logo

Harish Rao: ఈ జన్మంతా మీకే అంకితం..

‘ఈ జన్మంతా మీకే (సిద్దిపేట) అంకితం.. నేను ఎంత చేసినా తక్కువే. మీరు చూపిన ప్రేమ ఆదరాభిమానాలు వెలకట్టలేనివి. సిద్దిపేట ప్రజలంతా నా కుటుంబ సభ్యులు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, తల్లిదండ్రులుగా భావించి సేవ చేశా..’ అని మంత్రి, సిద్దిపేట భారాస అభ్యర్థి హరీశ్‌రావు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

Updated : 29 Nov 2023 10:33 IST

మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: ‘ఈ జన్మంతా మీకే (సిద్దిపేట) అంకితం.. నేను ఎంత చేసినా తక్కువే. మీరు చూపిన ప్రేమ ఆదరాభిమానాలు వెలకట్టలేనివి. సిద్దిపేట ప్రజలంతా నా కుటుంబ సభ్యులు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, తల్లిదండ్రులుగా భావించి సేవ చేశా..’ అని మంత్రి, సిద్దిపేట భారాస అభ్యర్థి హరీశ్‌రావు(Harish Rao) భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన ప్రచారం నిర్వహించారు. స్థానిక వేములవాడ కమాన్‌ నుంచి బస్టాండ్‌ వరకు ప్రధాన వీధుల మీదుగా రోడ్‌షో సాగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు గులాబీ పూల వర్షం కురిపించారు. భారీ గజమాలతో స్వాగతం పలికారు. రోడ్‌షో ముగింపు సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొందరు నాయకులు ఎన్నికలున్నపుడే తిరుగుతారని, తాను నిత్యం ఎన్నికల మాదిరి ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేశానన్నారు. సిద్దిపేటనే నా కుటుంబమని మంత్రి పేర్కొన్నారు.  కార్యకర్తలే ఒక్కో హరీశ్‌రావు లాగా పని చేశారని, వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.  


మోసపోవద్దు..

చేగుంట: దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లు భాజపాకు ఓట్లు వేసి మోసపోయి ఇప్పుడు గోసపడుతున్నారని, మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు సూచించారు. మంగళవారం వడియారం నుంచి చేగుంట వరకు నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు ఎన్నో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి తన తండ్రి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో కూడా భారాస ప్రభుత్వం వస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని