logo

ఓట్ల పండుగ.. కాసులు మెండుగా

ఎన్నికలు ఆర్టీసీకి కాసులు కురిపించాయి. ఓటు వేసేందుకు చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో ఆదాయం సమకూరింది. సొంత వాహనాలున్న వారు మినహా మిగతా వారంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణానికి మొగ్గు చూపారు. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు నుంచే బస్సుల్లో రద్దీ పెరిగింది.

Published : 07 Dec 2023 01:04 IST

సంగారెడ్డి బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ (పాతచిత్రం)

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌ : ఎన్నికలు ఆర్టీసీకి కాసులు కురిపించాయి. ఓటు వేసేందుకు చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో ఆదాయం సమకూరింది. సొంత వాహనాలున్న వారు మినహా మిగతా వారంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణానికి మొగ్గు చూపారు. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు నుంచే బస్సుల్లో రద్దీ పెరిగింది. నిత్యం రూ.కోటిపైగా ఆదాయం రావడం విశేషం. నవంబరు 28, 29, 30వ తేదీల్లో రీజియన్‌లోని అన్ని రూట్లలో బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. పోలింగ్‌ రోజు నారాయణఖేడ్‌ వైపు వెళ్లేవారు బస్సు టాపుపైనా ప్రయాణించారు.

మూడ్రోజుల్లో రూ.2.99 కోట్ల ఆదాయం..

ఉమ్మడి జిల్లాకు సంబంధించి మెదక్‌ రీజియన్‌ పరిధిలో 8 ఆర్టీసీ డిపోలున్నాయి. ఆయా డిపోల పరిధిలో 676 బస్సులుండగా.. నిత్యం సగటున 2.02 లక్షల కి.మీ తిప్పుతుంటారు. ఆదాయం సగటున రూ.86.85 లక్షలు వస్తుంది. ఎన్నికల వేళ అది రూ.కోటి దాటింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలింగ్‌కు రెండ్రోజుల ముందు అంటే 28వ తేదీన బస్సులను 2.25 లక్షల కి.మీ. తిప్పారు. ఆ ఒక్క రోజు ఆర్టీసీకి రూ.1.02 కోట్ల ఆదాయం వచ్చింది. 29వ తేదీ కి.మీ.లు తగ్గినా ఆదాయం మాత్రం అంతకుమించి రావడం విశేషం. 2.05 లక్షల కి.మీ. మాత్రమే బస్సులు తిరగ్గా రూ.1.03 కోట్లు వచ్చింది. పోలింగ్‌ రోజు (నవంబరు 30) ఆర్టీసీ ఉద్యోగులూ ఓట్లు వేసేందుకు వెళ్లడం తదితర కారణాలతో 1.57 లక్షల కి.మీ.లు తిప్పగా రూ.94.46 లక్షల ఆదాయం ఆర్టీసీ ఖాతాలోకి చేరింది. మూడ్రోజుల్లో రీజియన్‌కు రూ.2.99 కోట్ల ఆదాయం వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని