logo

పథకం బాగు.. పనుల్లో జాగు

బడులు బాగు చేసేందుకు గత సర్కారు నడుం బిగించింది. కార్పొరేట్‌ హంగులు అద్దాలనుకుంది. గతేడాది జిల్లాలో ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాత భవనాలను గుర్తించి అక్కడ కొత్తవి కట్టాలని సంకల్పించింది.

Published : 07 Dec 2023 00:51 IST

నత్తనడకన ‘మన ఊరు..మన బడి’ కార్యక్రమం
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

కోహీర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల   ఆవరణలో పునాది స్థాయిలో నిర్మాణం

న్యూస్‌టుడే- సంగారెడ్డి అర్బన్‌, కోహీర్‌ : బడులు బాగు చేసేందుకు గత సర్కారు నడుం బిగించింది. కార్పొరేట్‌ హంగులు అద్దాలనుకుంది. గతేడాది జిల్లాలో ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాత భవనాలను గుర్తించి అక్కడ కొత్తవి కట్టాలని సంకల్పించింది. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గుత్తేదారులు, ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. పనులు పూర్తి  కాకపోవడంతో అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో చదువుకుంటున్నారు.

ముందుకు రాని గుత్తేదారులు

జిల్లాలోని అమీన్‌పూర్‌, అందోల్‌, పుల్కల్‌, చౌటకూర్‌, కల్హేర్‌, కంగ్టి, మునిపల్లి, నాగల్‌గిద్ద, నారాయణఖేడ్‌, హత్నూర, మొగుడంపల్లి, పటాన్‌చెరు, రామచంద్రాపురం, జహీరాబాద్‌, గుమ్మడిదల, మనూర్‌, సదాశివపేట, సంగారెడ్డి, సిర్గాపూర్‌, వట్‌పల్లి మండలాల్లోని ప్రభుత్వ బడులను మన ఊరు.. మన బడి కార్యక్రమంలో ఎంపిక చేశారు. పనులు చేసేందుకు గతేదాడి నుంచి టెండర్లు పిలిచినా గుత్తేదారులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. రూ.30 లక్షల పైచిలుకు పనులను టెండర్లు పాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

పనుల్లో వేగం పెంచుతాం..: జగదీశ్వర్‌, పీఆర్‌ ఈఈ, సంగారెడ్డి

జిల్లాలో మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా పనులు వేగంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. త్వరలో పీఆర్‌ శాఖ అధికారులు, గుత్తేదారులతో సమావేశం నిర్వహిస్తాం. పనులు నాణ్యంగా చేసేలా చర్యలు తీసుకుంటాం.

క్షేత్ర స్థాయిలో ఇలా..

  • కోహీర్‌ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో భవన నిర్మాణానికి రూ.14.47 లక్షలు మంజూరు చేశారు. గుత్తేదారులు, పీఆర్‌ ఏఈల మధ్య సమన్వయ లోపంతో పనులు పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయాయి. గదుల కొరత కారణంగా రెండు విడతలుగా తరగతులు నిర్వహించాల్సి వస్తోంది.
  • అందోలు ప్రాథమికోన్నత పాఠశాలలో పనులే ప్రారంభం కాలేదు. పాఠశాల ఆవరణలో గదుల మరమ్మతులు, ప్రహరీ, కరెంటు పనులు, కిచెన్‌ షెడ్‌, మూత్రశాలల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం రూ.63 లక్షలు మంజూరు చేసింది. అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచారు. గుత్తేదారులెవరూ పాల్గొనలేదు.
  • సదాశివపేట మండలంలోని నందికంది, పెద్దాపూర్‌, కోనాపూర్‌, సదాశివపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలకు రూ.30.లక్షలకుపైగా నిధులు మంజూరైనా పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు.
  • సంగారెడ్డి మండలంలో రూ.30 లక్షల పనులకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో రెండు బడులకు మాత్రమే పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపారు. మిగిలిన వాటికి ముందుకు రావడం లేదు.
  • కంది మండలం ఇంద్రకరణ్‌, ఎద్దుమైలారం, ఓడీఎఫ్‌లో ప్రభుత్వ బడుల్లో పలు రకాల పనులు చేపట్టడానికి రూ.30 లక్షలకు ప్రతిపాదనలు పంపారు. పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. ఇంద్రకరణ్‌లో ప్రభుత్వ పాఠశాలకు రూ.20 లక్షలతో ప్రహరీ పనులు చేపట్టి మధ్యలోనే ఆపేశారు.

జిల్లాలో పనులు ఇలా..

  • జిల్లాలో మంజూరైన పనులు: 329
  • నిధుల అంచనా: రూ.129.17 కోట్లు
  • ఇప్పటి వరకు పూర్తయిన పనులు: 151
  • వివిధ దశల్లో ఉన్నవి: 139
  • టెండర్లు పిలవనివి: 36
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని