logo

అల్పాహారం అవస్థలమయం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు, హాజరుశాతం పెంచేందుకు చేపట్టిన అల్పాహార పథకం ఒక్కోచోట ఒక్కో విధంగా కొనసాగుతోంది. దసరా పండుగకు ముందు రెండు పాఠశాలల్లో ప్రారంభం కాగా, ఆ తర్వాత మిగిలిన కొన్నింటిలో అమలు చేస్తున్నారు.

Updated : 07 Dec 2023 04:25 IST

బిల్లులు రాక  ఇబ్బందిపడుతున్న నిర్వాహకులు

చిన్నగొట్టిముక్లలో ఉప్మా తింటున్న విద్యార్థులు

న్యూస్‌టుడే-మెదక్‌, మెదక్‌ రూరల్‌, నర్సాపూర్‌, అల్లాదుర్గం, టేక్మాల్‌, కౌడిపల్లి, శివ్వంపేట,  రామాయంపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు, హాజరుశాతం పెంచేందుకు చేపట్టిన అల్పాహార పథకం ఒక్కోచోట ఒక్కో విధంగా కొనసాగుతోంది. దసరా పండుగకు ముందు రెండు పాఠశాలల్లో ప్రారంభం కాగా, ఆ తర్వాత మిగిలిన కొన్నింటిలో అమలు చేస్తున్నారు. మెనూ ప్రకారం ఇస్తున్నా.. కొంత ఆలస్యంగా అందించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్న సమయంలో సరిపోవడం లేదు. పథకం ప్రారంభమై నెలన్నర రోజుల పైబడి గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. దీంతో కొన్ని చోట్ల నిర్వాహకులు చేతులెత్తేశారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న అల్పాహార పథకం అమలుపై బుధవారం ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించింది. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 624, ప్రాథమికోన్నత 129, ఉన్నత పాఠశాలలు 146 ఉన్నాయి. అక్టోబర్‌ 6న మెదక్‌లోని ప్రభుత్వ బాలికోన్నత, శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు. దసరా పండుగ అనంతరం మరికొన్ని పాఠశాలల్లో అమలు చేశారు.

బిల్లులు రాక...

అల్పాహార పథకాన్ని మధ్యాహ్న భోజన నిర్వాహకులే కొనసాగిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.10.50 చొప్పున ప్రభుత్వ ఇవ్వనుంది. జిల్లాలో 64 పాఠశాలల్లో ఈ పథకం అమలవుతుండగా, అందులో 14 పాఠశాలల్లో అక్షయపాత్ర వారు సరఫరా చేస్తున్నారు. పథకం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంత వరకు నిర్వాహకులకు డబ్బులు రాలేవు. దీంతో పది పాఠశాలల్లో నిలిపివేశారు. బిల్లులు సిద్ధం చేసి, పంపినా ఇంకా బడ్జెట్‌ మంజూరు కాలేదు.  

ఇదీ పరిస్థితి...

  • మెనూ ప్రకారం బుధవారం ఉప్మా, సాంబారు, రవ్వ, కిచిడి చట్నీ పెట్టాల్సి ఉండగా అల్లాదుర్గం బాలుర ప్రాథమిక పాఠశాలలో సుశీల(మరమరాలతో తయారు చేసింది) అల్పాహారంగా ఇచ్చారు. అల్లాదుర్గం బాలికల ప్రాథమిక పాఠశాలలో ఉదయం 10 గంటలు దాటినా అందించలేదు. డీఎన్‌టీ నడిమి తండాలో 13 మంది హాజరుకాగా కిలో ఉప్మాను వడ్డించారు. సాంబారు లేదు.  
  • మెదక్‌ మండల పరిధి రాజ్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో అల్పాహారం ప్రారంభమై నెలరోజులవుతున్నా డబ్బులు ఇప్పటి వరకు రాలేదని కార్మికులు వాపోతున్నారు.
  • కౌడిపల్లి మండల కేంద్రంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో కొంచెం ఆలస్యంగా దొడ్డురవ్వతో చేసిన ఉప్మాను అందించగా ప్రాథమిక పాఠశాలలో అటుకులు అందించారు.  
  • శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్లలోని ఉన్నత పాఠశాలకు 166మంది, ప్రాథమిక పాఠశాలకు చెందిన 45మంది విద్యార్థులు ఉండగా 200 మందికి అల్పాహారం అందిస్తున్నారు.  
  • నిజాంపేట మండలం చల్మెడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పొంగలి అందజేశారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు.
  • టేక్మాల్‌ ఉన్నత పాఠశాలలో 511 మంది విద్యార్థులు ఉండగా నిత్యం 330 వరకు హాజరవుతున్నారు. బుధవారం తక్కువ మందికి వంట చేయగా ఎక్కువ మంది హాజరుకావడంతో సరిపోలేదు. కుసంగిలో 98 మంది ఉండగా నిత్యం 60 మంది వరకు హాజరవుతున్నారని తెలిపారు.
  • నర్సాపూర్‌లోని 8ప్రభుత్వ పాఠశాలల్లో అక్షయపాత్ర ద్వారా నిత్యం ఉదయం 9గంటలలోపు విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. దొడ్డు రవ్వతో కూడిన ఉప్మా అందించారు. మండల పరిధి గ్రామాల్లోని పాఠశాలల్లో ఎక్కడా ఇది అమలు కావడంలేదు.

టేక్మాల్‌లో సుశీల వడ్డిస్తూ..

బడ్జెట్‌ రాగానే చెల్లింపులు: రాధాకిషన్‌, జిల్లా విద్యాధికారి

గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం ప్రారంభం కావడంతో ప్రస్తుతం ట్రయల్‌ కోసం ఆయా పాఠశాలల్లో అమలు చేస్తున్నాం. మెనూ ప్రకారం అల్పాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజు విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్నాం. నిర్వాహకులకు బిల్లులు చెల్లింపు విషయమై వివరాలను నమోదు చేస్తున్నాం. బడ్జెట్‌ రాగానే వారికి చెల్లిస్తాం.

మెనూ ఇలా..

సోమవారం - ఇడ్లీ, సాంబారు లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం - పూరీ, ఆలూ కుర్మ లేదా టమోటా బాత్‌, సాంబారు
బుధవారం - ఉప్మా, సాంబారు లేదా రైస్‌ రవ్వ కిచిడీ, చట్నీ
గురువారం - మిల్లెట్‌ ఇడ్లీ, సాంబారు లేదా పొంగల్‌, సాంబారు
శుక్రవారం - ఉగ్గని/పొహ/మిల్లెట్‌ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం - పొంగల్‌, సాంబారు లేదా  వెజిటేబుల్‌ పులావ్‌, రైతా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని