారీ చేశారు. 400 మొక్కలు నాటాలంటూ పేర్కొన్నారు. ఈ పరిణామాలు పట్టణంలో చర్చనీయాంశంగా మారగా ఉన్నతాధికారుల వరకు చేరింది. 
సిద్దిపేటలో 43 వార్డులు ఉన్నాయి. జనాభా 1.57 లక్షలు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు చొరవతో పట్టణంలో పెద్దమొత్తంలో మొక్కలు పెంచుతున్నారు. ఏళ్లుగా ఈ హరిత ఉద్యమం సాగుతోంది. మెదక్, హైదరాబాద్, కరీంనగర్‌ మార్గాల్లో రహదారులకు ఇరువైపులా, విభాగినుల మధ్య స్వాగతం పలుకుతున్నట్లుగా పచ్చదనం పెంపొందిస్తున్నారు. పట్టణంలో 18 లక్షల మొక్కలు, చెట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు నర్సరీలు నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆహ్లాదం పంచుతూ సాంత్వన చేకూర్చుతున్నాయి. బల్దియా ఆధ్వర్యంలో సంరక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. 

 రూ.8 లక్షల జరిమానా

పట్టణంలో వివిధ సందర్భాల్లో కొమ్మలు తొలగించినా జరిమానా విధిస్తున్నారు. అలా ఇప్పటి వరకు రూ.8 లక్షలకు పైగా జరిమానా విధించారు. నలుగురిపై ఠాణాలో కేసులు నమోదయ్యాయి. సంరక్షణ, పెంపకంలో భాగంగా ఏటా దాదాపు రూ.5 కోట్ల వరకు హరితనిధిని బడ్జెట్‌లో కేటాయిస్తున్నారు. 30 మంది సిబ్బంది భాగస్వాములవుతున్నారు. ఈ క్రమంలో హరితానికి ఎక్కడ విఘాతం కలిగించినా తక్షణ, కఠిన చర్యలకు వెనకాడటం లేదు. 

ఉన్నతాధికారుల చొరవ అవశ్యం.. 

విద్యుత్తు, మున్సిపల్‌ శాఖల మధ్య వైరానికి దారి తీస్తున్న తరుణంలో సమస్య పునరావృతం కాకుండా రెండు విభాగాల అధికారులు జాగ్రత్తలు వహించాల్సి ఉంది. భారీగా పెరిగే చెట్ల స్థానంలో తక్కువ పొడవు కలిగిన మొక్కలు నాటితే సత్ఫలితాలు రానున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఈ తరుణంలో అలాంటి మొక్కలు నాటడం ద్వారా సమస్యకు అడ్డుకట్ట వేయొచ్చు. ఒకవేళ విద్యుత్తు సరఫరాకు చెట్లు అడ్డుగా మారితే అవసరం మేర తొలగిస్తే మేలు. 

అధికారులు ఏమంటున్నారంటే.. 

బల్దియా కమిషనర్‌ ప్రసన్నరాణిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని, చెట్ల నరికివేత రోజు అధికారులకు ఫోన్‌ చేసినా స్పందన రాలేదన్నారు. తాజాగా గాలిదుమారం కారణంగా చెట్లు నేలకొరిగినా సరైన స్పందన లేదన్నారు. రానున్న రోజుల్లో కోనోకార్పస్‌ చెట్ల స్థానంలో తక్కువ పొడవు పెరిగే చెట్లను దశల వారీగా ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్తు శాఖ ఎస్‌ఈ మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. తమ శాఖకు నోటీసులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలోనే చెట్లను తొలగించాల్సి వచ్చిందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు