logo

నిధులున్నా.. పనులు సున్నా

పలు గ్రామాలకు ప్రధానమైన తారు రోడ్లు పాడై ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. రోడ్లు బాగా లేవని ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నారు. పాడైపోతాయనే భయంతో ప్రైవేటు వాహనాలను తిప్పడానికి కూడా కొందరు సాహసించడం లేదు.

Updated : 07 Dec 2023 04:25 IST

అధ్వానంగా కొండాపూర్‌-నత్నాయిపల్లి గ్రామాల మధ్య రోడ్డు

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: పలు గ్రామాలకు ప్రధానమైన తారు రోడ్లు పాడై ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. రోడ్లు బాగా లేవని ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నారు. పాడైపోతాయనే భయంతో ప్రైవేటు వాహనాలను తిప్పడానికి కూడా కొందరు సాహసించడం లేదు. రోడ్లు బాగున్న మార్గాల వైపు దారి మళ్లిస్తున్నారు. అధ్వానమైన గ్రామీణ రోడ్లను బాగు చేయడానికి ఏడాది క్రితం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ రోడ్ల పనులు చేసేందుకు రెండు సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. మూడోసారికి టెండరు ప్రక్రియ పూర్తిచేసి ఒప్పందం సైతం చేసినా పనుల ప్రారంభంలోనే తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పనులు త్వరితగతిన పూర్తయితే రోడ్లు బాగుపడి రవాణా సౌకర్యాలు మరింతగా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి.

తరచూ ప్రమాదాలు

చాలా గ్రామాలకు వెళ్లే రోడ్లు గోతులతో కయ్యలు ఏర్పడి, కంకర తేలి, దుమ్మూధూళితో దర్శనమిస్తున్నాయి. రోడ్లు బాగైతే ప్రజలకు దూరభారం తగ్గుతుంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను సాఫీగా మార్కెట్‌కు తరలించే అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలోని నర్సాపూర్‌, శివ్వంపేట, కౌడిపల్లి, హత్నూర, కొల్చారం, చిలప్‌చెడ్‌ మండలాల్లోని చాలా గ్రామాలకు తారు రోడ్లు నిర్మాణం జరిగిన నాటి నుంచి నిర్వహణ లేక తారు తొలగిపోయి, గుంతలు ఏర్పడి, కంకర తేలి ప్రజలకు నరకం చూపుతున్నాయి. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధీనంలోని ఈ రోడ్లు ప్రస్తుతం ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఇరుకైన రోడ్లపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వర్షాకాలంలో లోతైన గోతుల్లో నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.  

మార్చిలో టెండర్లు

నర్సాపూర్‌ మండలం కొండాపూర్‌-వయా కాగజ్‌మద్దూర్‌ మీదుగా నత్నాయిపల్లి, శేర్కాన్‌పల్లి వరకు ఉన్న తారు రోడ్డుకు రూ.2.67కోట్లు, రెడ్డిపల్లి వయా ఖాజీపేట మీదుగా రాజిపేట వరకు రూ.2.15కోట్లు, చిప్పల్‌తుర్తి-గోవింద్రాజ్‌పల్లి గ్రామాల మధ్య రోడ్డుకు రూ.2.90కోట్లు కేటాయించారు. శివ్వంపేట మండలం పోతులబోగుడ వయా ఉసిరికపల్లి, ఏదుల్లాపూర్‌, పాంబండ, భీమ్లా తండా వరకు రోడ్డుకు రూ.1.04కోట్లు, రత్నాపూర్‌-శివ్వంపేట, పిల్లుట్ల పూర్య తండా వరకు ఉన్న రోడ్డుకు రూ.1.40కోట్లు, సంగారెడ్డి-తూప్రాన్‌ రోడ్డు నుంచి వయా ఉసిరికపల్లి వయా ఏదుల్లాపూర్‌ రోడ్డుకు రూ.1.03కోట్లు, పిల్లుట్ల పిడబ్ల్యుడి రోడ్డు నుంచి తిమ్మాపూర్‌, గేమ్‌సింగ్‌ తండా రోడ్డుకు రూ.1.06కోట్లు నిధులు మంజూరయ్యాయి. పనులు చేపట్టడానికి రెండు సార్లు టెండర్‌ ప్రక్రియను చేపట్టినా ఎవరూ ముందుకు రాలేదు. మూడోసారి ఒకరు ముందుకు వచ్చారు. ఈ ఏడాది మార్చిలో టెండర్లు ఖరారు కాగా అగ్రిమెంట్‌ పూర్తిచేశారు. అయితే పనులు ప్రారంభంలోనే తీవ్ర జాప్యం జరుగుతుందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వెల్దుర్తి మండలం అందుగులపల్లి-మానెపల్లి రోడ్డు, వెల్దుర్తి జడ్పీ రోడ్డు నుంచి రెడ్డిగూడెం వరకు గల రోడ్డు, ఉప్పులింగాపూర్‌-దర్పల్లి రోడ్డు పనులు ఇటీవల పూర్తయ్యాయి.  మిగతా వాటి విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.

తగిన చర్యలు తీసుకుంటాం

- రాధికాలక్ష్మి, డీఈ, పీఆర్‌

గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరు కావడం టెండరు ప్రక్రియను పూర్తిచేయడం జరిగింది. పనులు పొందిన వారు దశల వారీగా చేపడుతూ వస్తున్నారు. పనులు చేసినా బిల్లులు సకాలంలో రావడం లేదని ఈ పనులు ప్రారంభించడానికి గుత్తేదారు వెనకాడుతున్నారు. సంబంధిత గుత్తేదారుతో మాట్లాడి వీలైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యో విధంగా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని