logo

సైనికులారా జోహార్‌

కన్నవారికి.. ఉన్న ఊరికి దూరంగా ఉంటూ.. మాతృభూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. ప్రజల సంక్షేమం కోసం నిఘా నేత్రంతో విధులు నిర్వహిస్తారు. శత్రు సైన్యం భారత భూభాగంలో అడుగు పెట్టకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతారు.

Published : 07 Dec 2023 00:59 IST

సంక్షేమ నిధి.. విరాళం అందరి విధి
నేడు సాయుధ దళాల పతాక దినోత్సవం

మాజీ సైనికుల సమస్యలు తెలుసుకుంటున్న మద్రాసు రెజిమెంటల్‌ అధికారులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, : సంగారెడ్డి టౌన్‌: కన్నవారికి.. ఉన్న ఊరికి దూరంగా ఉంటూ.. మాతృభూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. ప్రజల సంక్షేమం కోసం నిఘా నేత్రంతో విధులు నిర్వహిస్తారు. శత్రు సైన్యం భారత భూభాగంలో అడుగు పెట్టకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతారు. దేశం కోసం ఇంత చేసిన వారికి చేయూత ఇవ్వడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి. యుద్ధ భూమి నుంచి తిరిగి వచ్చిన సైనికులకు, వితంతువులు, వారి కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. నేడు సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కథనం.

75 ఏళ్లుగా నిర్వహణ

మాజీ సైనికులు, వారి పిల్లల సంక్షేమానికి ఏర్పాటుచేసిన నిధికి విరాళాలు సేకరించే ఉద్దేశంతో సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబరు 7న సైనిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో 75 ఏళ్లుగా చేపడుతున్నారు.

అండగా ఉంటూ..

సైనికుల కోసం 1948లో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ నిధిని ఏర్పాటుచేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి అధ్యక్షుడిగా, సభ్యులుగా సహాయ మంత్రి, ఆర్మీ, నావికా, వాయుసేన దళాల సైన్యాధ్యక్షులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ నిధికి అధ్యక్షుడిగా రాష్ట్ర గవర్నర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా, వివిధ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వీరమణం పొందిన సైనికులతోపాటు సమస్యల్లో ఉన్న వారి కుటుంబీకులకు, క్షతగాత్రులైన సైనికులకు అండగా ఉండేందుకు విరాళాలు సేకరిస్తారు.

మాజీ సైనికులకు ప్రయోజనాలు

  • గ్రూప్‌ 2, గ్రూప్‌ 4లో రిజర్వేషన్లు
  • వివాహం కోసం ఆర్థిక సాయం రూ.40 వేలు (ఇద్దరు కుమార్తెల వరకు)
  • మాజీ సైనికుడు మరణిస్తే కుటుంబానికి రూ.10 వేలు, భార్య, కుమారుడు, కూతురు మరణించినా అంతే మొత్తం అందజేస్తారు
  • స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం పావలా వడ్డీపై రుణ సదుపాయం కల్పిస్తారు
  • ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు
  • సీఎస్‌డీ క్యాంటీన్‌ ద్వారా వ్యాట్‌ మినహాయింపుపై సరుకులు
  • మాజీ సైనికుల పిల్లల ఉన్నత చదువుకోసం కోర్సును బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.36 వేల వరకు అందిస్తారు.

పథకాలు అమలయ్యేలా చర్యలు

తిసైనికులు, వారి కుటుంబాలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. సైనిక సంక్షేమ నిధికి విరాళాలు ఇవ్వడం ద్వారా వారికి చేయూతనిచ్చిన వారమవుతాం. సైనికుల సంక్షేమానికి తమ శాఖ తరఫున సేవలిందిస్తున్నాం. ప్రభుత్వపరంగా వారికి ఉన్న పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.

సత్యశ్రీ, ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని