logo

రుణం.. అ‘ద్వితీయం

స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ‘కొత్త వ్యాపారాల’ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మహిళల ఆసక్తికి అనుగుణంగా రుణాలను అందజేస్తోంది.

Updated : 21 Mar 2023 06:19 IST

రాష్ట్రంలో జిల్లా మెరుగైన పని తీరు

దుకాణాన్ని పరిశీలిస్తున్న సెర్ప్‌ అధికారులు

న్యూస్‌టుడే-మెదక్‌: స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ‘కొత్త వ్యాపారాల’ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మహిళల ఆసక్తికి అనుగుణంగా రుణాలను అందజేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం కంటే ఎక్కువ మందికి ఇచ్చి, ‘మెతుకుసీమ’ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయ స్థానంలో నిలిచింది.

జిల్లాలోని 21 మండలాల్లో 13,308 స్వయం సహాయక సంఘాలు, 1.13 లక్షల మంది సభ్యులున్నారు. వీరిలో అర్హత ఉన్న సంఘాలకు బ్యాంకు లింకేజీ లేదా స్త్రీనిధి ద్వారా రుణాలను అందజేస్తున్నారు. అయితే వ్యాపార నిర్వహణకు వీటి వినియోగం తక్కువగా ఉంది. ఈ విషయాన్ని సెర్ప్‌ అధికారులు గుర్తించారు. దీనిని అధిగమించేందుకు గత ఆర్థిక సంవత్సరంలో ‘కొత్త వ్యాపారాలు’(న్యూ ఎంటర్‌ప్రైజెస్‌) పేరిట కార్యక్రమం చేపట్టింది. సంఘాల నుంచి ఎంపిక చేసిన సభ్యులను ముందుగా వారు చేసే వ్యాపారం గురించి వివరాలు సేకరించి, వారికి రుణం అందజేస్తున్నారు. 2021-22లో జిల్లాలోని ఇరవై మండలాల్లో 2,624 మందికి రూ.26.24 కోట్లు ఇచ్చారు.

ఈ ఏడాదిలో..

ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో 2022-23లోనూ మరింత మందికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

ఈ సారి 3,958 మందికి రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యమైనా, 3,961 మందికి రూ.58.20 కోట్లు పంపిణీ చేశారు.

ఇది గతేడాది కంటే రూ.31.96 కోట్లు అదనం. ఇందులో సామాజిక పెట్టుబడి ద్వారా 2,053 యూనిట్లకు రూ.27.37 కోట్లు, బ్యాంకు లింకేజీ ద్వారా 1,901 యూనిట్లకు రూ.30.82 కోట్లు, స్త్రీనిధి ద్వారా ఏడుగురికి రూ.8లక్షలు మంజూరయ్యాయి.  కొత్త వ్యాపారాలకు రుణాలివ్వడంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవగా, మెదక్‌ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. మహిళలు తమకు అవసరం ఉన్న మేరకు రుణాలు పొందారు. రూ.75 వేల నుంచి అత్యధికంగా రూ.8 లక్షల వరకు అందజేశారు. పాపన్నపేట మండలంలో అత్యధికంగా 282, ఉమ్మడి చేగుంట మండలంలో 274 యూనిట్లు ఇవ్వగా, అత్యల్పంగా చిలప్‌చెడ్‌ మండలంలో 111 యూనిట్లకు రుణాలిచ్చారు. వీరంతా ట్రేడింగ్‌, ఉత్పత్తి, సేవల రంగాల్లో దుకాణాలను ఏర్పాటు చేశారు.


సొంతంగా ఏర్పాటు
- కవిత, పెద్దచింతకుంట, నర్సాపూర్‌

గతంలో పౌల్ట్రీఫాం లీజుకు తీసుకొని ఐదేళ్ల పాటు నిర్వహించా. నెలకు వచ్చే ఆదాయంలో లీజుదారుకు, ఖర్చులు పోను కొంత డబ్బు మిగిలేది. వ్యాపార నిర్వహణకు రుణం అందిస్తున్నారని తెలియడంతో రూ.4 లక్షలు తీసుకుని సొంతంగా ఏర్పాటు చేశా. ప్రస్తుతం వచ్చే ఆదాయంలో కొంత రుణం చెల్లించి, మిగిలినది కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నా.


అప్పు పోను కుటుంబ అవసరాలకు
- అంజమ్మ, రాజ్‌పల్లి, మెదక్‌ మండలం

మాది వడ్రంగి వృత్తి కావడంతో నా భర్త ద్వారా సొంతంగా దుకాణం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. స్త్రీనిధి ద్వారా రూ.3 లక్షల రుణం తీసుకున్నా. కంప్యూటర్‌తో తలుపులపై డిజైన్లు వేసే కొత్త యంత్రాలను కొనుగోలు చేశాం. ప్రస్తుతం నలుగురు ఉపాధి పొందుతున్నారు. నెలకు రూ.40వేల వరకు ఆదాయం లభిస్తోంది. రుణ చెల్లింపు, మిగతా ఖర్చులు పోను నెలకు రూ.20 వేలు మిగులుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని