logo

పల్లె పోరుకు కసరత్తు

శాసన సభ ఎన్నికలు ముగిశాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తారా? అనే ప్రశ్నకు అధికారుల నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి.

Published : 07 Dec 2023 00:56 IST

సంగారెడ్డి జిల్లా కంది మండలం తోపుగొండ గ్రామం

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: శాసన సభ ఎన్నికలు ముగిశాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తారా? అనే ప్రశ్నకు అధికారుల నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బందిని గుర్తించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు సైతం వచ్చాయి.

మార్గదర్శకాలు

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారుల నియామకానికి మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. ఒక్కో పంచాయతీకి ఒకరు చొప్పున స్టేజ్‌-1 అధికారి ఉంటారు. వీరు నామినేషన్ల స్వీకరణ నుంచి గుర్తులు కేటాయించే వరకు పనులు చూసుకుంటారు. స్టేజ్‌-2 అధికారులు పోలింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తారు. పోలింగ్‌ కేంద్రంలో 200 మంది వరకు ఓటర్లు ఉంటే ప్రిసైడింగ్‌ అధికారితోపాటు పోలింగ్‌ అధికారి ఉంటారు. 201-400 మంది ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్‌ అధికారితోపాటు ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 401-650 మంది ఓటర్లు ఉంటే ప్రిసైడింగ్‌ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్‌ అధికారులను నియమిస్తారు. 650 మందికంటే ఎక్కువ మంది ఓటర్లు ఉంటే అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ నెల 30లోగా ప్రక్రియను పూర్తిచేయనున్నారు.

పాత రిజర్వేషన్లేనా?

2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 1, 2024తో పాలకవర్గాల గడువు ముగియనుంది. గత ఎన్నికల సమయంలో కొత్త పంచాయతీ రాజ్‌ చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్‌ విధానం అమలులో ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పాత విధానాన్నే కొనసాగిస్తారా? మార్పులు ఏమైనా ఉంటాయా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని